Srikalahasti: శ్రీకాళహస్తిలో కలకలం..
ABN , Publish Date - Jul 13 , 2025 | 01:37 AM
:మాజీ పీఏ హత్య కేసులో శ్రీకాళహస్తి జనసేన ఇంఛార్జి వినుత దంపతులను చెన్నై పోలీసులు అరెస్టు చేయడం రాజకీయవర్గాల్లో కలకలం రేపింది.అసలేం జరిగిందో తెలియక పార్టీ వర్గాలతో పాటు ప్రజానీకం కూడా అయోమయానికి లోనైంది.
హత్యకు కారణాలపై పలు అనుమానాలు
శ్రీకాళహస్తి/తిరుపతి, జూలై 13 (ఆంధ్రజ్యోతి): మాజీ పీఏ హత్య కేసులో శ్రీకాళహస్తి జనసేన ఇంఛార్జి వినుత దంపతులను చెన్నై పోలీసులు అరెస్టు చేయడం రాజకీయవర్గాల్లో కలకలం రేపింది.అసలేం జరిగిందో తెలియక పార్టీ వర్గాలతో పాటు ప్రజానీకం కూడా అయోమయానికి లోనైంది.రేణిగుంట పట్టణానికి చెందిన వినుతను 2019లో జనసేన పార్టీ శ్రీకాళహస్తి నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా ప్రకటించారు. బంగారుపాళ్యానికి చెందిన కోట చంద్రబాబుతో అదే సంవత్సరంలో ఆమెకు వివాహం జరిగింది. ఆ సంవత్సరం అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన తరఫున పోటీ చేసి ఓడిపోయారు. శ్రీకాళహస్తి పట్టణంలో వినుత దంపతులు అద్దె ఇంట్లో నివాసం, పార్టీ కార్యాలయం ఏర్పాటు చేసుకుని కార్యకలాపాలు సాగించేవారు.
ఎవరీ శ్రీనివాసులు?
ఆరేళ్ళుగా వినుత వద్ద డ్రైవరుగా, వ్యక్తిగత సహాయకుడిగా శ్రీకాళహస్తి మండలం బొక్కిసపాలెం గ్రామానికి చెందిన రాజేశ్వరమ్మ మనవడు శ్రీనివాసులు అలియాస్ రాయుడు పని చేసేవాడు.వారితో అత్యంత సన్నిహితంగా మెలిగేవాడు.ఈ క్రమంలో గత నెల 22వ తేదీన శ్రీనివాసులును పనిలో నుంచి తొలగిస్తున్నట్లు వినుత దంపతులు మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. తమ రాజకీయ ప్రత్యర్థుల ప్రలోభాలకు లొంగిన శ్రీనివాసులు ప్రాణ, గౌరవ అంశాలలో భంగం కలిగిస్తున్నాడన్న కారణంతో తొలగిస్తున్నట్లు అందులో పేర్కొన్నారు.వినుతకు సంబంధించిన కొన్ని వీడియోలు, ఇతర సమాచారం రాజకీయ ప్రత్యర్థులకు శ్రీనివాసులు అందజేస్తున్నాడనే అనుమానాలు రావడంతోనే అతడిని పీఏగా తొలగించినట్టు ప్రచారం జరుగుతోంది.అనంతరం వినుత, ఆమె కుటుంబీకులు, అనుచరులు పలుమార్లు శ్రీనివాసులును నిర్బంధించి చిత్రహింసలకు గురి చేసినట్టు ఆరోపణలున్నాయి. తమ సమాచారం ఎవరు అడిగారు? ఏ సమాచారం అందజేశావు? వంటి వివరాలు రాబట్టేందుకు హింసించారని, తాము హింసించిన దృశ్యాలను వీడియో తీయడంతో ఆ సందర్భంగా శ్రీనివాసులు చెప్పిన విషయాలను కూడా వీడియో రికార్డింగ్ చేశారని సమాచారం. గత నెలలో ఒకసారి, మళ్ళీ ఈనెల ప్రారంభంలో ఒకసారి రేణిగుంట గోదాములో నిర్బంధించి చిత్రహింసలు పెట్టినట్టు ఆరోపణలున్నాయి.
హత్యకు దారితీసిన కారణాలేంటి?
గత ఎన్నికలకు ముందు నుంచీ కూడా వినుతకు జనసేనలోనే ఇతర నేతలతో సత్సంబంధాలు, సామరస్యం లేదని సమాచారం. కూటమిలోని మరో ప్రధాన పార్టీ ముఖ్యనేతతో సైతం సత్సంబంధాలు లేవని, కొంతమేరకు విభేదాలు కూడా వున్నాయనే ప్రచారం జరిగింది. ఎన్నికల తర్వాత ప్రభుత్వ, పాలనా వ్యవహారాల్లో ప్రాఽధాన్యత బాగా తగ్గిపోయింది. ఆ క్రమంలో నియోజకవర్గ ముఖ్యనేతపై వినుత మంత్రులకు ఫిర్యాదులు చేశారన్న ప్రచారం జరిగింది. వీటన్నింటి నేపధ్యంలో వినుత సన్నిహిత అనుచరులు క్రమేపీ ఆమెకు దూరమైనట్టు సమాచారం. దాని వెనుక తన రాజకీయ ప్రత్యర్థులున్నారని, వారి ప్రలోభాలతోనే తన అనుచరులు దూరమవుతున్నారని వినుత సన్నిహిత వర్గాలు అసంతృప్తితో వున్నట్టు తెలిసింది. అదే సమయంలో పీఏ శ్రీనివాసులు ఆమెకు సంబంధించిన కొన్ని వీడియోలు, ఇతర సమాచారం రాజకీయ ప్రత్యర్థులకు అందజేస్తున్నాడనే అనుమానాలు రావడంతోనే అతడిని కొట్టి వేధించారని సమాచారం.
రేణిగుంటలో హతమార్చి...చెన్నైలో పడవేసి..
ఈనెల 7వ తేదీన శ్రీనివాసులును రేణిగుంట గోదాముకు తీసుకెళ్ళి తీవ్రంగా కొట్టారని, ఆ సందర్భంగా కూడా వీడియోలు తీశారని, అతడు చెప్పిన సంగతులు కూడా రికార్డు చేశారని సమాచారం. బాత్‌రూమ్‌కు వెళ్ళిన శ్రీనివాసులు అందులోనే చనిపోయాడని, దాంతో వారు శ్రీనివాసులు మృతదేహాన్ని తీసుకుని రెండు కార్లలో తమిళనాడు వైపు వెళ్ళినట్టు సమాచారం. తిరువళ్ళూరు చేరుకున్నాక ఏపీ రిజిస్ట్రేషన్‌తో వున్న కారు నుంచీ మృతదేహాన్ని తమిళనాడు రిజిస్ట్రేషన్ కలిగిన కారులోకి మార్చి చెన్నై వెళ్ళినట్టు తెలిసింది. చెన్నై చేరుకున్నాక అదే రోజు రాత్రి సెవెన్ వెల్స్ ప్రాంతంలోని ఎంఎస్ నగర్ హౌసింగ్ కాలనీ వెనుక కువ్వా నది కాలువలో పడవేసినట్టు చెన్నై పోలీసుల దర్యాప్తులో తేలింది.
చెన్నై పోలీసుల దర్యాప్తులో హత్యగా నిర్ధారణ
ఈనెల 8వ తేదీన కువ్వా నది కాలువలో మృతదేహాన్ని స్థానికులు గుర్తించడంతో మింట్ పోలీస్ స్టేషన్ పోలీసుల దృష్టికి వెళ్ళింది. వారు శవాన్ని పోస్టుమార్టమ్‌కు తరలించి కేసు నమోదు చేశారు.పోస్టుమార్టం నివేదిక ఆ యువకుడిది హత్యేనని తేల్చి చెప్పింది.శరీరంలోపలి భాగంలో పలుచోట్ల గాయాలైనట్లు స్పష్టం చేసింది.దీంతో పోలీసులు మృతదేహం లభించిన కాలువలో మళ్లీ పడవల సాయంతో గాలించారు. ఆ సమయంలో పోలీసులకు ఓ సంచీ, మొబైల్ ఫోన్ లభ్యమయ్యాయి. ఆ సంచీలో దొరికిన ఆధారాలను బట్టి తిరుపతికి చెందిన శ్రీనివాసులుగా గుర్తించిన పోలీసులు.. మొబైల్ ఫోన్ కాల్‌డేటాను పరిశీలించారు. మృతుడి కుడి చేతిపై జనసేన పార్టీ చిహ్నం, వినుతక్క అనే టాటూ వుండడంతో చెన్నై పోలీసులకు క్లూ దొరికింది.ఆపై రంగంలోకి దిగి మృతదేహాన్ని కాలువలో పడేసిన దగ్గర నుంచీ సీసీ కెమెరాల ఫుటేజీలను రివర్సులో పరిశీలిస్తూ వెళ్ళగా తిరువల్లూరులో ఏపీ రిజిస్ట్రేషన్ వాహనాన్ని గుర్తించారు. అక్కడి నుంచీ రేణిగుంట గోదాము దాకా చేరుకున్నారు. గోదాములో సీసీ కెమెరాల ఫుటేజీలు కూడా చెన్నై పోలీసులు సేకరించినట్టు సమాచారం. ఆ ఆధారాలతో నిందితులను గుర్తించినట్టు తెలిసింది.
వినుత సహా ఐదుగురు అరెస్టు
శ్రీనివాసులు హత్య కేసులో జనసేన ఇంఛార్జి వినుత, ఆమె భర్త కోట చంద్రశేఖర్(చంద్రబాబు),వారి వద్ద డ్రైవర్లుగా పనిచేసే రేణిగుంటకు చెందిన తస్సం(28), తొట్టంబేడు మండలం సింగమాలకు చెందిన గోపి(24), వారి ప్రధాన అనుచరుడుగా ఉన్న బొక్కిసంపాళెంకు చెందిన శివకుమార్(34)ను తమిళనాడు పోలీసులు అదుపులోకి తీసుకుని చెన్నైకు తరలించారు.వారి నుంచీ ల్యాప్‌టాప్ సహా శ్రీనివాసులును హింసించిన వీడియోలు, అతడు చెబుతుండగా రికార్డు చేసిన వీడియోలు కూడా స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం.శనివారం రాత్రి నిందితులను చెన్నైలో న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు.
జనసేన నుంచి బహిష్కరణ
జనసేన పార్టీ నుంచి వినుతను బహిష్కరిస్తున్నట్లు శనివారం ఆ పార్టీ అధిష్ఠానం ప్రకటించింది. శ్రీకాళహస్తి నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా ఉన్న వినుత వ్యవహార శైలి పార్టీ విధానాలకు విరుద్ధంగా వుండడంతో కొంతకాలంగా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంచినట్లు పేర్కొన్నారు. ఆమెపై చెన్నైలో హత్య కేసు నమోదు కావడం పార్టీ దృష్టికి రావడంతో వినుతను బహిష్కరిస్తున్నట్లు ఓ ప్రకటనలో వెల్లడించారు.
3 నెలలుగా టార్చర్: శ్రీనివాసులు అమ్మమ్మ
తన మనవడు శ్రీనివాసులును వినుత దంపతులు 3 నెలలుగా టార్చర్ పెట్టారని అతడి అమ్మమ్మ రాజేశ్వరి తెలిపారు. చెన్నై సెవెన్‌వెల్స్ పోలీసు స్టేషన్ వద్ద ‘ఆంధ్రజ్యోతి’తో రాజేశ్వరి మాట్లాడుతూ.. ‘‘నెల రోజుల క్రితం కిందపడి 3 కుట్లు పడ్డాయని తెలిసి చూడ్డానికి వెళ్లా. అతనేమీ మాట్లాడలేదు. కానీ చంద్రబాబు మాత్రం ‘మీ మనవడు మా సమాచారం వేరే పార్టీ వారికి ఇవ్వబోయి దొరికిపోయాడు. మా నుంచి తప్పించుకుని పారిపోతూ బిల్డింగ్ పైనుంచి కిందపడ్డాడు’ అని చెప్పాడు. అడిగితే మా మనవడు ఏడుస్తూ వుండిపోయాడు. ఒక లాయర్‌ను తీసుకొచ్చి వీడియో తీస్తూ తెల్లకాగితంపై సంతకాలు తీసుకున్నారు. అందులో వారికిష్టమొచ్చింది రాసుకున్నారు. ఆ రోజు నేను కూడా వినుత మొగుడి కాళ్లు పట్టుకున్నా.. మావాణ్ని ఏమీ చేయవద్దని. అయినా మూడు నెలల నుంచీ ఓ గోడౌన్‌లో టార్చర్ చేస్తున్నారు. వారి వద్ద ఆరేళ్లుగా పని చేస్తున్న శ్రీనివాసులు పది రోజుల క్రితం పని మానేశాడు. కానీ మళ్లీ పిలుస్తున్నారని, నాలుగు రూపాయలు సంపాదించుకుని వస్తానని వెళ్లాడు. తనకు తెలిసిన విషయాలు బయటకు చెబితే వాళ్లు చంపేస్తామంటూ బెదిరిస్తున్నారని అన్నాడు. ‘జాగ్రత్త అమ్మమ్మా’ అన్నాడు. ఇంతలోకే అతన్ని చంపేశారు. నిన్న సాయంత్రం 4 గంటలకు పోలీసులు వచ్చి చెబితే గానీ అతను చనిపోయిన విషయం మాకు తెలియలేదు.’’