కఠారి దంపతుల హత్య కేసు తీర్పు వాయిదా
ABN , Publish Date - Oct 28 , 2025 | 12:41 AM
చిత్తూరు ప్రథమ మేయర్ కఠారి అనురాధ దంపతుల హత్య కేసు తీర్పును ఈనెల 30వ తేదీకి వాయిదా వేశారు.
చిత్తూరు లీగల్, అక్టోబరు 27 (ఆంధ్రజ్యోతి): చిత్తూరు ప్రథమ మేయర్ కఠారి అనురాధ దంపతుల హత్య కేసు తీర్పును ఈనెల 30వ తేదీకి వాయిదా వేశారు. కఠారి అనురాధ, కఠారి మోహన్ 2015 నవంబరు 17న నగరపాలక కార్యాలయంలో హత్యకు గురయ్యారు. ఈ కేసు విచారణ పూర్తయిన తర్వాత ఈనెల 24న చంద్రశేఖర్ అలియాస్ చింటూ, వెంకటాచలపతి, జయప్రకా్‌షరెడ్డి, మంజునాథ్, వెంకటేశ్‌లను నిందితులుగా తేల్చారు. సోమవారం తుదితీర్పు ఉంటుందని న్యాయమూర్తి ప్రకటించిన నేపథ్యంలో ఆ ఐదుగురిని పోలీసులు 9వ అదనపు జిల్లా కోర్టులో హాజరుపరిచారు. చింటూ తరపున న్యాయవాది విజయచంద్రారెడ్డి పది నిమిషాల పాటు తమ వాదనను వినిపించారు. అనంతరం చింటూ జరిగిన సంఘటనకు పశ్చాత్తాపపడుతున్నానని న్యాయమూర్తి శ్రీనివాసరావు వద్ద వాపోయాడు. తన తల్లి అనారోగ్యంతో ఉందని, ఈ కేసు నుంచి తప్పిస్తే వ్యాపారంతో పాటు సంఘ సేవ చేసుకుంటానన్నాడు. మిగిలిన నిందితులూ తమ ఆవేదనను కోర్టులో వెల్లడించారు. ఆ ఐదుగురు ఇచ్చిన వాంగ్మూలాన్ని పరిగణనలోకి తీసుకున్నామని మధ్యాహ్నం 1.20 గంటలకు న్యాయమూర్తి చెప్పారు. ప్రభుత్వాస్పత్రి వైద్యులు, పోలీసులు వారి వాంగ్మూలాలపై నిజానిజాలు పరిశీలించి నివేదికను 30వ తేదీ మధ్యాహ్నం అందజేయాలని న్యాయమూర్తి ఆదేశించారు. అదే రోజు తీర్పును వెల్లడిస్తానని తెలిపారు.