Share News

కుప్పం టీడీపీ నేతలపై రెండు కేసుల కొట్టివేత

ABN , Publish Date - Nov 15 , 2025 | 01:53 AM

వైసీపీ ప్రభుత్వ హయాంలో రెండేళ్ళ క్రితం కుప్పం నియోజకవర్గ టీడీపీ నేతలపై నమోదు చేసిన రెండు హత్యాయత్నం కేసులను చిత్తూరు జిల్లా కోర్టు శుక్రవారం కొట్టివేసింది.

కుప్పం టీడీపీ నేతలపై రెండు కేసుల కొట్టివేత
చిత్తూరు కోర్టు వద్ద టీడీపీ నేతల సంతోషం

రామకుప్పం, నవంబరు 14(ఆంధ్రజ్యోతి): వైసీపీ ప్రభుత్వ హయాంలో రెండేళ్ళ క్రితం కుప్పం నియోజకవర్గ టీడీపీ నేతలపై నమోదు చేసిన రెండు హత్యాయత్నం కేసులను చిత్తూరు జిల్లా కోర్టు శుక్రవారం కొట్టివేసింది. 2022 నవంబరు 24న విపక్ష నేత హోదాలో చంద్రబాబు కుప్పం నియోజవర్గంలో పర్యటించారు. ఆయనకు స్వాగతం పలుకుతూ రామకుప్పం మండలం కొంగనపల్లె పంచాయతీ కొళ్ళుపల్లెలో టీడీపీ శ్రేణులు స్వాగత తోరణాలు కట్టారు. అదే సమయంలో వైసీపీ శ్రేణులు తమ పార్టీ తోరణాలు కట్టి కవ్వింపు చర్యలకు పాల్పడ్డాయి. చంద్రబాబు కొంగనపల్లెలో పర్యటిస్తూ కాసేపట్లో కొళ్ళుపల్లెకి వస్తున్నారనగా వైసీపీ శ్రేణులు టీడీపీ శ్రేణులపై రాళ్ళ వర్షం కురిపించాయి. వారిని కట్టడి చేయాల్సిన పోలీసులు టీడీపీ శ్రేణులనే తరిమికొట్టారు. ఈ నేపథ్యంలో స్థానిక వైసీపీ కార్యకర్తలు రాధప్ప, గౌరమ్మ పిర్యాదులతో మాజీ ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు, చంద్రబాబు పీఏ మనోహర్‌లతో పాటు నియోజకవర్గంలోని 34మంది నేతలపై హత్యాయత్నంతో పాటు పలు సెక్షన్లపై రెండు కేసులు నమోదయ్యాయి. అప్పటి రాళ్ళబూదుగూరు ఎస్‌ఐ మునస్వామి ఫిర్యాదు మేరకు 14మందిపై హత్యాయత్నంలో పాటూ పలు సెక్షన్లతో మరో కేసు నమోదు చేశారు. కుప్పం పర్యటన ముగించుకుని తిరుగుపయనమైన చంద్రబాబుకు వీడ్కొలు పలికి వస్తున్న మాజీ ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు, గ్రంథాలయ పరిషత్‌ రాష్ట్ర డైరెక్టరు మునస్వామి, నూలుకుంటకు చెందిన సుబ్బు, శాంతిపురం మండలానికి చెందిన ఆర్‌ఎస్‌ మణి, కుప్పం మండలానికి చెందిన ముఖేష్‌, మంజు, అప్పులను పోలీసులు అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. అప్పట్లో వారు నెల రోజులకు పైగా జైల్లో ఉన్నారు. ఈ కేసుల్లో ఉన్న వారు ఏడాది క్రితం వరకు కుప్పం కోర్టుకు హాజరయ్యేవారు. ఏడాది నుంచి వాయిదాలకు చిత్తూరు కోర్టుకు హాజరవుతున్నారు.ఈనెల 3న రెండు కేసులు జిల్లా కోర్టులో ట్రయల్‌కు వచ్చాయి. 3, 4, 5, 6, 7, 10, 11తేదీల్లో టీడీపీనేతలు కోర్టుకు హాజరయ్యారు.రాధప్ప, గౌరమ్మ పిర్యాదులతో నమోదైన రెండు కేసుల్లో నేతలపై మోపిన నేరారోపణలు రుజువు కాకపోవడంతో న్యాయమూర్తి కొట్టివేసినట్టు టీడీపీ నేతలు తెలిపారు. శుక్రవారం కోర్టుకు హాజరైన వారిలో మాజీ ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు, సీఎం పీఏ మనోహర్‌, గ్రంథాలయ పరిషత్‌ రాష్ట్ర డైరెక్టరు మునస్వామి,కడా పీఏసీ మెంబరు రాజ్‌కుమార్‌, టీటీడీ బోర్డు సభ్యుడు శాంతారాం, టీడీపీ బీసీసెల్‌ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి పట్ర నారాయణాచారి, ఎస్సీసెల్‌ జిల్లా కార్యదర్శి జయశంకర్‌, తెలుగుయువత నియోజకవర్గ ప్రధానకార్యదర్శి శంకర్‌చలం, టీడీపీ శాంతిపురం మండల అధ్యక్షుడు నందిగం ఉదయ్‌కుమార్‌, మాజీ అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు విశ్వనాథనాయుడు, ఆర్‌ఎస్‌మణి, ఏఎంసీ మాజీ చైర్మన్‌ సత్యేంద్రశేఖర్‌, రెస్కో డైరెక్టరు విజయ్‌కుమార్‌, నేతలు ఏఎంసీ నాగరాజు, వేలు, బాలకృష్ణ, మణి, ఎల్లప్ప, సుబ్బు తదితరులున్నారు.కేసులను కొట్టవేయడంలో కీలక పాత్ర వహించిన చిత్తూరు న్యాయవాదులకు, అండగా నిలిచిన టీడీపీ నియోజకవర్గ నేతలకు వారు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. ఎస్‌ఐ మునస్వామి పిర్యాదుతో నమోదైన హత్యాయత్నం కేసు అమరావతి హైకోర్టుకు చేరిందని, అది కూడా వీగిపోతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

Updated Date - Nov 15 , 2025 | 01:53 AM