పంచాయతీల అప్‌గ్రేడ్
ABN , Publish Date - Nov 14 , 2025 | 01:09 AM
పంచాయతీ వ్యవస్థ ప్రక్షాళన దిశగా రాష్ట్రప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఆదాయం, జనాభా ప్రాతిపదికన పంచాయతీలను బలోపేతం చేయడానికి సచివాలయ వ్యవస్థను హేతుబద్దీకరిస్తున్నారు.నాలుగు గ్రేడ్లుగా పంచాయతీలను విభజించారు. పంచాయతీ కార్యదర్శులు ఇకపై పంచాయతీ అభివృద్ధి అధికారులు(పీడీవో)గా వ్యవహరించనున్నారు. ప్రతి పంచాయతీకి ఒక కార్యదర్శి తప్పనిసరిగా ఉండేలా చర్యలు తీసుకున్నారు.
చిత్తూరు కలెక్టరేట్, నవంబరు 13 (ఆంధ్రజ్యోతి): పంచాయతీ వ్యవస్థ ప్రక్షాళన దిశగా రాష్ట్రప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఆదాయం, జనాభా ప్రాతిపదికన పంచాయతీలను బలోపేతం చేయడానికి సచివాలయ వ్యవస్థను హేతుబద్దీకరిస్తున్నారు.నాలుగు గ్రేడ్లుగా పంచాయతీలను విభజించారు. పంచాయతీ కార్యదర్శులు ఇకపై పంచాయతీ అభివృద్ధి అధికారులు(పీడీవో)గా వ్యవహరించనున్నారు. ప్రతి పంచాయతీకి ఒక కార్యదర్శి తప్పనిసరిగా ఉండేలా చర్యలు తీసుకున్నారు.
విభజన ఇలా..
పదివేల జనాభా, ఏడాదికి రూ. కోటి , ఆపై ఆదాయం ఉన్న గ్రామ పంచాయతీలను రూర్బన్ పంచాయతీలుగా పరిగణిస్తారు. వీటికి పంచాయతీ కార్యదర్శి స్థానంలో డిప్యూటీ ఎంపీడీవోలను నియమించనున్నారు. నాలుగువేల నుంచి పదివేల మంది జనాభా, ఏడాదికి రూ. 50 లక్షలు, ఆపై ఆదాయం, మండల కేంద్రంగా ఉన్న పంచాయతీలను గ్రేడ్-1గా ఎంపిక చేస్తారు. కార్యదర్శులు పాలనా వ్యవహారాలను పర్యవేక్షిస్తారు. 2వేల నుంచి నాలుగువేల మంది జనాభా ఉన్న పంచాయతీలను గ్రేడ్-2గా, రెండువేల లోపు జనాభా ఉన్న పంచాయతీలను గ్రేడ్-3గా ఎంపిక చేస్తారు.
సిబ్బంది నియామకం ఇలా
రూర్బన్ పంచాయతీలుగా గుర్తించిన స్పెషల్ గ్రేడ్ పంచాయతీలను చిన్న పురపాలక సంఘంగా రూపొందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇందులో రెవెన్యూ ఇన్స్‌పెక్టర్, జూనియర్ అసిస్టెంట్, ఇద్దరు బిల్‌కలెక్టర్లు, శానిటేషన్ ఇన్స్‌పెక్టర్, మేస్ర్తీ, ఇద్దరు సూపర్‌వైజర్లు, హెల్త్ అసిస్టెంట్, డ్రెయిన్ క్లీనర్, ఎలక్ర్టీషియన్, సహాయ ఎలక్ర్టీషియన్, ఫిట్టర్, ట్యాంకు క్లీనర్,, ఇంజనీరింగ్ అసిస్టెంట్, వివిధ శాఖల సిబ్బంది ఉంటారు. గ్రేడ్-1 పంచాయతీల్లో 20మంది, గ్రేడ్-2లో 12మంది, గ్రేడ్-3లో 9 మందిని నియమిస్తారు. ప్రస్తుతం గ్రేడ్-4, గ్రేడ్-5 పంచాయతీలను రద్దు చేస్తూ అక్కడి వారికి గ్రేడ్-3, గ్రేడ్-2 కార్యదర్శులుగా పదోన్నతి కల్పిస్తారు.
నాలుగు రూర్బన్ పంచాయతీల గుర్తింపు
కాణిపాకం, గంగవరం, కార్వేటినగరం, వి.కోట పంచాయతీల్లో పట్టణ తరహా సేవలను అందించేందుకు మంత్రివర్గ సమావేశంలో ఆమోదముద్ర వేశారు. క్లస్టర్ వ్యవస్థను రద్దు చేసి పంచాయతీలను స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన స్థానిక సంస్థలుగా మార్చనున్నారు. పురపాలక సంఽఘం మాదిరిగానే ఈ నాలుగు రూర్బన్ పంచాయతీల్లో పరిపాలన విభాగాలను ఏర్పాటు చేయనున్నారు. ప్రధానంగా గ్రామీణ ప్రణాళిక, ప్రజారోగ్యం, వీధి దీపాల నిర్వహణ, తాగునీటి సరఫరా, ఇంజనీరింగ్ విభాగాలు ఏర్పాటు చేసి ప్రత్యేకంగా సిబ్బందిని నియమించనున్నారు. ఇల్లు, భవన నిర్మాణాలకు అనుమతులు, అక్రమ నిర్మాణాల నియంత్రణకు పురపాలక సంఘం మాదిరిగానే కంట్రీప్లానింగ్ విభాగాన్ని ఏర్పాటు చేయనున్నారు. సచివాలయాల్లో అధికంగా ఉన్న ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, డిజిటల్ అసిస్టెంట్లను ఈ రూర్బన్ పంచాయతీల్లో గ్రామీణ ప్లానింగ్ అసిస్టెంట్లుగా నియమిస్తారు.
గ్రేడ్ పంచాయతీలు
రూర్బన్
(స్పెషల్) 4
ప్రథమ 61
ద్వితీయ 214
తృతీయ 417
-------------------------------------------------------
696
------------------------------------------------------
ప్రతిపాదనలు పంపాం
పంచాయతీల్లో జనాభా, ఆదాయం ప్రకారం గ్రేడ్ల వారీగా విభజించడానికి అవసరమైన వివరాలతో ప్రతిపాద నలను ప్రభుత్వానికి పంపించాం. ఉన్నతాధికారుల నుంచి వచ్చే మార్గదర్శకాల ప్రకారం పంచాయతీల విభజనకు చర్యలు తీసుకుంటాం.
-డీపీవో సుధాకర రావు