Share News

వేటగాళ్ల దాష్టీకానికి ఇద్దరి బలి

ABN , Publish Date - Nov 04 , 2025 | 01:12 AM

ఓ మామిడి తోపులో జంతువులను వేటాడడానికి అమర్చిన విద్యుత్‌ తీగలు తగిలి ఇద్దరు మృత్యువాతపడ్డ సంఘటన సోమవారం ఉదయం వెలుగులోకి వచ్చింది.

వేటగాళ్ల దాష్టీకానికి ఇద్దరి బలి
గోవిందస్వామి,కుట్టి మృతదేహాలను పరిశీలిస్తున్న అధికారులు

బంగారుపాళ్యం,నవంబర్‌ 3(ఆంధ్రజ్యోతి): ఓ మామిడి తోపులో జంతువులను వేటాడడానికి అమర్చిన విద్యుత్‌ తీగలు తగిలి ఇద్దరు మృత్యువాతపడ్డ సంఘటన సోమవారం ఉదయం వెలుగులోకి వచ్చింది. సీఐ కత్తి శ్రీనివాసులు కథనం మేరకు .....బంగారుపాళ్యం మండలం కొదలమడుగు పంచాయతీ బండ్లదొడ్డి అటవీప్రాంతంలోని ఓ మామిడి తోటలో జంతువులను వేటాడానికి 500 మీటర్ల మేర బైండింగ్‌ వైరును అమర్చారు. ఈ వైరు తగలడంతో ఓ అడవి పంది మృతిచెందింది కూడా. అయితే వేట కోసమే బండ్లదొడ్డి గ్రామానికి చెందిన గోవిందస్వామి(32),కుట్టి(45) కూడా ఆ మామిడి తోపులోకి వెళ్ళారు. అంతకుముందే అమర్చివున్న బైండింగ్‌ వైర్లు తగిలి వారిద్దరూ అక్కడికక్కడే మృతిచెందారు. ఉదయం గ్రామానికి చెందిన కొందరు గమనించిన పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతదేహాలు పడి ఉన్న విఽధానం, మృతుల చేతిలో వేటకు ఉపయోగించే విద్యుత్‌ బైండింగ్‌ వైర్లు ఉండడంతో వీరు కూడా జంతువులను వేటాండేందుకు మామిడి తోపులోకి వచ్చినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. సంఘటన జరిగిన ప్రాంతాన్ని సోమవారం ఉదయం డీఎస్పీ డేగల ప్రభాకర్‌,అటవీ,విద్యుత్‌ శాఖల అధికారులు పరిశీలించారు.గ్రామంలో వేటకు వెళ్ళే కొంతమందిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.గోవిందస్వామి,కుట్టి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం బంగారుపాళ్యం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

Updated Date - Nov 04 , 2025 | 01:12 AM