పాతాళానికి పడిపోయిన టమోటా ధరలు
ABN , Publish Date - May 19 , 2025 | 01:30 AM
టమోటా ధరలు పాతాళానికి పడిపోయాయి. దీనివల్ల సుమారు రూ.100 కోట్లకుపైగా నష్టం రైతులకు వాటిల్లినట్లు అంచనా. ఈ ఏడాది ఇతర రంగాల్లోని వ్యక్తులు కూడా టమోటా సాగు చేశారు. దీనివల్ల గతంతో పోలిస్తే ఈసారి మూడు రెట్ల సాగు విస్తీర్ణం పెరిగింది. దీనివల్ల నాణ్యత కలిగిన కాయలకు కూడా గిట్టుబాటు ధర లభించలేదు. ఈ పరిణామాలతో సామాన్య రైతు మాత్రం కుదేలవుతున్నాడు.
ఇతర రంగాల్లోని వ్యక్తుల రాకతో భారీగా సాగు పెరగడమూ ఓ కారణం
కుదేలవుతున్న సామాన్య రైతు
టమోటా ధరలు పాతాళానికి పడిపోయాయి. దీనివల్ల సుమారు రూ.100 కోట్లకుపైగా నష్టం రైతులకు వాటిల్లినట్లు అంచనా. ఈ ఏడాది ఇతర రంగాల్లోని వ్యక్తులు కూడా టమోటా సాగు చేశారు. దీనివల్ల గతంతో పోలిస్తే ఈసారి మూడు రెట్ల సాగు విస్తీర్ణం పెరిగింది. దీనివల్ల నాణ్యత కలిగిన కాయలకు కూడా గిట్టుబాటు ధర లభించలేదు. ఈ పరిణామాలతో సామాన్య రైతు మాత్రం కుదేలవుతున్నాడు.
- పుంగనూరు, ఆంధ్రజ్యోతి
టమోటా సాగు గత ఏడాది తక్కువగా ఉండింది. దీనికితోడు పలు రకాల వైరస్, ఊజీగ, ఆకుముడత, తదితర రోగాలతో పాటు సాగునీటి కొరతతో పంట దిగుబడి తగ్గింది. ఈ కారణాలతో డిమాండ్ పెరిగి ధరలు ఆకాశాన్నంటాయి. దీన్నిచూసి ఈ ఏడాది కూడా రేటు భారీగా ఉంటుందని భావించిన ఉభయ తెలుగురాష్ర్టాలతోపాటు కర్ణాటక, తమిళనాడులోని సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు, ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, వివిధశాఖల అధికారులు, వ్యాపారులు, ధనవంతులైనవారు టమోటా సాగువైపు మొగ్గుచూపారు. పోటీపడి సాగు చేయడంతో విస్తీర్ణం పెరగడంతోపాటు దిగుబడీ అధికంగా వచ్చింది. సాధారణంగా ఎకరానికి 30 టన్నుల దిగుబడి వస్తుంది. మోతాదుమించి ఎరువులు వాడకం, కర్రలు కట్టడంతో దిగుబడి బాగా పెరిగింది. ఎకరాకు రూ.3లక్షలకుపైగా పెట్టుబడి పెట్టారు. ఇంతవరకు బాగానే ఉన్నా పంట అమ్ముదామనుకునేసరికి ధరలు భారీగా పడిపోయాయి. ఇతర రంగాల్లోని వారి మాటెలా ఉన్నా సామాన్య రైతు మాత్రం దిక్కుతోచని స్థితిలో ఉన్నాడు. కూలీ ఖర్చులు కూడా రాకపోవడంతో పంటను పొలాల్లోనే చాలామంది వదిలేస్తున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరుతున్నారు.
సాగు వివరాలు
జిల్లాలో పుంగనూరు, పలమనేరు, కుప్పం నియోజకవర్గంలో టమోటా అత్యధికంగా సాగైంది. సాధారణ సాగు 1550 హెక్టార్లు ఉండగా ప్రస్తుతం దాదాపు 3వేల హెక్టార్లు సాగు చేశారు. పుంగనూరు మండలంలో గతంలో 1000 ఎకరాల్లోపు సాగు ఉండగా, ప్రస్తుతం 3,500 ఎకరాల్లో సాగైంది. అలాగే సోమలలో 2,500, చౌడేపల్లెలో 2,000, రొంపిచెర్లలో 1,500, పెద్దపంజాణిలో 1,500, పులిచెర్ల, సదుం మండలాల్లో 600 ఎకరాల చొప్పున సాగు చేశారు.
ధరలిలా..
ఫిబ్రవరి నుంచి టమోటా కిలో ధర అత్యధికంగా రూ.13 చొప్పున నాలుగురోజులు మాత్రమే పలికింది. మిగిలిన రోజుల్లో రూ.10 నుంచి రూ.5 వరకు పలికింది. ఆదివారం పుంగనూరు వ్యవసాయ మార్కెట్‌కు 888.18 మెట్రిక్ టన్నులు సరుకు రాగా మొదటి రకం టమోటా కిలో రూ.9, రెండో రకం రూ.8.40, మూడో రకం కిలో రూ.8 ధర పలికింది.
బయట రాష్ట్రాల్లోనూ పెరిగిన పంట
పుంగనూరు మార్కెట్ నుంచి శ్రీకాకుళం, వైజాగ్, అనకాపల్లె, కోల్‌కత్తా, రాయపూర్, చెన్నై, ఒడిశా, తమిళనాడు ప్రాంతాలకు టమోటాలు ఎగుమతి అవుతాయి. బయట రాష్ట్రాల్లో కూడా పంట పెరగడంతో అక్కడ డిమాండ్ లేక ధరలు తగ్గిపోయాయి.
వేలం వెర్రిగా సాగు చేయడంతోనే
జిల్లాలో ఈఏడాది రైతులతోపాటు ఇతర రంగాల్లోని వ్యక్తులు ప్రవేశించి వేలంవెర్రిగా టమోటా సాగు చేశారు. దీనివల్ల అత్యధికంగా దిగుబడి వచ్చి.. ధరల్లేక నష్టాలు వచ్చాయి. బయట ప్రాంతాల్లోనూ టమోటా సాగు పెరిగింది. దాంతో జిల్లాకు బయట ట్రేడర్లు రావడంలేదు. చిత్తూరులోని రెండు ఫ్యాక్టరీలవారు మాత్రం కిలో రూ.5 చొప్పున తీసుకుంటున్నారు. ఇకనైనా రైతుల్లోనూ మార్పు వచ్చి.. ఇతర పంటలపైనా దృష్టి పెట్టాలి.
- మధుసూదన్‌రెడ్డి, చిత్తూరు హార్టికల్చర్ డిప్యూటీ డైరెక్టర్
సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ల రాకతో నష్టపోయాం
ఈసారి ఎక్కడి నుంచో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు భారీగా పొలాలు తీసుకుని, మనుషులను పెట్టి పంట సాగు చేశారు. దిగుబడి ఎక్కువగా వచ్చింది. దీనివల్ల డిమాండ్ తగ్గడంతో అసలైన రైతులం తీవ్రంగా నష్టపోయాం. నేను ఎకరం పొలంలో రూ.2లక్షలు ఖర్చు చేసి మూడు (అదున్లు) విడతలుగా టమోటా సాగు చేశాను. దిగుబడి బాగా వచ్చినా ధరల్లేక.. కూలీల ఖర్చులు కూడా రాలేదు.
- చెంగల్రాయప్ప, రైతు, బి.కదిరేపల్లె
కష్టం మిగిలింది
సాగు విపరీతం కావడంతో టమోటా నారు విక్రయించే నర్సరీ యజమానులు, ఎరువులు, క్రిమిసంహారక మందులు అంగడి వాళ్లు మాత్రం బాగుపడ్డారు. గిట్టుబాటు ధర వస్తుందని ఆశగా ఎదురుచూసినా ప్రయోజనం లేకపోయింది. రైతులకు నష్టంతోపాటు కష్టం మిగిలింది.
- రెడ్డెప్పరెడ్డి, రైతు, బిల్లేరు
కూలీల ఖర్చులూ రాలేదు
మంచి ధరలు వచ్చి గతంలో చేసిన అప్పులు తీర్చుకుందామని ఎంతో కష్టపడి టమోటా సాగు చేశారు. కానీ ఈ సీజన్‌లో గిట్టుబాటు ధర పలకలేదు. కూలీల ఖర్చులూ రాలేదు.
- నాగరాజ, రైతు, సోమల