చెరువులకు చెర
ABN , Publish Date - Jun 08 , 2025 | 01:23 AM
రాజకీయ అండతో చెలరేగుతున్న రియల్టర్లు
పలమనేరు,జూన్7 (ఆంధ్రజ్యోతి) : పలమనేరు నియోజకవర్గంలో మట్టిమాఫియా చెలరేగిపోతోంది. గంగవరం, బైరెడ్డిపల్లె, వి.కోట మండలాల్లో రాజకీయ నేతల కనుసన్నల్లో చెరువులను చెరపడుతోంది. ఈ మండలాల్లో దశాబ్దకాలంగా రాజకీయ పలుకుబడి కలిగిన నాయకులు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు నిర్వహిస్తున్నారు.పలమనేరు చల్లటి వాతావరణానికి పేరు పొందడంతో ఇక్కడ నివేశస్థలాలకు మంచి గిరాకీ వుంది.దీంతో పలమనేరుతో పాటు గంగవరం పంచాయితీ పరిధిలో ఉన్న భూములను రియల్టర్లు కొనుగోలు చేసి నివేశస్థలాలుగా మారుస్తున్నారు.రోడ్డుకు లోతట్టు భూముల ఎత్తు పెంచేందుకు టిప్పర్లతో మట్టిని తరలించి చదును చేస్తున్నారు. సాధారణంగా చెరువుల్లో మట్టిని తరలించాలంటే తప్పనిసరిగా సంబంధిత తహసిల్దార్ అనుమతితో పాటు మైన్స్ అధికారుల అనుమతి కూడా వుండాలి. అయితే వీరంతా ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఆ పార్టీ నాయకులతో సత్సంబంధాలు పెట్టుకుంటుండడంతో అక్రమాలకు అడ్డుకట్టవేసే వాళ్లే లేకుండా పోయారు.కాబట్టే రైతులకు కొంత మొత్తం అడ్వాన్సుగా చెల్లించి భూమిని స్వాధీనం చేసుకొని అనుమతులు లేకుండానే రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తున్నారు. బెంగళూరు -చెన్నె ఎక్స్‌ప్రెస్ హైవే నిర్మాణం కూడా జరుగుతుండడంతో రోడ్డుకు ఆనుకొని ఉన్న చెరువుల్లో మట్టిని హైవే కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా రోడ్డుపనులకు తరలించేశారు. దీంతో హైవే సమీపంలోని చెరువులు వాటి ఆయకట్టుకంటే గుంతగా మారిపోయాయి. దీంతో సాధారణ వర్షాలు కురిసినప్పటికీ చెరువుల్లో ఏర్పడిన భారీ గుంతలకే ఆ నీళ్లు పరిమితం అవుతుండటంతో ఆయకట్టు రైతులకు సాగునీరు అందే అవకాశం లేకుండా పోతోంది.ఒక్కోసారి మట్టితరలించడంతో ఏర్పడిన గుంతలు ప్రాణాలూ తీస్తున్నాయి. రెండురోజుల క్రితం వి.కోట మండలం మోట్లపల్లి సమీపంలోని చెరువు గుంతలో మునిగి ముగ్గురు పిల్లలు మృత్యువాత పడ్డారు.బాధిత కుటుంబాలను నేతలు పరామర్శించి ఓదార్పు మాటలు చెబుతున్నారు.అయితే మట్టి మాఫియా వల్ల చెరువుల్లో భారీగుంతలు ప్రమాదకరంగా మారుతున్నాయనేది మాత్రం పట్టించుకోరు.