Share News

ఖరీఫ్‌ రైతులకు యూరియా కష్టాలు...!

ABN , Publish Date - Jul 17 , 2025 | 12:52 AM

ఖరీఫ్‌ సీజన్‌లో రైతులను తాజాగా యూరియా కష్టాలు వెంటాడుతున్నాయి. మేలో ప్రకృతి అనుకూలిస్తుందని భావించిన రైతులు పంటల సాగుపై ఆశలు పెంచుకున్నారు. జూన్‌ మొదటి వారంలో వర్షాలు కురుస్తాయని భావిస్తే రైతులకు నిరాశే మిగిలింది. దీనికి తోడు వేరుశనగ విత్తనాల కొరత వెంటాడింది. ఇప్పుడేమో యూరియా కొరత పట్టి పీడిస్తోంది.

ఖరీఫ్‌ రైతులకు యూరియా కష్టాలు...!
బంగారుపాళ్యంలో ఎరువుల కేంద్రం వద్ద యూరియా కోసం వేచివున్న రైతులు

చిత్తూరు సెంట్రల్‌, జూలై 16(ఆంధ్రజ్యోతి): ఖరీఫ్‌ సీజన్‌లో రైతులను తాజాగా యూరియా కష్టాలు వెంటాడుతున్నాయి. మేలో ప్రకృతి అనుకూలిస్తుందని భావించిన రైతులు పంటల సాగుపై ఆశలు పెంచుకున్నారు. జూన్‌ మొదటి వారంలో వర్షాలు కురుస్తాయని భావిస్తే రైతులకు నిరాశే మిగిలింది. దీనికి తోడు వేరుశనగ విత్తనాల కొరత వెంటాడింది. ఇప్పుడేమో యూరియా కొరత పట్టి పీడిస్తోంది.

ఖరీఫ్‌ సీజన్‌లో జిల్లాలోని 1,18,386 మంది రైతులు 1,78,262 ఎకరాల్లో 22 రకాల పంటలు సాగు చేయనున్నారు. మరో 90 వేల మంది రైతులు 85 వేల ఎకరాల్లో ఉద్యాన పంటలైన టమోటా, బొప్పాయి, సపోటా, అరటి, జామ తదితర పంటలతో పాటు పూల సాగు చేపట్టారు.28,010 ఎకరాల్లో సాగు చేసే వరితో పాటు 1160 ఎకరాల్లోని ఆవుగడ్డి, 17,127 ఎకరాల్లోని గడ్డి, 18,732 ఎకరాల్లోని చెరకుతో పాటు 85 వేల ఎకరాల్లో సాగు చేసే ఉద్యాన పంటలకు యూరియా అవసరం వుంది.ఈ సీజన్‌లో 1160 ఎకరాల్లో వరి సాగు లక్ష్యం కాగా ఇప్పటి వరకు 1140 ఎకరాల్లో రైతులు సాగు చేశారు. వరి పంట చేతికి రావాలంటే యూరియా తప్పనిసరైంది. వాతావరణం అనుకూలించకపోవడంతో రైతులు పాడిపై ఆధారపడాల్సి వస్తోంది. ఆవుగడ్డిసాగు అధికమైంది. దీన్ని పెంచుకోడానికి రైతులు అధికంగా యూరియాను వాడాల్సిన పరిస్థితి వచ్చింది. వీటితో పాటు ఉద్యాన పంటలకు యూరియా తప్పనిసరి కావడంతో దానికి డిమాండ్‌ ఏర్పడింది.

చాలీ చాలని ఎరువులు

ఖరీఫ్‌ సీజన్‌లో 55 వేల మెట్రిక్‌ టన్నుల ఎరువుల అవసరం వుండగా, 40,320 మెట్రిక్‌ టన్నులు మాత్రమే అందుబాటులో ఉంచారు. సీజన్‌ మొదట్లోనే దాదాపు 15 వేల మెట్రిక్‌ టన్నుల ఎరువుల కొరత ఏర్పడింది. తొలి స్టాక్‌ అయిపోగా, వారం రోజుల కిందట 3550 మెట్రిక్‌ టన్నులు జిల్లాకు చేరాయి. ప్రస్తుతం 530 మెట్రిక్‌ టన్నుల యూరియా రైతు సేవా కేంద్రాల్లో అందుబాటులో ఉంచగా, డీలర్ల వద్ద 900 మెట్రిక్‌ టన్నులు, మార్క్‌ఫెడ్‌ గోదాములో 2 వేల టన్నులు ఉన్నాయని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. వరితో పాటు కొన్ని పంటలకు తగినంత మోతాదులో యూరియా వాడాల్సి ఉండగా, రైతులు వరితో పాటు ఎక్కువగా గడ్డి, పూల, ఉద్యాన పంటల సాగుకు వినియోగిస్తుండటం యూరియా కొరతకు కారణమని అధికారులు చెబుతున్నారు. యూరియా అధిక మోతాదులో వాడితే భూసారం తగ్గిపోతుందనిహెచ్చరిస్తున్నారు.

Updated Date - Jul 17 , 2025 | 12:52 AM