తిరుమలలోనూ టీటీడీ పరిపాలనభవనం
ABN , Publish Date - Jul 23 , 2025 | 12:39 AM
తిరుమలలో కొత్తగా పరిపాలన భవనం నిర్మించాలని టీటీడీ నిర్ణయించింది.
తిరుమల, జూలై 22 (ఆంధ్రజ్యోతి): తిరుమలలో కొత్తగా పరిపాలన భవనం నిర్మించాలని టీటీడీ నిర్ణయించింది. తిరుమలలో ప్రస్తుతం వివిధ ప్రాంతాల్లో ఉన్న వివిధ విభాగాలను ఒకే తావులోకి తీసుకురావడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్టు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు మంగళవారం తెలిపారు. అలాగే ఏపీ హైకోర్టు తీర్పు మేరకు టీటీడీలో కాంట్రాక్ట్ డ్రైవర్లుగా పనిచేస్తున్న 142 మందిని క్రమబద్ధీకరించేందుకు తీర్మానం చేశామనీ, దీనిని ప్రభుత్వ ఆమోదం కోసం పంపుతామని చెప్పారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో మంగళవారం జరిగిన ధర్మకర్తల మండలి సమావేశం వివరాలను ఈవో శ్యామలరావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి, బోర్డు సభ్యులతో కలిసి చైర్మన్ మీడియాకు వివరించారు. బోర్డు నిర్ణయాల్లో కొన్ని ఇవీ..
ఒంటిమిట్టలోని భక్తులకు నిరంతరాయంగా అన్నప్రసాదాలు అందించేందుకు రూ.4.35 కోట్లు కేటాయింపు.
శ్రీవారిమెట్టు, అలిపిరి నడకమార్గాల్లో లైటింగ్, భద్రత పుంపు. ఆధ్యాత్మిక ఆహ్లాదకర వాతావరణం ఏర్పాటు.
శిలాతోరణం, చక్రతీర్థం ప్రాంతాలను మరింత అభివృద్ధి చేసేందుకు మాస్టర్ ప్లాన్, డీపీఆర్ రూపొందించాలని ఆదేశం.
వివిధ దేశాల్లో శ్రీవారి ఆలయాల నిర్మాణానికి నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదిక పై టీటీడీ సబ్ కమిటీ ఏర్పాటు. ఆ కమిటీ నివేదిక ప్రకారం తదుపరి చర్యలు.
శ్రీవారిసేవను మరింత పటిష్టంగా అమలుచేసేందుకు కాంట్రాక్టు విధానంలో 4 కోఆర్డినేటర్ పోస్టుల భర్తీ.
కల్యాణకట్టల్లో మరింత మెరుగైన వసతుల కోసం నిపుణులను సంప్రదించి కార్యాచరణ ప్రణాళిక.
తిరుమలలో పాతబడి హెచ్‌వీడీసీలోని ఆరు బ్లాకులు, బాలాజీ విశ్రాంతి భవనం, ఆంప్రో గెస్ట్‌హౌస్, అన్నపూర్ణ క్యాంటీన్, కల్యాణి సత్రాలను ఐఐటీ నిపుణుల సూచనల మేరకు తొలగించాలని నిర్ణయం.
వేదపారాయణం స్కీం ద్వారా ఇప్పటికే 1,430 మందికి ఏటా రూ.36 కోట్ల గౌరవ వేతనం ఇస్తున్నారు. తాజాగా మరో 700 మందికీ ఇవ్వాలని నిర్ణయం. దీనివల్ల టీటీడీకి అదనంగా రూ.18 కోట్ల భారం పడుతుంది. రాష్ట్రంలోని వారికే తొలి ప్రాధాన్యం.
కడపలోని పురాతనమైన శివాలయం అభివృద్ధి.
తాళ్లపాకలో పలు అభివృద్ధి కార్యక్రమాలు.