‘అన్నా’ ఇంట విషాదం
ABN , Publish Date - Sep 26 , 2025 | 01:50 AM
తిరుపతిలో బీసీ నేత అన్నా రామచంద్రయ్య ఇంట విషాదం నెలకొంది. గుంటూరులో జరిగే బంధువుల ఫంక్షన్‌కు వెళ్తుండగా బుధవారం అర్ధరాత్రి 10.30 గంటలకు వీరి కారుకు చిలకలూరిపేట వద్ద ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో రామచంద్రయ్య అల్లుడు డాక్టర్ వెంకటకిషోర్(42), మనవరాలు అశ్వినందన (4) మృతిచెందగా, మిగిలిన ఐదుగురు గాయపడ్డారు.
చిలకలూరిపేట వద్ద ప్రమాదంలో అల్లుడు, మనవరాలి దుర్మరణం
మరో ఐదుగురికి గాయాలు
కార్పొరేటర్ అన్నా సంధ్య పరిస్థితి ఆందోళనకరం
తిరుపతి(నేరవిభాగం), సెప్టెంబరు 25(ఆంధ్రజ్యోతి): తిరుపతిలో బీసీ నేత అన్నా రామచంద్రయ్య ఇంట విషాదం నెలకొంది. గుంటూరులో జరిగే బంధువుల ఫంక్షన్‌కు వెళ్తుండగా బుధవారం అర్ధరాత్రి 10.30 గంటలకు వీరి కారుకు చిలకలూరిపేట వద్ద ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో రామచంద్రయ్య అల్లుడు డాక్టర్ వెంకటకిషోర్(42), మనవరాలు అశ్వినందన (4) మృతిచెందగా, మిగిలిన ఐదుగురు గాయపడ్డారు. వీరిలో కార్పొరేటర్ అన్నా సంధ్యకు తీవ్రగాయాలయ్యాయి. గుంటూరుకు చెందిన తంగెళ్ల వెంకటకిషోర్ స్విమ్స్‌లో జనరల్ సర్జన్‌గా పనిచేస్తున్నారు. ఈయన అన్నా రామచంద్రయ్య పెద్ద కుమార్తె డాక్టర్ అన్నా సంధ్యను వివాహం చేసుకున్నారు. ఈమె కార్పొరేటర్. రేణిగుంట విమానాశ్రయ సమీపంలోని బాలాజీ ఆస్పత్రిలో అసిస్టెంట్ ప్రొఫెసర్. వీరికి కుమారుడు ఆయుష్ నందన, కుమార్తె అశ్వినందన ఉన్నారు. గుంటూరులో ఫంక్షన్ కోసం ఈ నలుగురితో పాటు అన్నా రామచంద్రయ్య కోడలు డాక్టర్ శ్వేత, ఆమె కుమార్తెలు అన్నా ఆధ్య(8), అన్నా మైరా కలిసి బుధవారం రాత్రి పది గంటల ప్రాంతంలో మహేంద్ర ఎక్స్ యూవి 700 కారులో బయలుదేరారు. గురువారం తెల్లవారుజామున 2.15 గంటల ప్రాంతంలో మార్టూరు చిలకలూరిపేట మధ్య తాతపూడి ఫ్లై ఓవర్ వద్ద వీరి కారు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొంది. ఈ ఘటనలో వెంకటకిషోర్ కారు నుంచి కింద పడి అక్కడికక్కడే మృతి చెందారు. తలపై బలమైన గాయాలైన చిన్నారి అశ్వినందనను సమీపంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందింది. కారు ముందు సీట్లో ఉన్న కార్పొరేటర్ అన్నా సంధ్య కాళ్లకు తీవ్ర గాయాలవడంతో గుంటూరులోని రమేష్ ఆస్పత్రికి తరలించినట్లు చిలకలూరిపేట ఎస్‌ఐ అనిల్‌కుమార్ చెప్పారు. మిగిలిన నలుగురికి చిలకలూరిపేటలోని ఆస్పత్రిలో వైద్య సేవలు అందిస్తున్నారు. మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించి రేపల్లెలోని వెంకటకిషోర్ ఇంటికి తరలించారు. అక్కడే దహన సంస్కారాలు నిర్వహించనున్నారు. అతి వేగంతో పాటు నిద్రమత్తు వల్ల ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనతో ‘అన్నా’ ఇంట విషాదచాయలు అలుముకున్నాయి. అన్నా రామచంద్రయ్య ఆయన కుటుంబ సభ్యులు చిలకలూరిపేటకు వెళ్లారు. ఇక, చిలకలూరిపేటలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. ప్రమాదానికి గురైన వారు ఆయన బంధువులని సమాచారం. కాగా, వైసీపీ నేత భూమన కరుణాకరరెడ్డి కూడా తిరుపతి నుంచి వెళ్లి క్షతగాత్రులను పరామర్శించారు. మృతదేహాలకు నివాళులర్పించారు.
నాన్నంటే ప్రేమ: నాలుగేళ్ల అశ్వినందనకు నాన్న వెంకట కిషోర్ అంటే విపరీతమైన ప్రేమ అని కుటుంబీకులు చెబుతున్నారు. అతడిని వదిలి ఉండేది కాదని.. మృత్యువులోనూ ఆయన వెంటే వెళ్లిందంటూ కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.