Share News

అంతర్రాష్ట్ర రైలు దోపిడీ కేసుల్లో ఇద్దరి అరెస్టు

ABN , Publish Date - Jul 15 , 2025 | 02:14 AM

పలు అంతర్రాష్ట రైలు దోపిడీలకు సంబంధించిన ముఠాలో ఇద్దరిని రైల్వే పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రెండు కత్తులను, రెండు కట్టర్లను స్వాధీనం చేసుకుని ముఠాలో మిగిలిన వారికోసం గాలిస్తున్నారు.

అంతర్రాష్ట్ర రైలు దోపిడీ కేసుల్లో ఇద్దరి అరెస్టు
పట్టుబడ్డ ముఠా సభ్యుల గురించి వివరిస్తున్న రైల్వే ఎస్పీ రాహుల్‌ మీనా

చిత్తూరు అర్బన్‌, జూలై 14 (ఆంధ్రజ్యోతి) : పలు అంతర్రాష్ట రైలు దోపిడీలకు సంబంధించిన ముఠాలో ఇద్దరిని రైల్వే పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రెండు కత్తులను, రెండు కట్టర్లను స్వాధీనం చేసుకుని ముఠాలో మిగిలిన వారికోసం గాలిస్తున్నారు.వేగంగా వెళుతున్న రైలును ఆపి వాళ్లు ఏ విధంగా దోపిడీకి పాల్పడతారో తిరుపతి రైల్వే డీఎస్పీ హర్షితతో కలిసి రైల్వే ఎస్పీ రాహుల్‌ మీనా సోమవారం మీడియాకు వివరించారు.‘ఇటీవల గుంతకల్లు రైల్వే డివిజన్‌ పరిధిలో రైలు దోపిడీ సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఉదయాత్పూర్వం 2గంటల నుంచి 4 గంటల మధ్యలో నిర్మానుష్య ప్రాంతాల్లో రైలు ఆగిపోయేలా సిగ్నల్‌ బాక్సుల్లో వైర్లను ట్యాంపరింగ్‌ చేసి దోపిడీలకు ఈ ముఠా సభ్యులు పాల్పడుతున్నట్లు గుర్తించాం. స్లీపర్‌, జనరల్‌ కోచ్‌లలో కూర్చుని పథకం ప్రకారం కిటికీల పక్కన కూర్చున్న మహిళలను లక్ష్యంగా ఎంచుకుని బంగారు ఆభరణాలను దోచుకెళ్లేవారు.ప్రత్యేక బృందాలతో ఆపరేషన్‌ను ప్రారంభించాం.మహారాష్ట్రలోని సోలాపూర్‌, పూనే ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టాం. మాకు అందిన సమాచారం మేరకు ఈ నెల 13న తిరుపతి జిల్లా రేణిగుంటలో పూనే జిల్లా ఖడ్కి గ్రామానికి చెందిన జలిందర్‌ మహిర్యా పవార్‌(50), కోహినూర్‌ నవనత్‌(24)లను అరెస్టు చేశాం.విచారణలో ఏపీలోని రేణిగుంట, తాడిపత్రి, మంత్రాలయం, మానవపాడు, ముంగిలిపట్టు, పూతలపట్టు,సిద్ధంపల్లె ప్రాంతాలతో పాటు తెలంగాణ రాష్ట్రంలో జరిగిన అనేక దోపిడీ కేసుల్లో వీరి పాత్ర ఉన్నట్లు ఒప్పుకున్నారు.ముఠాలో మిగిలిన సభ్యులనూ అరెస్టు చేసి వారి వద్ద వున్న 242 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకుంటాం’ అని రైల్వే ఎస్పీ రాహుల్‌ మీనా వివరించారు. దోపిడీ ముఠా సభ్యులిద్దరిని పట్టుకోవడానికి కృషి చేసిన రేణిగుంట ఐఆర్పీలు యతీంద్ర, సుధాకర రెడ్డి, ఆర్పీఎ్‌సఐలు ప్రవీణ్‌కుమార్‌, ధర్మేంద్రరాజు, సిబ్బంది నాగాంజనేయులు, రేవంత్‌, నరేంద్ర, గణేష్‌, నాగరాజ, లోకేష్‌, వినోద్‌, మానెయ్య, ఏలుమలైలను రైల్వే ఎస్పీ రాహుల్‌ మీనా ప్రత్యేకంగా అభినందించారు.

Updated Date - Jul 15 , 2025 | 02:14 AM