మహిళా మార్టులో అవకతవకలపై ఇద్దరి సస్పెన్షన్
ABN , Publish Date - Jul 16 , 2025 | 01:38 AM
పెనుమూరు మహిళా మార్టులో అవకతవకలపై ఆడిట్ రిపోర్టు ఆదారంగా ఇద్దరిని సస్పెండ్ చేసి.. సొమ్ము రికవరీకి కలెక్టర్ సుమిత్‌కుమార్ మంగళవారం ఆదేశించారు.
- సొమ్ము రికవరీకి కలెక్టర్ ఆదేశం
పెనుమూరు, జూలై 15 (ఆంద్రజ్యోతి) : పెనుమూరు మహిళా మార్టులో అవకతవకలపై ఆడిట్ రిపోర్టు ఆదారంగా ఇద్దరిని సస్పెండ్ చేసి.. సొమ్ము రికవరీకి కలెక్టర్ సుమిత్‌కుమార్ మంగళవారం ఆదేశించారు. మార్టులో అవకతవలకపై ఆంధ్రజ్యోతిలో పలు కథనాలు ప్రచురితమయ్యాయి. తాజాగా ఈనెల 9వ తేదీన ‘మా డబ్బులు ఏమయ్యాయి?’ శీర్షికన కథనం ప్రచురితమైంది. దీనిపై స్పందించిన అధికారులు విచారణ చేపట్టారు. వైసీపీ హయాంలో మార్టులో అమ్మకాలు రూ.4కోట్లకుపైగా జరిగి రాష్ట్రంలోనే రెండో స్థానంలో నిలిచింది. కొత్త ప్రభుత్వం రాగానే మార్టు నష్టాల్లో ఉందని.. అప్పటి మార్టు నిర్వాహకులు నివేదిక ఇవ్వడంపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. దీనిపై డ్వాక్రా మహిళలు, ప్రజలు.. జిల్లా అధికారులకు ఫిర్యాదులు చేశారు. సుమారు రూ.4కోట్లకుపైనే అమ్మకాలు జరిగితే అందులో 20 శాతంకంటే తక్కువ లాభం అనుకున్నా రూ.60 లక్షలైనా ఉండాలి. కానీ మార్టు బ్యాంకు ఖాతాలో లాభం అటుంచితే పెట్టుబడి రూ.60లక్షలు కూడా కనిపించలేదు. దాంతో డ్వాక్రా మహిళలు అవాక్కయ్యారు. ఈ వ్యవహారంపై రెండు నెలలపాటు ఆడిట్ బృందం పరిశీలించి.. కలెక్టర్‌కు నివేదిక ఇచ్చింది. ఈ రిపోర్టు ఆధారంగా సిబ్బందిని పిలిచి కలెక్టర్ ప్రశ్నించగా ఒక్కరూ నోరు మెదపలేదని సమాచారం. ఈ క్రమంలో ముగ్గురు దోబీలను, ఓ అకౌంటెంట్‌ను తొలగించమని ఏపీఎం, సీసీలకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని నెల కిందట కలెక్టర్ ఆదేశించారు. నెల తర్వాత కూడా ఏపీఎం హరికృష్ణారెడ్డి, సీసీ యుగంధర్‌ల వివరణ సరిగా లేకపోవడంతో మంగళవారం వీరిద్దరినీ కలెక్టర్ సస్పెండ్ చేశారు. ఆరుగురినీ బాధ్యులను చేస్తూ.. సొమ్మును రికవరీ చేయాలని ఆదేశాలిచ్చినట్లు డీఆర్‌డీఏ పీడీ శ్రీదేవి తెలిపారు.