రూ.25 కోట్లతో కాణిపాకంలో టీటీడీ వసతి సముదాయం
ABN , Publish Date - Oct 28 , 2025 | 11:47 PM
కాణిపాకంలోని వరసిద్ధి వినాయక స్వామి ఆలయం వద్ద యాత్రికుల వసతి సముదాయం, కోసం రూ.25 కోట్లు కేటాయించినట్టు టీటీడీ బోర్డు చైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు.
తిరుమల, అక్టోబరు 28 (ఆంధ్రజ్యోతి): కాణిపాకంలోని వరసిద్ధి వినాయక స్వామి ఆలయం వద్ద యాత్రికుల వసతి సముదాయం, ఏసీ, నాన్ ఏసీ కల్యాణమండపాల నిర్మాణం కోసం రూ.25 కోట్లు కేటాయించినట్టు టీటీడీ బోర్డు చైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. నిధులు టీటీడీ కేటాయించినప్పటికీ నిర్మాణ, నిర్వాహణ బాధ్యతలు కాణిపాకం ట్రస్టు బోర్డువే అన్నారు.అక్కడి స్థానిక ప్రజాప్రతినిధి ప్రతిపాదన మేరకు ఈ ప్రాజెక్టును తమ బోర్డు ఆమోదించిందన్నారు.ఇందుకు సంబంధించి ప్రభుత్వ అనుమతి కోరుతామన్నారు.తిరుమలలోని అన్నమయ్య భవనంలో మంగళవారం దాదాపు ఏడు గంటల పాటు టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం జరిగింది. అనంతరం ఈవో అనిల్‌కుమార్ సింఘాల్, అదనపు ఈవో వెంకయ్య చౌదరి, సభ్యులతో కలిసి బీఆర్ నాయుడు మీడియాకు బోర్డు నిర్ణయాలు వెల్లడించారు.స్విమ్స్ పరిధిలో ఉన్న కొన్ని మెడికల్ షాప్‌లు నకిలీ మందులు విక్రయిస్తున్నారనే ఫిర్యాదులు రావడంతో స్విమ్స్ ఆధ్వర్యంలోనే మెడికల్ షాప్‌ను నిర్వహిస్తే బాగుంటుందని నిర్ణయించామన్నారు. శ్రీవాణి ట్రస్టు దాతలు టికెట్లు తీసుకునేందుకు తిరుమలలో ఇబ్బందులు పడుతున్న అంశంపై కూడా చర్చించామని రానున్న పదిరోజుల్లో ఈ అంశంపై ఓ నిర్ణయం వెల్లడిస్తామన్నారు. టీటీడీలోకి కాంట్రాక్ట్ లెక్చరర్లు, డ్రైవర్ల క్రమబద్దీకరణ విషయంలో కూడా తాజాగా మరో తీర్మానం చేశామన్నారు. గతంలో బోర్డు తీర్మానం చేసినప్పటికీ సరైన పద్ధతిలో లేకపోవడంతో తాజాగా మరోసారి పక్కాగా తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపుతామన్నారు.టీటీడీ పరిధిలోని ఆస్పత్రులకు డాక్టర్ జగదీష్ డైరెక్టర్‌గా ఉంటారని ఓ ప్రశ్నకు బదులుగా చెప్పారు. దీనిపై సీఎంవో నిర్ణయం తీసుకుంటుందన్నారు. ఇక, ఏఐ ద్వారా శ్రీవారి దర్శనాల అమలుపై ఇప్పటికే ఓ టెక్నాలజీని వినియోగిస్తున్నామని, మరికొన్ని టెక్నాలజీల వినియోగంపై కమిటీని నియమించామన్నారు. ఇటీవల శ్రీవారి బ్రహ్మోత్సవాలు అద్భుతంగా జరిగాయని బీఆర్ నాయుడు సంతోషం వ్యక్తం చేశారు. ప్రభుత్వం, పోలీసు, టీటీడీ అధికారులు, ఉద్యోగులు, బోర్డు సభ్యులు, మీడియా, సేవకులందరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేస్తున్నానన్నారు. బ్రహ్మోత్సవాల్లో పనిచేసిన టీటీడీ శాశ్వత ఉద్యోగులకు రూ.15,400, కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు రూ.7,535 చొప్పున బ్రహ్మోత్సవ బహుమానం అందించాలని నిర్ణయించామన్నారు. తిరుమల, తిరుపతికి చెందిన సిబ్బందికి అదనంగా రూ.10 శాతం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు.