Share News

జిల్లావ్యాప్తంగా కుండపోత

ABN , Publish Date - Oct 05 , 2025 | 01:12 AM

జిల్లాలో శుక్రవారం రాత్రి 9 గంటల నుంచి శనివారం ఉదయం 11 గంటల వరకు కుండపోత వర్షం కురిసింది. అత్యధికంగా సదుం మండలంలో 126.2 మి.మీ వర్షపాతం నమోదు కాగా, అత్యల్పంగా నగరిలో 17.2 మి.మీ వర్షపాతం నమోదైంది.

జిల్లావ్యాప్తంగా కుండపోత
సోమల మండలం బసవపల్లె వద్ద కొట్టుకుపోయిన కల్వర్డు

సదుంలో 126.2 మి.మీ వర్షపాతం

చిత్తూరు సెంట్రల్‌, అక్టోబరు 4(ఆంధ్రజ్యోతి): జిల్లాలో శుక్రవారం రాత్రి 9 గంటల నుంచి శనివారం ఉదయం 11 గంటల వరకు కుండపోత వర్షం కురిసింది. అత్యధికంగా సదుం మండలంలో 126.2 మి.మీ వర్షపాతం నమోదు కాగా, అత్యల్పంగా నగరిలో 17.2 మి.మీ వర్షపాతం నమోదైంది. మిగిలిన మండలాల్లో ... పెద్దపంజాణిలో 108.2 మి.మీ, పలమనేరులో 102.2, గంగవరంలో 99.4, పూతలపట్టులో 96.4, యాదమరిలో 90.4, బంగారుపాళ్యంలో 88.4, పెనుమూరులో 86.8, జీడీనెల్లూరులో 82.6, తవణంపల్లెలో 82.4, చిత్తూరు అర్బన్‌లో 81, ఎస్‌ఆర్‌పురంలో 72.4, సోమలలో 70.4, పులిచెర్లలో 64.6, నిండ్రలో 64.2, వి.కోటలో 58.4, పాలసముద్రంలో 56.4, రొంపిచెర్లలో 52.4, బైరెడ్డిపల్లెలో 51.2, గుడిపాలలో 42.8, గుడుపల్లెలో 42.4, చిత్తూరు రూరల్‌లో 41, రామకుప్పం, వెదురుకుప్పంలో 40.4, కుప్పంలో 30, పుంగనూరులో 28.4, శాంతిపురంలో 26.6, కార్వేటినగరంలో 23.4, ఐరాలలో 22.2, చౌడేపల్లెలో 20.2 మి.మీ వర్షపాతం నమోదయ్యింది.

సోమలలో భారీ వర్షం

సోమల, అక్టోబరు 4 (ఆంధ్రజ్యోతి): సోమల మండలంలో శుక్రవారం రాత్రి భారీ వర్షం కురవడంతో వాగులు, వంకలు పొంగి ప్రవహించాయి. మూడు చోట్ల కల్వర్టులు కొట్టుకుపోయాయి. ఏడు గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. గార్గేయ నది ప్రవాహవేగం పుంజుకుంది. పెద్దఉప్పరపల్లె నుంచి రెడ్డివారిపల్లె మార్గంలో గార్గేయ నదిపై నిర్మించిన తాత్కాలిక కల్వర్టు కొట్టుకుపోయింది. పెద్దఉప్పరపల్లె నుంచి పేటూరు, బసవపల్లె, పొలికి మాకులపల్లె, ఎర్రగుంతలపల్లె, బోనమంద, చిన్నకమ్మపల్లె, దుర్గంకొండ గ్రామాల మార్గంలో పెద్దఉప్పరపల్లె పీహెచ్‌సీ వద్ద కల్వర్టు కొట్టుకుపోయింది. దీంతో పలు గ్రామాలకు రాకపోకలు స్తంభించిపోయాయి. పలు ప్రాంతాల నుంచి వంకలు గార్గేయ నదిలో కలవడంతో నది ఉధృతంగా ప్రవహిస్తోంది. ఈ క్రమంలో పలు గ్రామాల ప్రజలు పెద్దఉప్పరపల్లెకు వెళ్లలేకపోతున్నారు. పెద్దఉప్పరపల్లె నుంచి బసవపల్లె,పేటూరు, బూరగపల్లె, సరకల్లు, పెనుగొలకల, రాయలపేటమీదుగా పలమనేరు మార్గంలోనూ రాకపోకలు స్తంభించాయి. పెద్దఉప్పరపల్లె టు పలమనేరు బస్సును కూడా రద్దు చేశారు. అలాగే పెద్దఉప్పరపల్లె నుంచి చౌడేపల్లె మార్గంలో దేవళకుప్పం వద్ద సీతమ్మ చెరువుకు వచ్చే వంక ఉధృతితో బయ్యారెడ్డిపల్లె, మేకలచిన్నేపల్లె, దేవళకుప్పం, చిన్నదేవళకుప్పం గ్రామాలకు రాకపోకలు ఆగిపోయాయి. పెద్దఉప్పరపల్లె నుంచి రెడ్డివారిపల్లె, దుర్గంకొండ మార్గంలోని గార్గేయనది ఉధృతితో ఈ మార్గంలో ప్రయాణాలు స్తంభించాయి. సోమల - పెద్దఉప్పరపల్లె మార్గంలోని సీతమ్మచెరువు మొరవ వద్ద భారీ నీటి ప్రవాహంతో ఈ మార్గంలో రాకపోకలు స్తంభించాయి. ఆర్టీసీ బస్సులు కూడా ఆపేశారు. సోమల - నంజంపేట మార్గంలోని జీడిరేవుల వంక ఉధ్రుతితో తాత్కాలిక కల్వర్టు వద్ద మాజీ ఎంపీటీసీ సభ్యుడు రమేశ్‌ నాయుడు ఎక్స్‌కవేటర్‌తో పనులు చేపట్టారు. గార్గేయనది, బసవపల్లె మార్గంలో మాజీ వైస్‌ ఎంపీపీ ఉమాపతి నాయుడు పనులను పర్యవేక్షించారు. నంజంపేట వద్ద ఉన్న ధళవాయి చెరువుకు వర్షపు నీరు చేరడంతో తాత్కాలికంగా వేసిన కల్వర్టు నీటిలో మునిగిపోయింది. గత ఏడాది అక్టోబరులో కురిసిన భారీ వర్షాలతో దళవాయి చెరువు మొరవ ఉధృతితో కట్ట తెగిపోయింది. దీంతో నంజంపేట నుంచి పొదలకుంటపల్లె, తుగడంవారిపల్లె, సి.వడ్డిపల్లె, సూరయ్యగారిపల్లె మార్గంలో రాకపోకలు ఆగిపోయాయి. ఈ మార్గంలో వచ్చే బస్సులు ఏడాదిగా రద్దు చేశారు. నంజంపేట - తుగడంవారిపల్లె, పొదలకుంటపల్లె మార్గంలో ప్రజల రాకపోకలకు చెరువులోనే తాత్కాలిక కల్వర్టు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం కురిసిన వర్షాలకు ఆ కల్వర్టు నీటమునిగింది.

పలు పంటలకు తీవ్ర నష్టం

వర్షంతో వేరుశనగ పంట కుళ్లిపోనుంది. తొలుత వర్షం లేక పంట నష్టం కాగా తర్వాత అంతో ఇంతో పండిన పంట వర్షం పాలైంది. భూమిలో ఉన్న వేరుశనగ పంట మొలకలెత్తుతుండగా, ఉబ్బడి కావాల్సిన వేరుశనగ కాయలు నల్లగా మారి బూజుపడుతున్నాయి.పలు మార్గాల్లో రాకపోకలు ఆగిపోవడంతో బొప్పాయి, టమోటా పంటను మార్కెట్‌కు తరలించడానికి వీలులేక రైతులు ఇబ్బంది పడుతున్నారు.శనివారం సోమల ఎస్‌ఐ శివశంకర సిబ్బందితో కలసి తెగిన కల్వర్టులను పరిశీలించి ఆ ప్రాంతంలోకి ప్రజలు వెళ్లకుండా పహరా చూస్తున్నారు. రైతులు పొలాల వద్దకు వెళ్లకుండా గార్గేయ నది వైపు రాకుండా చర్యలు తీసుకున్నారు.

జోరుగా సాగుతున్న గార్గేయ నది

సదుం, అక్టోబరు 4(ఆంధ్రజ్యోతి):సదుం మండల పరిధిలో శుక్రవారం రాత్రి నుంచి ఉదయం వరకు ఎడతెరపి లేని వర్షం కురిసింది. దీంతోపాటు ఎగువ ప్రాంతాలైన సోమల, చౌడేపల్లె మండలాల్లో భారీ వర్షం కురవడంతో కొర్లకుంటవారిపల్లె ప్రాజెక్టు మొరవపోతూ గార్గేయ నదిలోకి నీరు చేరుతోంది.దీంతో గార్గేయ నది జోరుగా సాగుతోంది.వర్షంతో పలుచోట్ల విద్యుత్‌ స్తంభాలు నేలకొరిగాయి. తుమ్మగుంటపల్లెలో ఓ ఇంటిపై నేలకొరిగిన విద్యుత్‌ స్తంభంతో పెద్దప్రమాదం తృటిలో తప్పింది. భారీ వర్షాల నేపథ్యంలో పొంచి ఉన్న విద్యుత్‌ ప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలని ట్రాన్స్‌కో ఏఈ చంద్రశేఖర్‌ సూచించారు.తడిసిన కరెంటు స్తంభాలను ముట్టుకోకూడదని, తడిసిన చేతులతో స్టార్టర్లు, మోటర్లు ముట్టుకోరాదని, ఉతికిన బట్టలు ఇనుక కమ్మీలపై వేయకూడదని, ఉరుములు, మెరుపుల సమయంలో ముందస్తుగా టీవీలు, ఫ్రిజ్‌లు ఆఫ్‌ చేసి పెట్టుకోవాలని సూచించారు.

కృష్ణాపురం రిజర్వాయర్‌ గేటు ఎత్తివేత

వెదురుకుప్పం, అక్టోబరు 4(ఆంధ్రజ్యోతి): కార్వేటినగరం మండలం కృష్ణాపురం రిజర్వాయర్‌లో వరద నీటితో నీటి మట్టం పెరిగింది. ఈ నేపథ్యంలో శనివారం సాయంత్రం ఒక గేటును ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు.ఈఈ జి.మురళికుమార్‌, డీఈఈ వరప్రసాద రెడ్డి, ఏఈఈ పీఎస్‌ భాస్కర్‌ రాజీవ్‌ పాల్గొన్నారు.

Updated Date - Oct 05 , 2025 | 01:12 AM