Share News

చేపలకు వెళ్లి ఇద్దరి గల్లంతు

ABN , Publish Date - Oct 24 , 2025 | 01:04 AM

రెండు మండలాల్లో చేపలకని వెళ్లి ఇద్దరు గిరిజనులు గల్లంతయ్యారు. కాళంగి నది ప్రవాహంలో మేకల పోలయ్య.. చల్లకాలువనదిలో మాణికల పోలయ్య కొట్టుకుపోయారు.

చేపలకు వెళ్లి ఇద్దరి గల్లంతు
ఉధృతంగా ప్రవహిస్తున్న కాళంగి నది

రెండు మండలాల్లో చేపలకని వెళ్లి ఇద్దరు గిరిజనులు గల్లంతయ్యారు. కాళంగి నది ప్రవాహంలో మేకల పోలయ్య.. చల్లకాలువనదిలో మాణికల పోలయ్య కొట్టుకుపోయారు.

కాళంగి నదిలో జారిపడి..

దొరవారిసత్రం, అక్టోబరు 23(ఆంధ్రజ్యోతి): దొరవారిసత్రం మండలం కమ్మకండ్రిగ సమీపంలో గురువారం ఉదయం కాళంగి నదిలో మేకల పోలయ్య(31) గల్లంతయ్యారు. పోలిరెడ్డిపాళెం గిరిజన కాలనీకి చెందిన ఈయన కాళంగి నదిపై తనియాలి ఆనకట్ట(కలుజు) వద్ద చేపలు పట్టేందుకు వెళ్లారు. నిండుగా వరద నీరు ప్రవహిస్తుండగా, వలతో చేపలు పట్టే క్రమంలో కాలుజారి నదిలో పడిపోయారు. వరద తాకిడికి కొట్టుకుపోయారు. పోలయ్యతో పాటు వేటకు వెళ్లిన మరో ముగ్గురు గిరిజనులు గ్రామస్థులకు, వీరు పోలీసులకు సమాచారమిచ్చారు. తహసీల్దారు శైలాకుమారి, ఎస్‌ఐ అజయ్‌కుమార్‌ ఘటనా స్థలిని పరిశీలించారు. స్థానికుల సాయంతో పోలయ్య ఆచూకీ కోసం ప్రయత్నించారు. నిండుగా ప్రవహిస్తున్న నదిలో గాలింపు చర్యలు చేపట్టడం సాధ్యం కాని పని కావడంతో గాలింపు చర్యలు చేపట్టలేదు. సాయంత్రానికి కూడా పోలయ్య ఆచూకీ లభ్యం కాలేదు.

చల్లకాలువ నదిలో వరద పెరిగి..

కోట, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి): కోట మండలం కర్లపూడి పంచాయతీలోని మేకలతోట గిరిజన కాలనీకి చెందిన మాణికల పోలయ్య, స్నేహితుడితో కలిసి గురువారం చల్లకాలువ నదిలో గేలం ద్వారా చేపలు పట్టేందుకు వెళ్లారు. పెద్దగా చేపలు పడకపోవడంతో చివరగా.. గేలాలతో పాటు వలను నదిలోని నీటి ప్రవాహంపై విసిరారు. వల రాకపోడంతో పోలయ్య దానిని పట్టుకుంటూ వెళ్లారు. హఠాత్తుగా వరద పెరగడంతో కొట్టుకుపోయారు. స్నేహితుడి సమాచారంతో గిరిజనులు, తహసీల్దారు జయజయరావు, ఎస్‌ఐ పవన్‌కుమార్‌, ఎంపీడీవో దిలీ్‌పకుమార్‌నాయక్‌, అగ్నిమాపక అధికారి శ్రీనివాసులు, సిబ్బంబది అక్కడికి చేరుకున్నారు. కర్లపూడి వంతెన నుంచి గాలించినా ఆచూకీ లభించలేదు. గోవిందపల్లిపాళెంలోని గజ ఈతగాళ్లు పిలిపించి బోట్లతో గాలించినా ఆయన జాడలేదు.

Updated Date - Oct 24 , 2025 | 01:04 AM