పంటలపై ఆగని ‘గజ’దాడులు
ABN , Publish Date - Sep 27 , 2025 | 01:54 AM
పులిచెర్ల మండలంలోని పంటలపై ఏనుగుల మంద దాడులు ఆగడం లేదు. గురువారం రాత్రి కూడా దేవళంపేట, పాళెం పంచాయతీల్లోని పంటలకు తీవ్ర నష్టం కల్గించాయి.
కల్లూరు, సెప్టెంబరు 26 (ఆంధ్రజ్యోతి): పులిచెర్ల మండలంలోని పంటలపై ఏనుగుల మంద దాడులు ఆగడం లేదు. గురువారం రాత్రి కూడా దేవళంపేట, పాళెం పంచాయతీల్లోని పంటలకు తీవ్ర నష్టం కల్గించాయి. ముందుగా తూర్పు విభాగం అటవీ ప్రాంతంలోని సూరప్పచెరువు నుంచి బయల్దేరిన తొమ్మిది ఏనుగుల మంద పాళెం మీదుగా హంద్రీ-నీవా కాలువను దాటుకుని కుమ్మరిపల్లె వద్దకు చేరుకున్నాయి. మధు, విజయ్‌కుమార్‌కు చెందిన మామిడి, కొబ్బరి చెట్లను, పశుగ్రాసాన్ని ధ్వంసం చేశాయి. గమనించిన అటవీశాఖ సిబ్బంది టపాకాయలు పేల్చడంతో ఏనుగులు కల్లూరు-పులిచెర్ల రోడ్డును దాటుకుని కొంగరవారిపల్లె సమీపానికి చేరుకున్నాయి. కమలనాథనాయుడు, దశరథనాయుడికి చెందిన మామిడిచెట్లు, పశుగ్రాసాన్ని ధ్వంసం చేశాయి. ఇనుపగేటును విరిచేసిన ఏనుగుల మంద అక్కడినుంచి బాలిరెడ్డిగారిపల్లె వద్దకు చేరుకున్నాయి. అక్కడ పలువురు రైతుల మామిడిచెట్లను ధ్వంసం చేసి.. అడవిలోకి తిరుగుముఖం పట్టాయి. గుట్టమీదపల్లె మీదుగా హంద్రీ-నీవా కాలువ గట్టున అడవిలోకి చేరుకున్నాయి. శుక్రవారం పగలంతా ఏనుగుల గుంపు అడవిలోని సూరప్పచెరువు సమీపంలో సంచరించినట్లు అటవీశాఖ సిబ్బంది తెలిపారు.
రాత్రంతా గున్న ఏనుగుల ఘీంకారాలే
అడవిలో నుంచి ఆరు గున్న ఏనుగులు, మూడు పెద్ద ఏనుగులు మందగా కుమ్మరిపల్లె వద్దకు రాగా అక్కడ పేల్చిన టపాకాయల శబ్దాలతో చెల్లాచెదురయ్యాయి. గున్న ఏనుగులు ఓవైపు, పెద్ద ఏనుగుల మరోవైపు వెళ్లాయి. ఈ క్రమంలో గున్న ఏనుగుల ఘీంకారాలతో ఆ ప్రాంతం దద్దరిల్లింది. కుమ్మపల్లె, వడ్డిపల్లి, తుడుంవారిపల్లెవాసులు భయాందోళనకు గురయ్యారు.