తేరుకోని కళత్తూరు
ABN , Publish Date - Nov 08 , 2025 | 12:42 AM
ముంపుగ్రామాల్లో ముమ్మరంగా సహాయక చర్యలు
కేవీబీపురం/సత్యవేడు, నవంబరు 7 (ఆంధ్రజ్యోతి): జల ప్రళయం సృష్టించిన బీభత్సం నుంచి కళత్తూరు దళితవాడవాసులు ఇంకా తేరుకోలేదు. ఇళ్లల్లో బురద పేరుకుపోయి కొందరు, ధాన్యం, సామగ్రి పాడై మరికొందరు, దుస్తులు కొట్టుకుపోయి ఇంకొందరు.. ఇలా వీరి పరిస్థితి దైన్యంగా మారింది. ఒకవైపు సహాయక చర్యలు జరుగుతుంటే.. మరోవైపు సర్వం కోల్పోయిన బాధితులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. కేవీబీపురం మండలం పాతపాళెం రాయల చెరువు గురువారం ఉదయం తెగడంతో పాతపాళెం దళితవాడ, అరుంధతివాడ, ఓళ్లూరు దళితవాడ, కళత్తూరు దళితవాడల్లో తీవ్ర నష్టం వాటిల్లింది. ఆయా ప్రాంతాల్లో శుక్రవారం సహాయక చర్యలను ముమ్మరం చేశారు. నారాయణవనం, పిచ్చాటూరు, వరదయ్యపాళెం, సత్యవేడు, వడమాలపేట పంచాయతీలు.. శ్రీకాళహస్తి మున్సిపాలిటీ.. తిరుపతి కార్పొరేషన్ నుంచి 200 మందికిపైగా పారిశుధ్య సిబ్బంది.. శ్రీకాళహస్తి, సత్యవేడు, పుత్తూరు, తిరుపతి నుంచి వచ్చిన అగ్నిమాపక సిబ్బంది సమన్వయంతో వీధుల్లో, ఇళ్లల్లో పేరుకుపోయిన బురద తొలగిస్తున్నారు. బురద తీసేందుకు 10 ఎక్స్‌కవేటర్లు వినియోగిస్తున్నారు. ఇళ్లల్లో బురద తీసేవరకు వండుకునే పరిస్థితిలేదు. ఇప్పటికే బురద వల్ల ఇళ్లల్లో దుర్వాసన వస్తోంది. బురదను, దుస్తులు, సామాన్లను కాలువల్లో పారుతున్న నీటితోనే మహిళలు శుభ్రం చేసుకుంటున్నారు. కచ్చా.. రేకుల ఇళ్లల్లో తేమ తగ్గాలంటే వారం రోజులు పట్టొచ్చు. అంటువ్యాధులు ప్రబలకుండా శ్రీకాళహస్తి, కేవీబీ పురం ప్రాంతాల నుంచి వైద్య సిబ్బంది గ్రామాల్లో శిబిరాలు నిర్వహించి వైద్య పరీక్షలు చేస్తున్నారు. మందులు అందిస్తున్నారు. ఇక, పశువుల కళేబరాలను ట్రాక్టర్లలో తరలిస్తుంటే రైతులు కుమిలిపోతున్నారు. ముంపునకు గురైన ఈ ప్రాంతాలు తేరుకుని సాధారణ స్థితికి రావాలంటే మరికొన్ని రోజులు పట్టే అవకాశం ఉంది.
బాధితులకు సాయం
ప్రతి కుటుంబానికి 25 కిలోల బియ్యం, లీటరు నూనె, పంచదార, కందిపప్పు, చింతపండు, ఉల్లిపాయలు, బంగాళదుంపలతో పాటు రూ.3వేలను అందిస్తున్నారు. పాతపాళెం, అరుంధతివాడ, ఎస్‌ఎల్‌పురం గ్రామాల్లో ఈ సహాయక చర్యలు చేపట్టామని ఆర్డీవో భానుప్రకా్‌షరెడ్డి తెలిపారు. 457 పశువులు కొట్టుకుపోగా, 26 ఆవులు, 18 గేదెలు, 13 మేకలు చనిపోయాయని పశువైద్యులు తెలిపారు. శుక్రవారం ఎమ్మెల్యేలు ఆదిమూలం, బొజ్జల సుధీర్‌రెడ్డి, కలెక్టర్ వెంకటేశ్వర్ గ్రామంలో పర్యటించారు. అన్ని విధాలా బాధితులను ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. ఎమ్మెల్యే ఆదిమూలం రెండు రోజులుగా కళత్తూరు, పాతపాళెం గ్రామాల్లోనే మకాం వేసి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. శ్రీకాళహస్తి ఆర్డీవో భానుప్రకా్‌షరెడ్డి ఆధ్వర్యంలో డీపీవో సుశీలాదేవి, డీఎల్‌డీవో సుస్మిత, డీఎల్‌పీవో సురే్‌షనాయుడు, డీఆర్‌డీఏ పీడీ శోభన్‌బాబు, డీడీ విక్రమ్‌రెడ్డి, డ్వామా పీడీ శ్రీనివాసప్రసాద్, విద్యుత్‌శాఖ ఉన్నతాధికారులు చంద్రశేఖర్‌రావు, ఆశీర్వాదం, కేవీబీ పురం, పిచ్చాటూరు, పరిసర మండలాల అధికారులు గ్రామంలో సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.