Share News

మినీ బస్సు బోల్తా పడి ట్రాన్స్‌కో ఉద్యోగి మృతి

ABN , Publish Date - Oct 14 , 2025 | 02:02 AM

విజయవాడలో తలపెట్టిన విద్యుత్‌శాఖ ఉద్యోగుల ధర్నాకు పలమనేరు ప్రాంతం నుంచి మినీబస్సులో వెళ్తుండగా సోమవారం వేకువజామున ప్రకాశం జిల్లా టంగుటూరి మండలం వద్ద వాహనం అదుపుతప్పి కల్వర్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో గంగవరం మండలం పత్తికొండ గ్రామానికి చెందిన జూనియర్‌ లైన్‌మన్‌ గ్రేడ్‌-2 సి.చరణ్‌కుమార్‌ మృతిచెందగా.. మరో ఆరుగురు ఉద్యోగులు తీవ్రంగా గాయపడ్డారు.

 మినీ బస్సు బోల్తా పడి ట్రాన్స్‌కో ఉద్యోగి మృతి
బోల్తాపడిన వాహనం

ఆరుగురికి తీవ్రగాయాలు

పలమనేరు, అక్టోబరు 13 (ఆంధ్రజ్యోతి): విజయవాడలో తలపెట్టిన విద్యుత్‌శాఖ ఉద్యోగుల ధర్నాకు పలమనేరు ప్రాంతం నుంచి మినీబస్సులో వెళ్తుండగా సోమవారం వేకువజామున ప్రకాశం జిల్లా టంగుటూరి మండలం వద్ద వాహనం అదుపుతప్పి కల్వర్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో గంగవరం మండలం పత్తికొండ గ్రామానికి చెందిన జూనియర్‌ లైన్‌మన్‌ గ్రేడ్‌-2 సి.చరణ్‌కుమార్‌ మృతిచెందగా.. మరో ఆరుగురు ఉద్యోగులు తీవ్రంగా గాయపడ్డారు. అలాగే 13 మంది స్వల్ప గాయాలతో బయటపడ్డారు. పోలీసులు, బాధితుల కథనం మేరకు.. ప్రకాశం జిల్లా టంగుటూరు మండలంలోని ఓ ఇంజనీరింగ్‌ కళాశాల వద్దకు చేరుకోగానే డ్రైవర్‌ నిద్రమత్తులోకి జారుకోవడంతో వాహనం అదుపుతప్పి కల్వర్టును ఢీకొని కాలువలో బోల్తా పడింది. గంగవరం మండలం పత్తికొండ గ్రామానికి చెందిన సి.చరణ్‌ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతిచెందగా..లైన్‌ ఇన్‌స్పెక్టర్‌ సుహేల్‌,లైన్‌మన్‌ రామ్మోహన్‌, శ్రీనివాస నాయక్‌,ప్రసాద్‌బాబు,జూనియర్‌ లైన్‌మన్‌ గ్రేడ్‌-2 బాలసుబ్రహ్మణ్యం, రాజేష్‌, దినేష్‌ తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న టంగుటూరు ఎస్‌ఐ నాగమల్లేశ్వరరావు, ఒంగోలు టూటౌన్‌ సీఐ శ్రీనివాసరావు సంఘటనా స్థలానికి చేరుకొని అగ్నిమాపక సిబ్బంది సహకారంతో బస్సు నుంచి గాయపడ్డ వారిని బయటకు తీశారు. 108 వాహనంలో ఒంగోలులోని ఆస్పత్రికి తరలించి చికిత్సలు అందించారు. మెరుగైన వైద్యం కోసం రామ్మోహన్‌, బాలసుబ్రహ్మణ్యం, రాజే్‌షలను తిరుపతికి తరలించగా.. శ్రీనివాస నాయక్‌, ప్రసాద్‌బాబులను వేలూరు సీఎంసీకి తీసుకెళ్లారు. పలమనేరు ఏడీఈ జీవన్‌కుమార్‌ తమ సిబ్బందితో కలిసి ఒంగోలుకు వెళ్లి క్షతగాత్రులను పరామర్శించడంతో పాటు వారి కుటుంబసభ్యులకు ధైర్యం చెబుతూ మెరుగైన చికిత్స కోసం వారు కోరిన ఆస్పత్రులకు పంపి చికిత్సలు అందిస్తున్నారు.

Updated Date - Oct 14 , 2025 | 02:02 AM