Share News

కుప్పం వైసీపీకి గడ్డుకాలం!

ABN , Publish Date - May 16 , 2025 | 01:13 AM

పార్టీకి జిల్లా ప్రధాన కార్యదర్శి రాజీనామా

కుప్పం వైసీపీకి గడ్డుకాలం!
రాజీనామా పత్రాన్ని చూపిస్తున్న విద్యాసాగర్‌

కుప్పం, మే 15 (ఆంధ్రజ్యోతి): కుప్పం వైసీపీకి గడ్డుకాలం దాపురించింది. వరుసగా ఒక్కరొక్కరే పార్టీ పట్టునుంచి జారిపోతున్నారు.పార్టీలో బలమైన నేతగా ఉన్న జిల్లా ప్రధాన కార్యదర్శి, కుప్పం వ్యవసాయ మార్కెట్టు కమిటీ మాజీ చైర్మన్‌ ఏఎస్‌.విద్యాసాగర్‌ రాజీనామా చేశారు. నిజానికి వైసీపీలో కొనసాగుతున్నవారిలో దాదాపు 50 శాతంమంది నాయకులు ఒకప్పుడు టీడీపీకి చెందినవారే. ఇప్పుడు రాజీనామా చేసిన విద్యాసాగర్‌, 2018లో అధికారంలో ఉన్నప్పుడే టీడీపీనుంచి బయటకు వచ్చి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. 14వ వార్డు కౌన్సిలర్‌ మునస్వామి సహా అప్పట్లో పలువురు ఇదే నిర్ణయం తీసుకున్నారు. 2019 ఎన్నికల్లో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి, ఎమ్మెల్సీ భరత్‌కు ఓట్లు సంపాదించిపెట్టడంలో కీలకపాత్ర పోషించారు. రామకుప్పం మండల ఇన్‌చార్జిగా విద్యాసాగర్‌ అక్కడ పార్టీని బలోపేతం చేయడంలో తనవంతు సహకారం అందించారు. అయితే మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో 2024 ఎన్నికలకు ముందే వీరి ప్రాధాన్యత పార్టీలో తగ్గుతూ వచ్చింది. తాజాగా జరిగిన మున్సిపల్‌ చైర్మన్‌ ఎన్నికల్లో విప్‌ను ధిక్కరించి ప్రత్యేక సమావేశానికి గైర్హాజరైన 14వ వార్డు కౌన్సిలర్‌ మునస్వామి, ఆయన తల్లి అయిన 15వ వార్డు కౌన్సిలర్‌ తిలగవతిని ఎమ్మెల్సీ భరత్‌ సిఫార్సు మేరకు వైసీపీ జిల్లా అధ్యక్షుడు కరుణాకర రెడ్డి పార్టీనుంచి సస్పెండు చేశారు. వీరితోపాటు మరో 8 మంది కౌన్సిలర్లపై కూడా ఇదే చర్య తీసుకున్నారు. ఈ 8 మంది మున్సిపల్‌ చైర్మన్‌ టీడీపీ అభ్యర్థి సెల్వరాజ్‌కు మద్దతు ప్రకటించి ఆయన విజయానికి కారకులయ్యారు. అయితే మునస్వామితోపాటు సస్పెండు అయిన 9 మంది కౌన్సిలర్లలో ఆరేడుగురు చాలాచాకాలంనుంచి పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. పార్టీలో తమను ప్రాధాన్యత ఇవ్వడంలేదని అసంతృప్తితో రగులుతున్నారు.తత్ఫలితంగానే మున్సిపల్‌ చైర్మన్‌ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి గెలుపునకు దోహదం చేయడం. కనీస సంజాయిషీ, వివరణ కోరకుండా పార్టీనుంచి మునస్వామిని,ఆయన తల్లి తిలగవతిని సస్పెండు చేయడాన్ని విద్యాసాగర్‌ ప్రశ్నించారు. కుప్పంలోని తన స్వగృహంలో గురువారం విలేకరులతో మాట్లాడుతూ ఎమ్మెల్సీ భరత్‌ ఒంటెత్తు పోకడలు పోతున్నారని, పార్టీకోసం కష్టపడిన తనలాంటి నాయకులను, కార్యకర్తలను పక్కనపెట్టి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.రామకుప్పం ఎంపీపీ, వైస్‌ ఎంపీపీ ఎన్నికలు, మున్సిపల్‌ చైర్మన్‌ ఎన్నికల్లో ఓటమి పాలవడానికి తనలాంటివారిని సమన్వయం చేసుకోకపోవడమే కారణమని ఆక్షేపించారు. తగిన గుర్తింపులేని పార్టీలో ఉండలేక వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. భవిష్యత్తులో తనకు, తనతో ఉన్నవారికి ఏ పార్టీ గుర్తింపు ఇస్తుందో ఆ పార్టీలో చేరే అవకాశం ఉన్నదని విద్యాసాగర్‌ స్పష్టం చేశారు.అంతకుముందు వైసీపీ హయాంలో ఆ పార్టీ తరఫున గెలుచుకున్న మున్సిపల్‌ చైర్మన్‌ కుర్చీని కూడా డాక్టర్‌ సుధీర్‌ వదిలేసుకుని, మరీ టీడీపీలో చేరిపోయారు. చైర్మన్‌ పదవితోపాటు 16వ వార్డు కౌన్సిలర్‌ పదవిని కూడా ఆయన వదులుకున్నారు. ఇటీవల శాంతిపురం జడ్పీటీసీ శ్రీనివాసులుతోపాటు మాజీ సర్పంచి వసనాడు మురళి, ప్రస్తుత సర్పంచి జగదీశ్‌ భార్య నీలావతి తమ సస్పెన్షన్‌ను ప్రశ్నిస్తూ సమావేశం ఏర్పాటు చేశారు. మీడియాకు ఎక్కారు. ధిక్కార స్వరం వినిపించారు. ఈ సమావేశానికి హాజరయ్యారన్న నెపంతో మరికొందరిని పార్టీనుంచి సస్పెండు చేశారు. ఇలా సస్పెన్షన్‌కు గురైన మున్సిపల్‌ కో ఆప్షన్‌ మెంబర్‌, మైనారిటీ సెల్‌ నియోజకవర్గ అధ్యక్షుడు సర్దార్‌బాషా ఎమ్మెల్సీ భరత్‌పై తీవ్ర విమర్శలు గుప్పిస్తూ సామాజిక మాధ్యమాల్లో విడుదల చేసిన సెల్ఫీ వీడియో వైరల్‌గా మారింది. విద్యాసాగర్‌ రాజీనామా ప్రకటన చేస్తూ మరోమాట కూడా చెప్పారు. రాజీనామాల పర్వం ఇంతటితో ఆగదని, మరికొందరు ఎమ్మెల్సీ భరత్‌పై అసంతృప్తితో రగులుతున్నారని, వారు కూడా త్వరలోనే పార్టీని వీడనున్నారని సూచనప్రాయంగా తెలిపారు. దీంతో 2024 ఎన్నికల ముందు ‘వైనాట్‌ కుప్పం’ అని హుంకరించిన వైసీపీ అఽధిష్ఠానంలో ప్రస్తుతం ఏ క్షణంలో ఏం జరుగుతుందోన్న గుబులు మొదలైంది.

Updated Date - May 16 , 2025 | 01:13 AM