తోతాపురి సబ్సిడీ రూ.160 కోట్లు
ABN , Publish Date - Sep 01 , 2025 | 02:06 AM
తోతాపురి రైతులకు ప్రభుత్వ సబ్సిడీని ఈ నెలలోనే అందించడానికి జిల్లా యంత్రాంగం కసరత్తు చేస్తోంది. సుమారు 50వేల మంది రైతులకు రూ.160 కోట్ల వరకు జమ చేయనున్నారు.
- ఈ నెలలోనే 50వేల మంది రైతులకు విడతలవారీగా అందే అవకాశం
చిత్తూరు, ఆగస్టు 31 (ఆంధ్రజ్యోతి): తోతాపురి రైతులకు ప్రభుత్వ సబ్సిడీని ఈ నెలలోనే అందించడానికి జిల్లా యంత్రాంగం కసరత్తు చేస్తోంది. సుమారు 50వేల మంది రైతులకు రూ.160 కోట్ల వరకు జమ చేయనున్నారు. ఈసారి తోతాపురి మామిడి ధరలు ఘోరంగా పతనమయ్యాయి. రైతులు ఆందోళనలు చేయకముందే పరిస్థితి అర్థం చేసుకున్న సీఎం చంద్రబాబు కిలోకు రూ.4 సబ్సిడీ ప్రకటించిన విషయం తెలిసిందే. సీజన్‌లో కిలోకు రూ.6 ఇచ్చిన ఫ్యాక్టరీలు.. సీజన్ ముగిసే సమయానికి రూ.8 కూడా ఇచ్చాయి. ర్యాంపులు కూడా రూ.3 నుంచి చివర్లో రూ.8 వరకు ఇచ్చాయి. ప్రభుత్వం రూ.4 ప్రకటించడంతో రైతులకు ఉపశమనం లభించింది. ఆ తర్వాత సీఎం చంద్రబాబు కేంద్రానికి లేఖ రాయడంతో కిలోకు రూ.1.86 ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ముందుకొచ్చింది. మిగిలిన సొమ్ము రాష్ట్ర ప్రభుత్వం వేసుకుని మొత్తంగా రైతులకు కిలోకు రూ.4 ఇవ్వనుంది. ఆ మధ్య జరిగిన మంత్రి మండలి సమావేశంలో తోతాపురి రైతులకు నిధుల్ని విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు.
4 లక్షల టన్నులు.. రూ.160 కోట్లు
జిల్లాలో 3.75 లక్షల టన్నుల తోతాపురి రకం కాయల్ని రైతులు అమ్మారు. 2.30 లక్షల టన్నుల్ని ఫ్యాక్టరీల్లో, 1.45 లక్షల టన్నుల్ని ర్యాంపుల్లో అమ్ముకున్నారు. మన జిల్లా రైతులు తిరుపతి జిల్లాకు తీసుకెళ్లి అమ్మిన కాయలు 20వేల టన్నులు ఉండొచ్చు. మొత్తంగా సుమారు 4 లక్షల టన్నుల కాయలకు ప్రభుత్వం రూ.4 చొప్పున రూ.160 కోట్ల సబ్సిడీ అందించనుంది.
జాబితా పరిశీలన ఇలా..
ఫ్యాక్టరీలు, ర్యాంపుల వద్ద ప్రభుత్వ ఉద్యోగులు విధులు నిర్వహించి మామిడి రైతుల వివరాలను సేకరించిన విషయం తెలిసిందే. ఆ జాబితాలను మరోసారి రైతు సేవా కేంద్రాల్లో పరిశీలిస్తున్నారు. ముందుగా ఫ్యాక్టరీల్లో అమ్ముకున్న రైతుల జాబితా పరిశీలించగా, ర్యాంపుల జాబితా ఆలస్యంగా ప్రారంభించారు. ఇప్పటికే జాబితాల పరిశీలన పూర్తయ్యింది. ఇందులో భాగంగానే ఆయా రైతు సేవా కేంద్రాల్లో తోతాపురి రైతులతో వ్యవసాయ అధికారులు, సిబ్బంది సమావేశాలు నిర్వహించారు. ఏమైనా అభ్యంతరాలుంటే అక్కడే తీసుకుని కరెక్షన్ చేశారు.
తొలుత ఫ్యాక్టరీ రైతులకు..
తొలుత ఫ్యాక్టరీ రైతులకు సంబంధించిన 2.30 లక్షల టన్నుల డబ్బుల్ని జమ చేయనున్నారు. ఆ తర్వాత ర్యాంపుల్లో అమ్మిన 1.45 లక్షల టన్నుల కాయలకు డబ్బులు ఇవ్వనున్నారు. ఈ విషయమై కలెక్టర్ సుమిత్‌కుమార్‌తో మాట్లాడగా, ‘రైతుల అకౌంట్లలో సబ్సిడీ పడడం ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకుంటున్నాం’ అన్నారు.