Share News

టీటీడీ ఈవో బదిలీ

ABN , Publish Date - Sep 09 , 2025 | 01:18 AM

తిరుమల - తిరుపతి దేవస్థానాల కార్యనిర్వహణాధికారి శ్యామలరావు బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో సీనియర్‌ ఐఏఎస్‌ అనిల్‌ కుమార్‌ సింఘాల్‌ మళ్లీ ఈవోగా నియమితులయ్యారు.

టీటీడీ ఈవో బదిలీ
అనిల్‌ కుమార్‌ సింఘాల్‌, శ్యామలరావు

తిరుమల, సెప్టెంబరు 8 (ఆంధ్రజ్యోతి): తిరుమల - తిరుపతి దేవస్థానాల కార్యనిర్వహణాధికారి శ్యామలరావు బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో సీనియర్‌ ఐఏఎస్‌ అనిల్‌ కుమార్‌ సింఘాల్‌ మళ్లీ ఈవోగా నియమితులయ్యారు. గతంలో మూడున్నరేళ్ల పాటు ఈయన టీటీడీ ఈవోగా పనిచేశారు. ప్రస్తుత ఈవో శ్యామలరావును జీఏడీ (పొలిటికల్‌)లో కార్యదర్శిగా నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ సీఎస్‌ విజయానంద్‌ సోమవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి.

జీఏడీకి శ్యామలరావు

సీఎం చంద్రబాబు ఏరికోరి టీటీడీ ఈవోగా తెచ్చుకున్న జె.శ్యామలరావు 15 నెలలకే బదిలీ కావడం టీటీడీ వర్గాల్లో విస్మయాన్ని రేకెత్తిస్తోంది. జీఏడీ (పొలిటికల్‌)లో కార్యదర్శిగా ఆయన్ను నియమిస్తూ సోమవారం బదిలీ ఉత్తర్వులు వచ్చాయి. చంద్రబాబు సీఎం హోదాలో తొలిసారి తిరుమలకు రాకముందే.. అప్పటికి ఇన్‌చార్జి ఈవోగా ఉన్న ధర్మారెడ్డిని ప్రభుత్వం ఆగమేఘాలపై తప్పించి శ్యామలరావును నియమించింది. ఆ తర్వాతే సీఎం హోదాలో చంద్రబాబు తిరుమల వెళ్లారు. రాష్ట్రంలో గాడి తప్పిన పాలనను ప్రక్షాళన చేస్తానని, ఆ ప్రక్రియ టీటీడీ నుంచే ప్రారంభిస్తానని ఆ సందర్భంగా చంద్రబాబు ప్రకటించారు. అయితే, టీటీడీ పరిపాలనలో సీఎం ఆలోచనలు, అంచనాలకు అనుగుణంగా పనిచేయడంలో శ్యామలరావు వెనకబడటంతో బదిలీ జరిగిందన్న ప్రచారం జరుగుతోంది. ఈ ఏడాది జనవరిలో తిరుపతి బైరాగిపట్టెడలోని వైకుంఠ ద్వారదర్శన టోకెన్ల జారీ కేంద్రాల వద్ద తొక్కిసలాట జరిగి ఆరుగురు భక్తులు మృతి చెందగా, 40 మంది గాయపడిన సంగతి తెలిసిందే. ఆ ఘటనతో సీఎం చంద్రబాబు టీటీడీ అధికార యంత్రాంగంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పటి నుంచే ఆయనలో టీటీడీ ఈవో పట్ల అసంతృప్తి మొదలైనట్టు సమాచారం. దానికి తోడు పలు ఇతర కారణాలూ తోడయ్యాయని టీటీడీ, రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.

ఆ నిర్ణయాలపై..

వైసీపీ హయాంలో అడ్డదిడ్డంగా జరిగిన నియామకాలను రద్దు చేయడంలో శ్యామలరావు చురుగ్గా వ్యవహరించలేదని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలిసింది. ఉదాహరణకు గత ప్రభుత్వంలో నిబంధనలు పాటించకుండా అర్హత లేని వ్యక్తిని ఏకంగా ఐటీ విభాగం జీఎంగా నియమించిన సంగతి తెలిసిందే. అతడిని ఈవో శ్యామలరావు ఐటీ జీఎం పోస్టు నుంచి తప్పించి మరో విభాగానికి బదిలీ చేశారు. నియామకమే అక్రమమైనప్పుడు తొలగించకుండా, కోర్టు కేసులు వస్తాయన్న సాకుతో విభాగం మార్చడం విమర్శలకు దారి తీసింది. అదే పోస్టులో గతంలో ఉండి వైసీపీ ముద్ర వేసుకున్న ఓ అధికారికి తిరిగి ఐటీ విభాగం జీఎం పోస్టు కట్టబెట్టారని బోర్డు అసంతృప్తి వ్యక్తం చేసి.. తొలగించాలని నిర్ణయం తీసుకుంది. దీనినీ చాలా ఆలస్యంగా అమలు చేశారన్న ఆరోపణలున్నాయి. ఇక, టీటీడీ బోర్డుతో సమన్వయ లోపం ఉన్నట్లు కొన్ని నెలలుగా ప్రచారంలో ఉంది. దీనిపై సీఎంకూ ఫిర్యాదులు అందినట్లు తెలిసింది. ఇక, తాము తీసుకున్న నిర్ణయాలను అమలు చేయడంలో ఈవో తీవ్ర తాత్సారం చేస్తున్నారంటూ సభ్యులు అసంతృప్తి వ్యక్తంచేశారు. దర్శనాల విషయంలో ఏఐ వినియోగం, అలిపిరి పాదాల మండపాన్ని రూ.8 కోట్లతో పునరుద్ధరించేందుకు ఓ దాత ముందుకు రాగా సకాలంలో స్పందించలేదని, టీటీడీ విద్యా సంస్థల్లో దీర్ఘకాలంగా పనిచేస్తున్న లెక్చరర్లు, డ్రైవర్లను రెగ్యులర్‌ చేసేందుకు బోర్డు తీర్మానించినా అమలు ఆలస్యమయ్యేలా వ్యవహరించారని సభ్యులు అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం.

శ్రీవారి సేవకు మళ్లీ సింఘాల్‌

టీటీడీ ఈవోగా మరోసారి అనిల్‌కుమార్‌ సింఘాల్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ఆయన టీడీపీ ప్రభుత్వంలో ఈవోగా నియమితులైనప్పటికీ వైసీపీ ప్రభుత్వంలోనూ ఏడాది పాటు ఈవోగా కొనసాగారు. మొత్తమ్మీద మూడున్నరేళ్ల పాటు ఈవోగా పనిచేశారు. ‘నార్త్‌ఇండియన్‌గా ఉన్న సింఘాల్‌కు ఇక్కడ ఆచారాలు ఏం తెలుసు, ఎలా పనిచేస్తారు, ఏపీలో ఐఏఎస్‌ అధికారులు ఎవరూ లేరా’ అంటూ తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చినప్పటికీ ఆయన్ను ఈవోగా నియమిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని నాటి ప్రభుత్వం మార్చలేదు. అప్పటి సీఎం చంద్రబాబు పెట్టుకున్న నమ్మకానికి తగ్టట్టు టీటీడీ ఈవోగా మూడేళ్ల ఐదు నెలల పాటు పనిచేసిన సింఘాల్‌ అనేక సంస్కరణలు తీసుకొచ్చి అందరి ప్రశంసలు అందుకున్నారు.

సర్వదర్శన భక్తులకు స్లాటెడ్‌ టోకెన్లు

సామాన్య భక్తులూ అతితక్కువ సమయంలోనే శ్రీవారిని దర్శించుకోవాలనే తపనతో స్లాటెడ్‌ సర్వదర్శన(ఎ్‌సఎ్‌సడీ) విధానాన్ని ప్రవేశపెట్టింది సింఘాలే. నేటికీ ఈ విధానం విజయవంతంగా సాగుతోంది. అలాగే గరుడవారధి ప్రారంభమైంది కూడా సింఘాల్‌ ఆధ్వర్యంలోనే. టీటీడీలో ఈ ఫైలింగ్‌ విధానానికీ శ్రీకారం చుట్టారు. ఆలయంలోని పురాతన మండపాలను ప్రతిఒక్కరు వీక్షించేలా మండపాలకు ఉన్న ఇత్తడి గ్రిల్స్‌ను తొలగించారు. కంపార్టుమెంట్లు సర్వదర్శన భక్తులతో నిండిపోయి క్యూలైన్‌ రోడ్లపైకి వచ్చేది. దీనికి పరిష్కారంగా నారాయణగిరి పార్కులో సింఘాల్‌ ఆదేశాల మేరకు తొమ్మిది షెడ్లను నిర్మించారు. దీంతో ఎన్నో సౌకర్యాలతో కూడిన షెడ్లలో భక్తులు తమ సమయం వచ్చేవరకు వేచిఉంటున్నారు. ధ్వజస్తంభం వద్ద మూవింగ్‌ రూఫ్‌ నిర్మించారు. ముఖ్యంగా వివిధ ప్రాంతాల్లో ఆలయాల పరిరక్షణ, నూతన ఆలయాల నిర్మాణం, ఆధునికీకరణ వంటి వాటికోసం శ్రీవాణి ట్రస్టును ప్రారంభించారు.

Updated Date - Sep 09 , 2025 | 01:18 AM