‘స్థానిక ’ ఎన్నికలపై కన్పించని కదలిక!
ABN , Publish Date - Nov 19 , 2025 | 12:01 AM
:గడువుకు మూడు నెలల ముందే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామన్న రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రకటన అమలయ్యేలా లేదు.ఇప్పటివరకు ఎలాంటి సమీక్షలు, వీడియో, ఆడియో కాన్ఫరెన్సులను ఎన్నికల సంఘ అధికారులు నిర్వహించకపోవడం, ఎన్నికల సిబ్బందికి అవసరమైన శిక్షణ కోసం కసరత్తూ ప్రారంభించకపోవడం చూస్తుంటే ఎన్నికలు ముందుగా కాకుండా నిర్నీత గడువుకే జరిగేలా వున్నాయని అధికారులు, ప్రజాప్రతినిధులు భావిస్తున్నారు.
చిత్తూరు, నవంబరు 18 (ఆంధ్రజ్యోతి):గడువుకు మూడు నెలల ముందే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామన్న రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రకటన అమలయ్యేలా లేదు.ఇప్పటివరకు ఎలాంటి సమీక్షలు, వీడియో, ఆడియో కాన్ఫరెన్సులను ఎన్నికల సంఘ అధికారులు నిర్వహించకపోవడం, ఎన్నికల సిబ్బందికి అవసరమైన శిక్షణ కోసం కసరత్తూ ప్రారంభించకపోవడం చూస్తుంటే ఎన్నికలు ముందుగా కాకుండా నిర్నీత గడువుకే జరిగేలా వున్నాయని అధికారులు, ప్రజాప్రతినిధులు భావిస్తున్నారు.
అందని ఈసీ సంకేతాలు
ఎన్నికల కమిషన్ ప్రకటన మేరకు మూడు నెలలకు ముందే ఎన్నికలు నిర్వహించాలంటే, తదనుగుణంగా ప్రక్రియ చేపట్టాల్సి ఉంది.అక్టోబరు 15లోగా వార్డుల పునర్విభజన, రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి చేయాలి. అప్పటినుంచి నవంబరు 15లోగా వార్డుల వారీగా ఓటర్ల జాబితా సిద్ధం చేసి ప్రచురించాలి. అలాగే ఎన్నికల అధికారుల నియామకం పూర్తి చేయాలి. అప్పటినుంచి నవంబరు 30లోగా పోలింగ్ కేంద్రాలను ఖరారు చేయాలి. ఈవీఎంలు సిద్ధం చేయాలి. డిసెంబరు 15లోగా రిజర్వేషన్లు ఖరారు చేయాలి. డిసెంబరు చివరి వారంలో రాజకీయ పార్టీలతో సమావేశాలు నిర్వహించాలి. 2026 జనవరిలో ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చి అదే నెలలో ఫలితాలు కూడా ప్రకటించాలి.వీటికి సంబంధించి ఎన్నికల సంఘం నుంచి జిల్లా అధికారులకు ఎలాంటి సంకేతాలు ఇప్పటిదాకా అందలేదు.
కూటమి నాయకుల్లో సన్నగిల్లిన ఆశలు
వచ్చే ఏడాది ఏప్రిల్‌లో పంచాయతీలకు, మార్చిలో నగర, పురపాలక సంస్థలకు ప్రస్తుత పదవీ కాలాలు ముగియనున్నాయి. మూడు నెలలకు ముందే, అంటే వచ్చే ఏడాది జనవరిలోనే ఎన్నికల్ని నిర్వహించాలని ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని సెప్టెంబరు 3వ తేదీన ఆదేశించారు. దీంతో జిల్లాలోని కూటమి పార్టీల నాయకుల్లో స్థానిక సంస్థల పదవులపై ఆశలు చిగురించాయి. సుమారు 697మందికి సర్పంచులుగా, 6541 మందికి వార్డు సభ్యులుగా, 50 మందికి కార్పొరేటర్లుగా, 111 మందికి కౌన్సిలర్లుగా, ఒకరికి మేయర్‌గా, ఇద్దరికి డిప్యూటీ మేయర్లుగా, నలుగురికి మున్సిపల్ ఛైర్మన్లుగా, ఎనిమిది మందికి వైస్ ఛైర్మన్లుగా పదవులు దక్కుతాయని ఆశ పడ్డారు.ఎందుకంటే 2021వ సంవత్సరంలో నిర్వహించిన స్థానిక సంస్థల ఎన్నికల్లో అప్పుడు అధికారంలో వున్న వైసీపీ కనీవినీ ఎరుగని అక్రమాలకు పాల్పడి 90శాతానికి పైగా పదవులను చేజిక్కించుకున్న విషయం తెలిసిందే.ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 65 జడ్పీటీసీ స్థానాలుంటే ఎక్కడా ఎన్నికలు జరగకుండా ఏకగ్రీవాలయ్యాయంటే ఏ స్థాయిలో ప్రత్యర్థి పార్టీలను వైసీపీ నాయకులు బెదిరించారో అర్థమవుతుంది. పుంగనూరు నియోజకవర్గంలో అయితే ఇతర పార్టీల అభ్యర్థులు నామినేషన్లు వేయకుండా వైసీపీ నాయకులు అడ్డుకుని దాడులు చేశారు.నామినేషను పత్రాలను చించేశారు. చిత్తూరులో పోలీసుల సాయంతో ప్రత్యర్థులను బెదిరించి, కిడ్నాపులు చేసి మరీ నామినేషన్లు విత్‌డ్రా చేయించారు. ప్రశ్నించడానికి చిత్తూరు వస్తున్న అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబును తిరుపతి ఎయిర్‌పోర్టులో రోజంతా కూర్చోబెట్టేసి వెనక్కి పంపేశారు. ఆయన ప్రాతినిధ్యం వహిస్తుండిన కుప్పంలో దొంగ ఓట్లతో హల్‌చల్ చేయడంతో పాటు పెద్దఎత్తున డబ్బులు పంపిణీ చేసి, ఓటర్లను భయభ్రాంతులకు గురిచేసి ఎన్నికల అర్థాన్నే మార్చేశారు. ఈ నేపథ్యంలో ముందస్తుగా ఎన్నికలు జరిగితే స్థానిక సంస్థలపై వైసీపీ పెత్తనాన్ని తీసేయొచ్చని కూటమి పార్టీల నాయకులు ఆశపడ్డారు.అయితే ఈసీ ప్రకటనపై యంత్రాంగంలో చడీచప్పుడు లేకపోవడంతో నిర్ణీత గడువుకే ఎన్నికలు జరుగుతాయన్న అంచనాకు వచ్చారు.