Share News

‘తోతాపురి’ కిలోకు రూ.6కి మించి ఇవ్వలేం

ABN , Publish Date - Jun 16 , 2025 | 12:45 AM

కాదంటే ఫ్యాక్టరీలు మూసేయడానికి సిద్ధమంటున్న యాజమాన్యాలు అచ్చెన్న జిల్లాకొచ్చి ఆదేశాలిచ్చినా రైతులకు నిరాశే మిగిలింది

‘తోతాపురి’ కిలోకు రూ.6కి మించి ఇవ్వలేం
విజయపురంలో చెట్టుకే వదిలేసిన తోతాపురి మామిడి కాయలు

చిత్తూరు సెంట్రల్‌, జూన్‌ 15 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో మామిడి అమ్మకాల వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. మామిడి రైతులను ఆదుకోవాలనే ఉద్దేశంతో కలెక్టర్‌, ఎమ్మెల్యే, మంత్రి, చివరకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు క్షేత్రస్థాయిలో ఆచరణ సాధ్యం కాకపోవడంపై తీవ్ర గందరగోళ పరిస్థితులకు దారితీస్తున్నారు. తోతాపురి మామిడి కిలోకు మద్దతు ధర రూ.12గా నిర్ణయించారు. ఇందులో ప్రభుత్వం సబ్సిడీగా రూ.4 ఇస్తుండగా, ఫ్యాక్టరీలు రూ.8 ఇవ్వాలని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్‌, ఉద్యానశాఖ మంత్రి అచ్చెన్నాయుడు శనివారం జిల్లా వేదికగా ఆదేశించారు. ఇది జరిగిన గంటల వ్యవధిలోనే పరిస్థితులు అందుకు భిన్నంగా మారాయి. మంత్రి ఆదేశాలను ఆదివారం ఫ్యాక్టరీ యాజమాన్యాలు అమలు చేస్తాయని భావించిన రైతులకు నిరాశే మిగిలింది.

ఆరు రూపాయలకు మించి ఇవ్వలేం

కిలోకు ఆరు రూపాయలకు మించి ఇవ్వలేమని పల్ప్‌ ఫ్యాక్టరీల యాజమాన్యాలు స్పష్టం చేశాయి. అంతకుమించి ఇవ్వాలంటే ఫ్యాక్టరీలు మూసేయడానికి సిద్ధమని పేర్కొంటున్నాయి. ప్రభుత్వ ఆదేశాలను గౌరవిస్తామని, అయితే నష్టానికి వ్యాపారాలు చేయలేం కదా అని చెబుతున్నాయి. ఎందుకంటే గత ఏడాదే 2.50 లక్షల టన్నుల పల్ప్‌ నిల్వలు ఉన్నాయని కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయింది. ఇందులో 50 టన్నుల చెడిపోగా, లక్ష టన్నుల వరకు ఇంకా నిల్వ ఉందని చెబుతున్నాయి. ఈ పరిస్థితుల్లో తోతాపురి కిలోకు రూ.8 ఇవ్వాలంటే తాము నష్టపోతామంటున్నాయి.

15 ఫ్యాక్టరీల్లోనే ఉత్పత్తి

జిల్లాలో మొత్తం 39 పల్ప్‌ ఫ్యాక్టరీలున్నాయి. ఇందులో 25 ఫ్యాక్టరీలు ఈ ఏడాది పల్ప్‌ తయారీకి ముందుకొచ్చాయి. అయితే ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించడంతో కేవలం 15 ఫ్యాక్టరీల్లోనే ఉత్పత్తి ప్రారంభమైంది. మరోవైపు తమకు కర్ణాటక, తమిళనాడు నుంచి కేవలం కిలో రూ.4లకే కాయలు అందుతుండటంతో ఇక్కడి రైతుల శ్రేయస్సు దృష్ట్యా రూ.6కి మించి ఇవ్వలేమని యాజమాన్యాలు చెబుతున్నాయి.

తోటల్లోనే రాలిపోతున్న కాయలు

మద్దతు ధర లభించక పోవడంతో పక్వానికి వచ్చిన కాయలు తోటల్లోనే రాలిపోతున్నాయి. మరోవైపు ఫ్యాక్టరీల వద్దకు తీసుకొచ్చిన కాయలను రూ.6కి ఇవ్వాలా వద్దా అని ఇంకొందరు రైతులు తర్జనభర్జన పడుతున్నారు.

లైసెన్స్‌లు రద్దు చేయండి

మంత్రి ఆదేశాలను అమలు చేయని ఫ్యాక్టరీల లైసెన్స్‌లు రద్దు చేయాలంటూ మామిడి రైతుల సంక్షేమ సంఘం కమిటీ కన్వీనర్లు జనార్థన్‌, హరిబాబు, ఆనందనాయుడు, ఉమాపతి తదితరులు మండిపడుతున్నారు. ఈ మేరకు ఫ్యాక్టరీల్లో మద్దతు ధర అమలుపై సోమవారం మరో సారి కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ను కలవనున్నట్లు తెలిపారు. ఫ్యాక్టరీల ముందు ధరల పట్టికను ప్రదర్శించాలని డిమాండ్‌ చేస్తున్నారు. మద్దతు ధర అమలు చేయకుంటే ఫ్యాక్టరీల ముందు ఉద్యమాలు తీవ్రతరం చేస్తామని హెచ్చరిస్తున్నారు.

Updated Date - Jun 16 , 2025 | 12:45 AM