ఈత సరదాకు ఇద్దరు స్నేహితుల బలి
ABN , Publish Date - May 31 , 2025 | 01:42 AM
ఈత సరదాకు ఇద్దరు స్నేహితులు బలయ్యారు. యాదమరి మండలంలోని కీనాటంపల్లె పంచాయతీ కోయివూరు గుట్టపై దళితవాడ గ్రామానికి సమీపంలో ఈ విషాద సంఘటన జరిగింది.
యాదమరి, మే 30 (ఆంధ్య్రజ్యోతి): ఈత సరదాకు ఇద్దరు స్నేహితులు బలయ్యారు. యాదమరి మండలంలోని కీనాటంపల్లె పంచాయతీ కోయివూరు గుట్టపై దళితవాడ గ్రామానికి సమీపంలో ఈ విషాద సంఘటన జరిగింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. చిత్తూరు రూరల్ తుమ్మిందపాళెం గ్రామానికి చెందిన సదా, ఉమా దంపతుల పెద్ద కుమారుడు సిద్ధు (11) ఆరో తరగతి చదువుతున్నాడు.తమిళనాడు రాష్ట్రం గుడియాత్తం తాలుకా పరదరామి మండలం సామిరెడ్డిపల్లెలో నివసిస్తున్న రాజ్‌కుమార్, రంజిత దంపతుల పెద్దకుమారుడు అభిలాష్ (13) తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. వేర్వేరు కుటుంబాలకు చెందిన వీరిద్దరూ వేసవి సెలవుల నేపథ్యంలో తమ అమ్మమ్మ వాళ్ల ఊరైన కోయివూరు గుట్టపై దళితవాడకు వచ్చేవారు. ఈక్రమంలో ఇద్దరూ స్నేహితులుగా మారారు. ఈ ఏడాది కూడా వేసవి సెలవులకు వచ్చారు. సరదాగా ఈత కొట్టడానికి గ్రామానికి సమీపంలో ఉన్న కొత్తచెరువు వద్దకెళ్లారు. శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు ఇద్దరూ చెరువులోకి దిగారు. ఇద్దరికీ ఈత రాకపోవడంతో మునిగిపోయారు. గట్టుపై ఉన్న సిద్ధు సోదరుడు సంజు ఈ ప్రమాదాన్ని గమనించి పరుగున గ్రామంలోకి వెళ్లి కుటుంబీకులు చెప్పాడు. వారొచ్చి చెరువు నుంచి ఇద్దరినీ బయటకు తీయగా, అప్పటికే చనిపోయి ఉన్నారు. ఈ సంఘటనతో విషాదఛాయలు అలుముకున్నాయి. యాదమరి పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు.ఈ విషాద సంఘటనపై కలెక్టర్ సుమిత్‌కుమార్ విచారం వ్యక్తం చేశారు. ఫోన్ ద్వారా తహసీల్దార్ పార్థసారథిని వివరాలు అడిగి తెలుసుకున్నారు.