తెలుగుగంగలో ఇద్దరు గల్లంతు
ABN , Publish Date - Oct 27 , 2025 | 02:16 AM
తెలుగుగంగ కాలువలో యువకుడు, ఆరేళ్ల బాలుడు గల్లంతయ్యారు. ఈ సంఘటన వరదయ్యపాళెం, బుచ్చినాయుడు కండ్రిగ మండలాల సరిహద్దులో జరిగింది.
కారు కడిగేందుకు కాలువలోకి వెళ్లిన ఇరిగేషన్ ఏఈ
కారు డ్రైవర్, ఏఈ మనవడి గల్లంతు
వరదయ్యపాళెం/బుచ్చినాయుడు కండ్రిగ, అక్టోబరు 26 (ఆంధ్రజ్యోతి): తెలుగుగంగ కాలువలో యువకుడు, ఆరేళ్ల బాలుడు గల్లంతయ్యారు. ఈ సంఘటన వరదయ్యపాళెం, బుచ్చినాయుడు కండ్రిగ మండలాల సరిహద్దులో జరిగింది. వరదయ్యపాళెం మండలానికి చెందిన ఇరిగేషన్ శాఖ ఏఈ బాబు తన కారు కడిగేందుకు కారు డ్రైవర్ షరీఫ్ అలియాస్ చిట్టి (40), మనువడు మహిత్(6)తో కలిసి ఆదివారం సాయంత్రం 3 గంటల ప్రాంతంలో ఉబ్బలమడుగు సమీపంలోని తెలుగుగంగ కాలువ వద్దకు వెళ్లారు. అక్కడ కాలువలోని ర్యాంపులో కారు దించి కడుగుతుండగా బాలుడు మహిత్ కాలుజారి కాలువలోకి పడ్డాడు. బాలుడిని కాపాడేందుకు కాలువలోకి దూకిన బాలుడి తాత ఏఈ బాబు నీటి ప్రవాహానికి కొట్టుకు పోయారు. ఇది గమనించిన డ్రైవర్ షరీఫ్ వారిద్దరిని కాపాడేందుకు తానుకూడా కాలువలోకి దూకాడు. ఈ ఘటనలో డ్రైవర్ షరీఫ్, బాలుడు మహిత్ నీటి ప్రవాహంలో కొట్టుకు పోయారు. ఏఈ బాబు అదృష్టవశాత్తు చెట్టుకొమ్మను పట్టుకుని వేలాడుతుండగా అటుగా వెళుతున్న గిరిజన మత్స్యకారులు కాలువలోకి వల విసిరి బాబును రక్షించారు. కాగా గల్లంతైన షరీఫ్, మహిత్ కోసం పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది గాలిస్తున్నారు. బుచ్చినాయుడు కండ్రిగ ఎస్‌ఐ హరిప్రసాద్ సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.