పొలాల్లోనే టమోటా
ABN , Publish Date - May 06 , 2025 | 01:12 AM
ఎవరో కొంతమంది అదృష్టవంతులు తప్ప టమోటా రైతులంతా ఏటా నష్టాలు చవిచూస్తూనే వున్నారు.ఈ సారైనా మంచి ధరొస్తుందన్న ఆశతో సీజన్‌తో పనిలేకుండా టమోటా సాగునే నమ్ముకుని అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు.
- ధరల్లేక....కోత కూలీలు రాక వదిలేస్తున్న రైతులు
సోమల, మే 5 (ఆంధ్రజ్యోతి): ఎవరో కొంతమంది అదృష్టవంతులు తప్ప టమోటా రైతులంతా ఏటా నష్టాలు చవిచూస్తూనే వున్నారు.ఈ సారైనా మంచి ధరొస్తుందన్న ఆశతో సీజన్‌తో పనిలేకుండా టమోటా సాగునే నమ్ముకుని అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు.ఒక్క సోమల మండలంలోనే 3వేల ఎకరాల్లో టమోటా సాగు జరుగుతుండడమే ఇందుకు నిదర్శనం. పెద్దఉప్పరపల్లె, సోమల, నంజంపేట, ఇరికిపెంట, నడింపల్లె, కందూరు తదితర పంచాయతీల్లో టమోటానే ప్రధాన పంట.ఎకరా సాగుకు దాదాపు రెండు లక్షల రూపాయల దాకా ఖర్చు చేస్తున్నారు.ప్రస్తుతం 30కిలోల బాక్సు రూ. 100కు చేరుకుంది. రెండో రకం 15కిలోల బాక్సు రూ.30లోపే పలుకుతోంది.సోమలలో మార్కెట్ యార్డు లేకపోవడంతో దూర ప్రాంతాలైన మదనపల్లె, పుంగనూరు, పలమనేరు, కోలారు, వడ్డిపల్లె క్రాస్‌కు టమోటాలను తరలిస్తుండడంతో రవాణా ఖర్చులు కూడా రైతులకు రావడం లేదు.బాక్సుకు రవాణా ఖర్చు కింద రూ. 20 చెల్లిస్తున్నారు. కమీషన్ మాత్రమే పదిశాతం మండీవాళ్లు తీసుకుంటున్నారు. మార్కెట్‌కు అధికంగా టమోటాలు రావడంతో కోతలు చేసేందుకు మండీవాళ్లు బాక్సులు కూడా ఇవ్వడం లేదు. మరోవైపు ఎండల తీవ్రతతో కూలీలు పనులకు సరిగా రావడంలేదు. దీంతో కూలీల ఖర్చులు పెరగడంతో కోతలు కూడా చేయలేక పోతుండడంతో తోటల్లోనే పండ్లు మాగి పోతున్నాయి. మార్చి నెలలో నాట్లు వేసిన రైతుల తోటల్లో దిగుబడులు మే 20 నుంచి వస్తాయి.దీంతో దిగుబడులు మరింత పెరిగి ధరలు మరింత దిగజారే పరిస్థితి ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు.