Share News

ఆందోళనలో టమోటా రైతులు

ABN , Publish Date - May 31 , 2025 | 01:38 AM

సోమల - కందూరు రోడ్డు పక్కనే పారబోసిన టమోటాలివి.టమోటా సాగు చేసిన రైతులు గిట్టుబాటు ధరలు లేకపోవడంతో రోడ్డుపైనే పారబోస్తున్నారు. శుక్రవారం 15కిలోల బాక్సు మొదటి రకం రూ. 60 మాత్రమే పలికింది.

ఆందోళనలో టమోటా రైతులు

సోమల - కందూరు రోడ్డు పక్కనే పారబోసిన టమోటాలివి.టమోటా సాగు చేసిన రైతులు గిట్టుబాటు ధరలు లేకపోవడంతో రోడ్డుపైనే పారబోస్తున్నారు. శుక్రవారం 15కిలోల బాక్సు మొదటి రకం రూ. 60 మాత్రమే పలికింది. రెండో రకం టమోటాలు రూ. 30 లోపు పలికాయి. మూడో రకం టమోటాలైతే మార్కెట్‌కే తీసుకురావొద్దని మండీ యజమానులు చెప్పడంతో పొలాల వద్దనే వదిలేస్తున్నారు.కొంతమంది పశువులకు మేతగా వేస్తున్నారు. టమోటా దిగుబడులు ఎక్కువై పోవడంతో మండీల్లో ఖాళీ బాక్సులు కూడా ఇవ్వడం లేదని రైతులు వాపోతున్నారు. సోమల మండలం నుంచి పలమనేరు, పుంగనూరు మార్కెట్లుకు టమోటా బాక్సుకు రవాణా ఖర్చులే రూ. 20 అవుతాయి. మండీ యజమానులు కమీషన్‌ 10శాతం వసూలు చేస్తున్నారు. కోత కూలీ మరో రూ.10 అవుతుంది. పెరిగిపోతున్న ఖర్చులతో, దిగుబడులెక్కువై తగ్గిపోతున్న ధరలతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కూలీ ఖర్చులు కూడా రాకపోవడంతో చాలామంది కోతలు ఆపేశారు. ఎండ వేడిమికి టమోటాలు పెద్దఎత్తున మాగిపోవడంతో గత్యంతరం లేక మార్కెట్‌కు తీసుకొచ్చి తెగనమ్ముకోవాల్సి వస్తోందని కొందరు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

-సోమల, ఆంధ్రజ్యోతి

Updated Date - May 31 , 2025 | 01:38 AM