నేడు విజయోత్సవ సభ
ABN , Publish Date - May 22 , 2025 | 02:09 AM
తిరుపతి కపిలతీర్థం సమీపాన శేషాచల కొండకు ఆనుకుని ఈశాన్యంలో ఉండే ఈ ప్రాంతం రాజకీయ నాయకులకు ఓ సెంటిమెంట్. ఎన్నికలు ముంచుకొస్తే రాజకీయ పార్టీలకు జీవకోన గుర్తుకొస్తుంది. ఇక్కడ నుంచే రాజకీయ ప్రచార ఢంకా మోగించేందుకు పోటీపడతారు. కానీ ఎన్నికలైన తర్వాత అటువైపు కన్నెత్తి చూసేందుకు కూడా ఇష్టపడరు.
జీవకోనకు ఎమ్మెల్యే ఆరణి, ఆంధ్రజ్యోతి ఈడీ ఆదిత్య, అధికారుల రాక
సీసీ రోడ్డుకు భూమిపూజ, పోలీస్ అవుట్ పోస్ట్ ప్రారంభం
‘అక్షరం అండగా.. పరిష్కారమే అజెండాగా..’లో సమస్యలకు పరిష్కారం
తిరుపతి, మే 21 (ఆంధ్రజ్యోతి): తిరుపతి కపిలతీర్థం సమీపాన శేషాచల కొండకు ఆనుకుని ఈశాన్యంలో ఉండే ఈ ప్రాంతం రాజకీయ నాయకులకు ఓ సెంటిమెంట్. ఎన్నికలు ముంచుకొస్తే రాజకీయ పార్టీలకు జీవకోన గుర్తుకొస్తుంది. ఇక్కడ నుంచే రాజకీయ ప్రచార ఢంకా మోగించేందుకు పోటీపడతారు. కానీ ఎన్నికలైన తర్వాత అటువైపు కన్నెత్తి చూసేందుకు కూడా ఇష్టపడరు. జీవకోన అంటే రాజకీయ పార్టీలు ఓటు బ్యాంకుగానే చూస్తాయి. శ్రామిక, కార్మిక వర్గాలు అధికంగా ఉండే ఈ ప్రాంతం తిరుపతికి మానవ వనరు కేంద్రంగా కనిపిస్తుంది. జీవకోన పరిధిలోని రాజీవ్ గాంధీ కాలనీ, సత్యనారాయణపురం, సాయినగర్, క్రాంతినగర్, పార్వతీపురం, సంతోషమ్మ నగర్, శ్రీనగర్ కాలనీలు ఉన్నాయి. 5 డివిజన్లు కలిగిన ఈప్రాంతంలో 12వేలకు పైగా గృహాలు, సుమారు 60వేల జనాభా కలిగివుంది. పేరులో కోన ఉంది కానీ ఇక్కడ తాగునీటి కష్టాలే. గుంతలపడ్డ రోడ్లు, అల్లరి మూకల ఆగడాలు, పారిశుధ్య లోపాలపై ‘ఆంధ్రజ్యోతి’ సచిత్రాలతో ప్రత్యేక కథనాలను ప్రచురించింది. ఈ క్రమంలో జనవరి 28న ‘ఆంధ్రజ్యోతి’ అధ్యక్షతన ‘అక్షరం అండగా సమస్యల పరిష్కారమే అజెండాగా’ జరిగిన సదస్సుకు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, అధికారులు అతిథులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రజలు లేవనెత్తిన సమస్యల పరిష్కారం కోసం ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, కమిషనర్ మౌర్య, ఎస్పీ హర్షవర్ధన్‌రాజు ప్రత్యేక చొరవ చూపెట్టారు. ఇప్పటికి కార్పొరేషన్ అఽధ్వర్యంలో దాదాపు రూ.65 లక్షలతో సీసీ రోడ్లు, డ్రైన్లు, ప్యాచ్ వర్కులు పూర్తయ్యాయి. మరో రూ52.30లక్షల పనులకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. ఈ క్రమంలో ‘ఆంధ్రజ్యోతి’ ఆధ్వర్యంలో గురువారం జీవకోనలో విజయోత్సవ సభ నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా పలు పనులకు భూమిపూజ చేయనున్నారు.
ఇవి చేశారు
ఎమ్మెల్యే తన సొంత నిధులతో ఇటీవల రెండు ఆర్వో వాటర్ ప్లాంట్లు ఏర్పాటుచేశారు.
తిరుమల బైపాస్ నుంచి సత్యనారాయణపురం వెళ్లే 30 మీటర్ల రోడ్డు పనుల పూర్తి
రాళ్లుతేలిన సత్యనారాయణపురం- ఎర్రమిట్ట తూర్పు రోడ్డుకు రూ.37.5 లక్షలతో నిర్మాణం
క్రాంతి నగర్, పార్వతి నగర్‌లో దెబ్బతిన్న డ్రైనేజీ కాలువలకు రూ.9.97లక్షలతో మరమ్మతులు
బాలగంగమ్మ గుడి సమీపంలోని మాధవ నగర్లో రూ7.40లక్షలతో సీసీ రోడ్డును కార్పొరేషన్ నిర్మించింది.
ఎస్పీ హర్షవర్ధన్‌రాజు ఆధ్వర్యంలో ఏర్పాటైన పోలీస్ అవుట్ పోస్టు గురువారం ప్రారంభంకానుంది.
ఇవి చేయనున్నారు
గోవిందనగర్‌లో రూ.6.50లక్షలతో సీసీ రోడ్డు
జ్యోతి లెప్రసీ కాలనీలో రూ9.90 లక్షలతో.. రాజీవ్‌గాంధీ కాలనీలో రూ9.96లక్షలతో.. అరుణోదయ నగర్, సత్యనారాయణపురంలో రూ9.95 లక్షలతో సీసీ డ్రైన్ల నిర్మాణం
క్రాంతి నగర్, విజయపురం, పార్వతి నగర్ వద్ద రూ6 లక్షలతో యూడీఎస్ లైన్ పునరుద్ధరణ, సీసీ ప్యాచ్ పనులు
రూ10 లక్షలతో శ్మశాన వాటిక ప్రహరీ, సంతోషనగర్లో నీటి సంపు, పైపులైన్ల పనులు
ఇంకా..
తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ (తుడా) రూ.35లక్షలతో జీవకోన వద్ద గల లెప్రసీ కాలనీలో రోడ్డు నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేసింది.
జీవకోన మొత్తం 120 సీసీ కెమెరాలను పోలీస్ శాఖ ఏర్పాటు చేయనుంది.
వేదిక: శ్రీలలితా త్రిపుర సుందరి ఆలయంలోని ఫంక్షన్ హాలు
సమయం: గురువారం ఉదయం 10 గంటలకు
అతిథులు: ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, ‘ఆంధ్రజ్యోతి’ ఈడీ వేమూరి ఆదిత్య, కమిషనర్ మౌర్య, ఎస్పీ హర్షవర్ధన్‌రాజు, స్థానిక కార్పొరేటర్లు అన్నా అనిత, అన్నా సంధ్య, స్థానిక నాయకులు