Share News

కిలో రూ.12 లెక్కన తోతాపురి కొనుగోళ్లు

ABN , Publish Date - Jun 08 , 2025 | 01:27 AM

ఆదివారం నుంచి కొనుగోలు చేయాలని ప్రభుత్వం ఆదేశం

కిలో రూ.12 లెక్కన తోతాపురి కొనుగోళ్లు

తిరుపతి (కలెక్టరేట్‌), జూన్‌ 7 (ఆంధ్రజ్యోతి): తోతాపురి మామిడి కాయలను కిలో రూ.12 లెక్కన ఆదివారం నుంచే కొనుగోలు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి రాజమౌళి శనివారం రాత్రి తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల కలెక్టర్లు వెంకటేశ్వర్‌, సుమిత్‌కుమార్‌, శ్రీధర్‌లతో తోతాపురి మామిడి కొనుగోళ్లపై ప్రత్యేకంగా సమీక్షించారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 4.50లక్షల టన్నుల తోతాపురి దిగుబడి ఉంది. సీజన్‌ ప్రారంభమైనా అటు వ్యాపారులు కానీ, ఇటు మామిడి గుజ్జు పరిశ్రమల యాజమాన్యం కానీ తోతాపురిని కొనుగోలు చేయకపోవడంతో మామిడి రైతాంగం తీవ్ర ఆందోళనకు గురైంది.బహిరంగ మార్కెట్‌లో కిలో రూ.4 కూడా పలక్కడంతో మామిడి రైతులను ఆదుకోవడానికి ముఖ్యమంత్రి ప్రత్యేక చొరవ తీసుకున్నారు. ఆదివారం నుంచి తోతాపురి మామిడి క్రయవిక్రయాలు యుద్ధప్రాతిపదికన జరిగేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్లను ఆదేశించారు. మామిడి గుజ్జు పరిశ్రమలు కిలో మామిడికి రూ.8 చెల్లించనుండగా, ప్రభుత్వం రూ.4 మేర సబ్సిడీ రూపేణా చెల్లించనుంది. ఇందువల్ల ప్రభుత్వంపై రూ.160కోట్ల దాకా భారం పడనుందని అంచనా. ప్రభుత్వం నుంచి రూ.4 అదనంగా వస్తుండటంతో నేటినుంచి మామిడిపల్స్‌ యూనిట్లు కూడా రైతులనుంచి కాయలు కొనుగోలు చేయనున్నాయి.

Updated Date - Jun 08 , 2025 | 01:27 AM