నలుగురు ఉద్యోగులపై టీటీడీ చర్యలు
ABN , Publish Date - Aug 06 , 2025 | 01:37 AM
నిబంధనలను అతిక్రమించారంటూ నలుగురు ఉద్యోగులపై టీటీడీ చర్యలకు పూనుకుంది.
తిరుమల, ఆగస్టు5(ఆంధ్రజ్యోతి): నిబంధనలను అతిక్రమించారంటూ నలుగురు ఉద్యోగులపై టీటీడీ చర్యలకు పూనుకుంది. ఇద్దరిని సస్పెండ్ చేయడంతో పాటు మరో ఇద్దరికి సోకాజ్ నోటీసులు జారీ చేసింది. గతేడాది అక్టోబరు 2వ తేదీన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తిరుమల పర్యటనలో ఆలయ ప్రాంగణంలో తీవ్రమైన రద్దీ పెరిగి గందరగోళం నెలకొంది. సాధారణంగా ప్రముఖుల పర్యటన నేపథ్యంలో ప్రొటోకాల్ సిబ్బంది, అర్చకులు, మేళం సిబ్బంది, అటెండర్లు, పారిశుధ్య కార్మికులకు మాత్రమే కొన్ని ప్రాంతాల్లో విధులు కేటాయిస్తారు. అయితే కొందరు ఉద్యోగులు తమకు విధులు కేటాయించకపోయినప్పటికీ పవన్‌ను కలవాలని, చూడాలనే ఉద్దేశ్యంతో ఆలయంలోకి ప్రవేశించడంతో రద్దీ ఏర్పడిందని, ఇది భద్రతకు కూడా ఇబ్బంది తీసుకొచ్చే చర్య అంటూ విజిలెన్స్ విభాగం పేర్కొంది. ఈక్రమంలో శ్రీనివాసమంగాపురంలో విధులు నిర్వహించే బాలాజీ రంగకుమార్ అనే అర్చకుడితో పాటు తిరుపతి ఈఈ కార్యాలయంలో పనిచేసే చీర్ల కిరణ్ అనే జూనియర్ అసిస్టెంట్ క్రమశిక్షణ నిబంధనలు ఉల్లఘించి డిప్యూటీ సీఎంను అనుసరించారని నివేదికలో స్పష్టం చేసింది. దీంతో ఆలయంలోకి ప్రవేశించడానికి గల కారణాలు తెలియజేయాలని ఈ ఇద్దరికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఇక, తన ఇంటిని ఇతరులకు కేటాయించడంతో పాటు ఆర్థికలావాదేవీలు ఉన్నట్టు నిర్ధారణ కావడంతో ఆఫీస్ సబార్డినేట్ శంకర్‌ను, ప్రైవేట్ వ్యక్తులతో కలిసి వ్యాపారాలు నిర్వహించిన జూనియర్ అసిస్టెంట్ రామును సస్పెండ్ చేస్తూ టీటీడీ ఉత్తర్వులు జారీ చేసింది.