కాణిపాకంలో సదుపాయాల కోసం రూ. 25 కోట్ల టీటీడీ నిధులు
ABN , Publish Date - Nov 19 , 2025 | 12:21 AM
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కాణిపాకంలో భక్తులకు అవసరమైన సదుపాయాలు కల్పించేందుకు రూ. 25 కోట్ల టీటీడీ నిధులు మంజూరు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది.
ఐరాల(కాణిపాకం), నవంబరు 18 (ఆంధ్రజ్యోతి): ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కాణిపాకంలో భక్తులకు అవసరమైన సదుపాయాలు కల్పించేందుకు రూ. 25 కోట్ల టీటీడీ నిధులు మంజూరు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. ఈ ఏడాది అక్టోబరు 28న జరిగిన టీటీడీ పాలకమండలి సమావేశంలో కాణిపాకం ఆలయ ప్రాంగణంలో భక్తులు బస చేయడానికి వీలుగా కాంప్లెక్సు నిర్మాణానికి, అలాగే సామూహిక వివాహాల నిర్వహణకు అనువుగా పెద్ద హాళ్ళు నిర్మించేందుకు రూ. 25 కోట్లు ఆర్థిక సాయం అందించాలని తీర్మానం చేసింది. దీనిపై ఈ నెల 10వ తేదీన టీటీడీ ఈవో ప్రభుత్వ అనుమతి కోరుతూ లేఖ రాశారు. సంబంధిత నిర్మాణాలు దేవదాయ శాఖ టెండర్లు పిలిచి చేపట్టేలా ఆదేశించాలని, నిధులను విడతల వారీగా విడుదల చేయడానికి అనుమతి ఇవ్వాలని ఈవో లేఖలో కోరారు. పరిశీలించిన ప్రభుత్వం నిధులు విడుదల చేయడానికి టీటీడీ ఈవోకు అనుమతి ఇవ్వడంతో పాటు సంబంధిత పనులను టెండర్లు పిలిచి చేపట్టాలని దేవదాయ శాఖను ఆదేశించింది. త్వరలో ఈ నిర్మాణ పనులను చేపడతామని కాణిపాక ఆలయ ఈవో పెంచలకిషోర్ తెలిపారు. నిధులు రావడానికి కృషి చేసిన ఎమ్మెల్యే మురళీమోహన్‌కు, ఆలయ చైర్మన్ మణినాయుడికి కృతజ్ఞతలు తెలిపారు.