గంటపాటు ఆలయంలో ఉపరాష్ట్రపతి, సీఎం
ABN , Publish Date - Sep 26 , 2025 | 01:49 AM
ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, సీఎం చంద్రబాబు నాయుడు గురువారం ఉదయం గంటపాటు తిరుమల ఆలయంలో గడిపారు. ఉదయం 8.35 గంటలకు మహద్వారం నుంచి ఆలయప్రవేశం చేశారు. గర్భాలయంలోని శ్రీవారిని దర్శించుకుని 9 గంటలకు రంగనాయక మండపానికి చేరుకున్నారు.
తిరుమల, సెప్టెంబరు 25(ఆంధ్రజ్యోతి): ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, సీఎం చంద్రబాబు నాయుడు గురువారం ఉదయం గంటపాటు తిరుమల ఆలయంలో గడిపారు. ఉదయం 8.35 గంటలకు మహద్వారం నుంచి ఆలయప్రవేశం చేశారు. గర్భాలయంలోని శ్రీవారిని దర్శించుకుని 9 గంటలకు రంగనాయక మండపానికి చేరుకున్నారు. వేదపండితలు ఆశీర్వచనం తర్వాత 9.25 గంటలకు ఆలయం వెలుపలకు వచ్చారు. బయట వాహనాల వద్దకు వెళుతూ గ్యాలరీల్లోని భక్తులకు అభివాదం చేశారు. సమీపంలో ఉన్న కొందరు పిల్లలను సీఎం ఆప్యాయంగా పలకరించారు. వీరిద్దరు ఆలయం వెలుపలకు వచ్చే క్రమంలో కొద్ది సమయంలో అన్నదానం సమీపంలో వాహనాన్ని ఆపడంతో పాటు అక్కడక్కడ గేట్లు వేశారు. దీన్ని గమనించిన సీఎం వెంటనే గేట్లు తెరవాలని ఆదేశాలిచ్చారు. దీంతో వాహనసేవ యదావిధిగా ముందుకు సాగింది.
వీవీఐపీల సందడి
బ్రహ్మోత్సవాల ప్రారంభం సమయంలో తిరుమల మొత్తం వీవీఐపీలతో హడావుడిగా కనిపించింది. పట్టువస్ర్తాలు సమర్పించడానికి వచ్చిన సీఎంతో పాటు ఉపరాష్ట్రపతి, మంత్రులు లోకేశ్, అనగాని సత్యప్రసాద్, ఆనం రామనారాయణరెడ్డి, ఎమ్మెల్యేలు ఉండడంతో తిరుమల క్షేత్రం సైరన్లమోతతో మారుమోగింది. వీవీఐపీలు వెంట ఉన్నతాధికారులు అంతా ఉండాల్సిరావడంతో గురువారం ఉదయం జరిగిన చిన్నశేషవాహన సేవలో చాలా మంది ఉన్నతాధికారులు పాల్గొనలేకపోయారు. ప్రారంభం, ముగింపులో మాత్రమే ఉన్నతాధికారులు కనిపించారు. వీఐపీల వల్ల అక్కడక్కడ గేట్లకు తాళాలు వేయడంతో భక్తుల రాకపోకలకు ఇబ్బంది తలెత్తింది. విధులకు వెళ్లాల్సిన ఉద్యోగులు కూడా ఇక్కట్లు ఎదుర్కొన్నారు. ప్రధానంగా రాంభగీచా, మినీషాపింగ్ కాంప్లెక్స్ వంటి ప్రాంతాల్లో ఈ సమస్యలు కనిపించాయి.