పంటలపై ఆగని ‘గజ’దాడులు
ABN , Publish Date - Oct 05 , 2025 | 11:52 PM
పంటలపై ఏనుగుల గుంపు దాడులు కొనసాగుతూనే ఉన్నాయి.
కల్లూరు, అక్టోబరు 5 (ఆంధ్రజ్యోతి): పులిచెర్ల మండలంలో పంటలపై ఏనుగుల గుంపు దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. మండలంలోని కమ్మపల్లె పంచాయతీ బాలిరెడ్డిగారిపల్లె వద్ద శనివారం రాత్రి పంటలపై ఏనుగుల మంద దాడులు చేయడంతో వరి, వేరుశనగ పంటలకు అపారనష్టం వాటిల్లింది. తూర్పు విభాగం అటవీ ప్రాంతంలోని బోడబండ నుంచి బయల్దేరిన ఆరు ఏనుగుల మంద బాలిరెడ్డిగారిపల్లె వద్దకు చేరుకున్నాయి. ప్రవీణ్‌కుమార్, రుక్మణమ్మ, చెంగయ్య, సురేంద్రరెడ్డి, హైమావతికి చెందిన వరి పంటలను ధ్వంసం చేశాయి. వేరుశనగ పంటను తొక్కేశాయి. మామిడి చెట్ల కొమ్మలను విరిచేసి, పశుగ్రాసాన్ని తినేశాయి. అక్కడినుంచి సమీపంలోని ఎస్సీ కాలనీ వద్దకు చేరుకున్న ఏనుగులు ఘీంకారం చేశాయి. దాంతో గ్రామంలోని ప్రజలు భయబ్రాంతులకు గురయ్యారు. అక్కడినుంచి తిరుగుముఖం పట్టిన ఏనుగుల మంద మార్గంలోని కలబందను తింటూ.. పలువురు రైతుల మామిడిచెట్లను ధ్వంసం చేస్తూ అడవిలోకి చేరుకున్నాయి. ఆదివారం పగలంతా చింతలవంక, సూరప్పచెరువు సమీపంలో ఎనుగులు తిష్ఠ వేసినట్లు అటవీశాఖ సిబ్బంది తెలిపారు.
పశ్చిమ అటవీ ప్రాంతంలో మరిన్ని ఏనుగులు
పులిచెర్ల మండలానికి పశ్చిమ విభాగంలో ఉన్న అటవీ ప్రాంతాల్లో సుమారు 10 ఏనుగుల గుంపు పంటలను ధ్వంసం చేస్తున్నాయి. పాకాల మండలం పుల్లావాండ్లపల్లె సమీపంలోని అడవిలో నాలుగు ఏనుగుల మంద, మరో ఆరు ఏనుగుల మంద సోమల మండలం నంజంపేట సమీపంలోని అడవిలో తిష్ఠ వేశాయి. సమీపంలోని పంటలను ధ్వంసం చేస్తున్నాయి.