రెండు బైక్‌లు ఢీకొని ఇద్దరి దుర్మరణం
ABN , Publish Date - Aug 11 , 2025 | 12:20 AM
చిట్టమూరు మండలం మొలకలపూడి రోడ్డు మలుపు సమీపంలో ఆదివారం సాయంత్రం రెండు బైక్‌లు ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు
చిట్టమూరు, ఆగస్టు 10(ఆంధ్రజ్యోతి): చిట్టమూరు మండలం మొలకలపూడి రోడ్డు మలుపు సమీపంలో ఆదివారం సాయంత్రం రెండు బైక్‌లు ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. ఓ మహిళ, ఇద్దరు పిల్లలకు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసుల కథనం మేరకు... పెళ్లకూరు మండలం పెన్నెపల్లి గ్రామానికి చెందిన వెంకటరమణయ్య, ఆయన భార్య నవీనమ్మ, కుమారుడు కిషోర్, స్వర్ణ ఆదివారం నాయుడుపేట మండల పరిధిలోని గొట్టిప్రోలులో చర్చికి వెళ్లారు. ప్రార్థనల అనంతరం తిరిగి ఇంటికి వస్తుండగా వాకాడు చర్చి కాంపౌండ్‌కు చెందిన కావలి కిరణ్ నాయుడుపేట నుంచి వాకాడుకు బైక్‌లో వెళ్తూ చిట్టమూరు మండలంలోని మొలకలపూడి మలుపు సమీపంలో వెంకటరమణయ్య కుటుంబ సభ్యుల ప్రయాణిస్తున్న బైక్‌ను ఢీకొన్నారు. ఈ ప్రమాదంలో వెంకటరమణయ్య(40), కావలి కిరణ్ (36) తలలకు తీవ్రమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందారు. నవీనమ్మ, కిషోర్, స్వర్ణలకు కాళ్లు, చేతులు విరిగిపోయాయి. తీవ్రంగా గాయపడిన వారిని నాయుడుపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న ఎస్‌ఐ చిన్న బలరామయ్య తన సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. వెంకటరమణయ్య, కిరణ్ మృతదేహాలను నాయుడుపేట ప్రభుత్వాస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేపట్టారు.