Share News

విరాడ్రూపం.. విశ్వజన సమ్మోహం!

ABN , Publish Date - May 22 , 2025 | 02:00 AM

కళ్లెరుపుజేసి జూస్తే ఎదుట నిలువలేరు. త్రిశూలం ఎక్కుపెట్టి నిలిస్తే.. ఎదుట ఉండలేరు. ఆయమ్మ విరాడ్రూపం భయంకరం. అయినా విశ్వజన సమ్మోహనం. కారణం.. రూపంమాత్రమే ఉగ్రం.. మనసంతా కరుణాతరంగం. శ్రీ ప్రసన్న తిరుపతి గంగమాంబ కుప్పం ఆడబిడ్డ. ఏడాదికోమారు సంపూర్ణ రూపంతో దర్శనమిచ్చి భక్తజనంపై చల్లని ఆశీర్వాదాలు కురిసే భక్తజనవశంకరి ఆమె. గంగమ్మ జాతర మహోత్సవాల చివరి ఘట్టమైన అమ్మవారి విశ్వరూప దర్శనం బుధవారం వైభవంగా జరిగింది.

విరాడ్రూపం.. విశ్వజన సమ్మోహం!
అమ్మవారికి పూజలు చేస్తున్న చంద్రబాబు దంపతులు

వైభవంగా గంగమ్మ విశ్వరూపదర్శనం

కుప్పం, మే 21 (ఆంధ్రజ్యోతి): కళ్లెరుపుజేసి జూస్తే ఎదుట నిలువలేరు. త్రిశూలం ఎక్కుపెట్టి నిలిస్తే.. ఎదుట ఉండలేరు. ఆయమ్మ విరాడ్రూపం భయంకరం. అయినా విశ్వజన సమ్మోహనం. కారణం.. రూపంమాత్రమే ఉగ్రం.. మనసంతా కరుణాతరంగం. శ్రీ ప్రసన్న తిరుపతి గంగమాంబ కుప్పం ఆడబిడ్డ. ఏడాదికోమారు సంపూర్ణ రూపంతో దర్శనమిచ్చి భక్తజనంపై చల్లని ఆశీర్వాదాలు కురిసే భక్తజనవశంకరి ఆమె. గంగమ్మ జాతర మహోత్సవాల చివరి ఘట్టమైన అమ్మవారి విశ్వరూప దర్శనం బుధవారం వైభవంగా జరిగింది. మంగళవారం ఉదయంనుంచి రాత్రిదాకా కుప్పం పట్టణం వీధివీధిలో ఊరేగుతూ జనాలనుంచి బలులు, హారతులు స్వీకరించిన గంగమ్మ శిరస్సు రాత్రి బాగా పొద్దుపోయాక ఆలయం చేరింది. వెంటనే విశేష పూజలు చేసిన పూజారులు ఆలయంలో అప్పటికే ఉన్న శేష శరీర భాగంపై ఆ శిరస్సును అమర్చారు. అంతే.. శ్రీ ప్రసన్న తిరుపతి గంగమాంబ సంపూర్ణ రూపం ఆవిష్కృతమైంది. ఉదయం అమ్మవారికి వేసిన తెర తొలగించి విశేష పూజలు నిర్వహించి, భక్తులను దర్శనానికి అనుమతిచ్చారు. అందుకోసమే వేచివున్న లక్షలాదిమంది భక్తులు ఒక్కుమ్మడిగా అమ్మవారి దర్శనానికి పోటెత్తారు. శిరస్సుపై కలశాలు ధరించిన ఆడవాళ్లు.. విచిత్ర వేషాలు కట్టినవారు.. కర్పూర హారతుల పళ్లేలు చేతబట్టినవారు.. వేపమండలతో శివాలెత్తినట్లు ఊగేవారు.. భుజాలపై చిన్నారులతో ఉన్న తండ్రులు.. చంకలో బిడ్డల్ని ఓదారుస్తున్న తల్లులు.. కాటికి కాళ్లు చాపుకున్న ముసలులు.. ఒకరేమిటి.. సర్వజనులూ అమ్మవారి విశ్వరూ దర్శన భాగ్యంకోసం క్యూలైన్లలో గంటలతరబడి వేచి మరీ ఆమె చెంతకు చేరి మొక్కులు తీర్చుకుని చల్లని ఆశీర్వాదాలు పొందారు. జంతు బలులు, పొంగళ్లు బుధవారంనాడు కూడా భక్తులు యథేచ్ఛగా కొనసాగించారు. ఒక్క ఆంధ్రప్రదేశ్‌ మాత్రమే కాదు.. పొరుగున ఉన్న తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలనుంచి కూడా భక్తులు అమ్మవారి దర్శనంకోసం పోటెత్తారు. అధికారులు, జాతర ఉత్సవ కమిటీ సభ్యులు, పోలీసులు పకడ్బందీ ఏర్పాట్లు చేయడంతో శ్రీ ప్రసన్న తిరుపతి గంగమాంబ అమ్మవారి విశ్వరూప దర్శన ఘట్టం ప్రశాంత వాతావరణంలో భక్తిప్రపత్తుల మధ్య ముగిసింది.

గంగమ్మ జలావాసం

అమ్మవారి విశ్వరూప దర్శనం ఉదయంనుంచి రాత్రి 11.30 గంటలదాకా ఏకధాటిగా సాగింది. మధ్యాహ్నం ముఖ్యమంత్రి చంద్రబాబు సతీసమేతంగా అమ్మవారిని దర్శించుకుని టీటీడీనుంచి తీసుకువచ్చిన పట్టువస్త్రాలను అమ్మకు సమర్పించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుమారు గంట సమయం సామాన్య భక్తులకు అమ్మవారి దర్శనాన్ని నిలిపివేసి వీఐపీలకు అవకాశం కల్పించారు. అయినా తొక్కిసలాటలు జరక్కుండా పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహించారు. అనంతరం రాత్రి సుమారు 11.30 గంటలదాకా సాధారణ భక్తులు అమ్మవారి దర్శనం చేసుకున్నారు. అనంతరం గంగమ్మ శేష భాగాన్నుంచి ఆమె శిరస్సును తొలగించి గంగబావి వద్దకు పూజారులు ఊరేగింపుగా తీసుకు వెళ్లారు. ఇక్కడ గంగమ్మ కళ్లను తొలగించి శాస్త్రోక్తంగా జలావాసం చేయించారు. దీంతో కుప్పం గంగజాతర ఘట్ట ం పరిసమాప్తమైంది.

చల్లంగ చూడవే మముగన్న తల్లీ!

ఫ గంగమ్మకు సీఎం చంద్రబాబు దంపతుల పూజలు

రాష్ట్రం సుభిక్షంగా, అభివృద్ధి పథంలో నడవాలని, ప్రజలను చల్లగా చూడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు, భువనేశ్వరి దంపతులు గంగమ్మ తల్లిని కోరుకున్నారు. కుప్పంలో వెలసిన శ్రీ ప్రసన్న తిరుపతి గంగమాంబ జాతర మహోత్సవాల చివరి ఘట్టమైన గంగమ్మ విశ్వరూప దర్శనం బుధవారం వైభవంగా జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు సతీసమేతంగా బుధవారం మధ్యాహ్నం అమ్మవారిని దర్శించుకున్నారు. టీటీడీ తెచ్చిన పట్టువస్త్రాలను, పసుపుకుంకుమ సారెను ప్రభుత్వం తరఫున అమ్మవారికి సమర్పించి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.తర్వాత తిరిగి వెళుతూ ఆలయం ఎదుట క్యూలో ఉన్న భక్తులను నవ్వుతూ పలకరించారు. ద్రావిడ విశ్వవిద్యాలయం క్రీడా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌ వద్ద కూడా పలువురు టీడీపీ ప్రముఖులను, కార్యర్తలను పలుకరించి కరచాలనం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు జిల్లా అధికారయంత్రాంగంతోపాటు ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్‌, ఆర్టీసీ వైస్‌ చైర్మన్‌ పీఎ్‌స.మునిరత్నం, టీటీడీ చైర్మన్‌ బీఆర్‌.నాయుడు, బోర్డు సభ్యులు వైద్యం శాంతారాం, జాతర ఉత్సవ కమిటీ ప్రథమ సభ్యుడు బీఎంకే.రవిచంద్రబాబు, ఇతర సభ్యులు, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డాక్టర్‌ బీఆర్‌.సురేశ్‌బాబు తదితరులు సాదర స్వాగతం పలికారు. కుప్పం మున్సిపల్‌ చైర్మన్‌ సెల్వరాజ్‌, టీడీపీ మున్సిపల్‌ అధ్యక్షుడు రాజ్‌కుమార్‌, కుప్పం మండల పార్టీ అధ్యక్షుడు ప్రేమ్‌కుమార్‌, మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ డాక్టర్‌ సుధీర్‌, ఏఎంసీ మాజీ చైర్మన్‌ సత్యేంద్రశేఖర్‌, టీడీపీ రాష్ట్ర నాయకులు పి.గోపీనాథ్‌ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.కాగా ముఖ్యమంత్రి హోదాలో శ్రీ ప్రసన్న తిరుపతి గంగమాంబను దర్శించుకోవడం చంద్రబాబు దంపతులకు ఇది రెండోసారి. 2019వ సంవత్సరంలో ఎన్నికలకు ముందు జాతర సందర్భంగా నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు దంపతులు గంగమ్మను దర్శించుకుని ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పించుకున్నారు. మళ్లీ ఇన్నాళ్లకు ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలోనే ఆయన గంగమ్మ దర్శనం చేసుకున్నారు. ముఖ్యమంత్రిగా బిజీగా షెడ్యూల్‌ ఉన్నాసరే, స్థానిక టీడీపీ నాయకుల కోరిక మన్నించి చంద్రబాబు కుప్పం వచ్చి అమ్మవారిని దర్శించుకుని మళ్లీ అప్పటికప్పుడే తిరుగు ప్రయాణమయ్యారు.

Updated Date - May 22 , 2025 | 02:00 AM