స్మార్ట్ మీటర్లతో ఉపయోగకరమే
ABN , Publish Date - Aug 05 , 2025 | 02:12 AM
విద్యుత్ పంపిణీ సంస్థలో ఆధునిక సాంకేతిక వ్యవస్థ అందుబాటులోని వస్తున్న సమయంలో వినియోగదారులకు, సంస్థకు ఉపయోగకరంగా ఉండేందుకు, అన్ని కేటగిరిల్లో (వ్యవసాయరంగం తప్ప) స్మార్ట్ మీటర్లు అమర్చుతున్నట్లు సదరన్ డిస్కం సీఎండీ కె.సంతోషరావు సోమవారం వెల్లడించారు.
వినియోగదారులపై భారం పడదు
సదరన్ డిస్కం సీఎండీ సంతోషరావు
తిరుపతి(ఆటోనగర్), ఆగస్టు 4 (ఆంధ్రజ్యోతి): విద్యుత్ పంపిణీ సంస్థలో ఆధునిక సాంకేతిక వ్యవస్థ అందుబాటులోని వస్తున్న సమయంలో వినియోగదారులకు, సంస్థకు ఉపయోగకరంగా ఉండేందుకు, అన్ని కేటగిరిల్లో (వ్యవసాయరంగం తప్ప) స్మార్ట్ మీటర్లు అమర్చుతున్నట్లు సదరన్ డిస్కం సీఎండీ కె.సంతోషరావు సోమవారం వెల్లడించారు. గతంలో విద్యుత్ సంస్థలో చక్రం తిరుగుతూ రీడింగ్ చూపించే మెకానిక్ మీటరు ఉండేదన్నారు. సాంకేతికత పెరిగేకొద్దీ వాటి స్థానంలో డిజిటల్ మీటర్లు వచ్చాయన్నారు. డిజిటల్ మీటరు, స్మార్ట్ మీటరుతో సమానమేనని ఆయన చెప్పారు. ఈ స్మార్ట్ మీటరుతో విద్యుత్ వినియోగాన్ని ప్రతి రోజు, ప్రతి గంటా పరిశీలించుకోవచ్చన్నారు. వినియోగం ఎక్కువ అవుతుందని తెలిస్తే, పొదుపుగా వాడుకొనే అవకాశం ఉందన్నారు. వినియోగదారులపై పెరిగే భారాన్ని, వారే నియంత్రించుకోవచ్చన్నారు. వినియోగదారులు ఎక్కడున్నా ఆన్‌లైన్‌లో మీటర్ రీడింగ్ పరిశీలించుకోవచ్చని సూచించారు. ఇది కచ్చితమైన మీటర్ రీడింగ్ చూపిస్తుందని చెప్పారు. విద్యుత్ లోడ్‌ను ఎప్పటి కప్పుడు చెక్ చేసుకోవ్చన్నారు. మీటర్ రీడింగ్ నిర్ణయించిన తేదీలో తీసే అవకాశం ఉందన్నారు. ప్రతి ఇంటికి వెళ్ళి రీడింగ్ తీసే అవసరం వుండదన్నారు. స్మార్ట్ మీటర్లు అమర్చే విషయంలో వినియోగదారులు అపోహలు వీడాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కేంద్ర ప్రభుత్వ విద్యుత్ పంపిణీ పునర్ వ్వవస్థీకరణ పథకం(ఆర్డీఎ్‌సఎ్‌స)లో భాగంగా ఈ మీటర్లు అమర్చుతున్నారని చెప్పారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ నియంత్రణా మండలి (ఏపిఈఆర్‌సీ) 2021 ఫిబ్రవరిలో ఈ మీటర్లు అమర్చడానికి అనుమతులు మంజూరు చేసిందన్నారు. ఈ మేరకు సదరన్ డిస్కం సంస్థ పరిధిలోని 1,52,016 ప్రభుత్వ రంగ సంస్థలకు, 53,64,841 వాణిజ్య సర్వీసులకు, 43009 పరిశ్రమలకు మాత్రమే ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. గృహ విద్యుత్ సర్వీసుల్లో 200 యూనిట్ల కంటే ఎక్కువగా విద్యుత్ వినియోగిస్తున్న సర్వీసులను గుర్తించి దశల వారీగా ఈ మీటర్లు ఏర్పాటు చేస్తామన్నారు. ఈ మీటరు విలువ రూ.ఆరు వేలు ఉండొచ్చని, వినియోగదారులకు ఉచితంగా అమర్చతామని చెప్పారు. ఈ స్మార్టు మీటర్లు అమర్చాక వినియోగ బిల్లుల్లో మీటరు కోసం అదనపు చార్జీలు విధించేది లేదని ఆయన స్పష్టం చేశారు. స్మార్ట్ మీటర్లపై వినియోగదారులకు అవగాహనా కార్యక్రమాలు చేపడతామన్నారు. వీటిపై వినియోగదారులకు అనుమానాలుంటే టోల్ ఫ్రీ నెంబరు 1912 కు ఫోన్ చేసి నివృత్తి చేసుకోవచ్చన్నారు.