అన్నమయ్య జిల్లాకు ఆరు మండలాల బదిలీ
ABN , Publish Date - May 25 , 2025 | 01:14 AM
:అన్నమయ్య జిల్లాకు చిత్తూరు జిల్లా నుంచి ఆరు మండలాల బదిలీ అయ్యాయి. ఆంధ్రప్రదేశ్ జిల్లాల (ఏర్పాటు) చట్టం 1974 లోని 3వ విభాగపు 5వ ఉపవిభాగం కింద సంబంధిత ప్రాంతాల మెరుగైన పరిపాలన, అభివృద్ధి దృష్ట్యా అన్నమయ్య జిల్లాకు బదిలీ చేస్తున్నట్లు ఈనెల 22న కలెక్టర్ సుమిత్‌కుమార్ పేరిట చిత్తూరు జిల్లా గెజిట్ ప్రచురితమైంది.
చిత్తూరు కలెక్టరేట్, మే 24 (ఆంధ్రజ్యోతి):అన్నమయ్య జిల్లాకు చిత్తూరు జిల్లా నుంచి ఆరు మండలాల బదిలీ అయ్యాయి. ఆంధ్రప్రదేశ్ జిల్లాల (ఏర్పాటు) చట్టం 1974 లోని 3వ విభాగపు 5వ ఉపవిభాగం కింద సంబంధిత ప్రాంతాల మెరుగైన పరిపాలన, అభివృద్ధి దృష్ట్యా అన్నమయ్య జిల్లాకు బదిలీ చేస్తున్నట్లు ఈనెల 22న కలెక్టర్ సుమిత్‌కుమార్ పేరిట చిత్తూరు జిల్లా గెజిట్ ప్రచురితమైంది. పునర్విభజన, పునర్నిర్మాణ చట్ట ప్రకారం చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గంలోని ఈ మండలాలను అన్నమయ్య జిల్లాలోకి బదిలీచేస్తూ కలెక్టర్ సుమిత్‌కుమార్ ప్రాథమిక గెజిట్ నోటిఫికేషన్ జారీచేశారు. ఈ మేరకు పలమనేరు రెవెన్యూ డివిజన్‌లోని పుంగనూరు, చౌడేపల్లె, సోమల, సదుం, చిత్తూరు రెవెన్యూ డివిజన్‌లోని రొంపిచెర్ల, పులిచెర్ల మండలాలను అన్నమయ్య జిల్లా మదనపల్లె రెవెన్యూ డివిజన్‌కు బదిలీ చేయాలని ప్రభుత్వం ప్రతిపాదించినట్లు గెజిట్ నోటిఫికేషన్‌లో వివరించారు.ఈ ప్రతిపాదనతో ప్రభావిత జిల్లాలోని నివాసితులనుంచి అభ్యంతరాలు, సూచనలను నెలరోజుల్లోగా (జూన్ 21లోగా) పంపుకోవచ్చని, వాటిని ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంటుందని కలెక్టర్ ఆ నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. అటువంటి అభ్యంతరాలు లేదా సూచనలను ఆంగ్లం లేదా తెలుగులో లిఖితపూర్వకంగా చిత్తూరు కలెక్టరేట్‌కు గడువు ముగిసేలోపు పంపాలని ఆ నోటిఫికేషన్‌లో కోరారు.