నేడు అన్నదాత సుఖీభవ నిధుల జమ
ABN , Publish Date - Nov 19 , 2025 | 12:23 AM
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీకి అనుగుణంగా సీఎం చంద్రబాబు అన్నదాతకు సుఖీభవ పథకాన్ని విజయవంతంగా అమలు చేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం అందించిన సాయం కంటే రెట్టింపుగా అందిస్తామన్న మాట నిలబెట్టుకుంటున్నారు. ఇదివరకే అన్నదాతకు సుఖీభవ పథకంలో భాగంగా తొలి విడత నిధులు రైతులకు అందగా, బుధవారం రెండో విడత సాయం అందించనున్నారు.
చిత్తూరు, నవంబరు 18 (ఆంధ్రజ్యోతి): ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీకి అనుగుణంగా సీఎం చంద్రబాబు అన్నదాతకు సుఖీభవ పథకాన్ని విజయవంతంగా అమలు చేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం అందించిన సాయం కంటే రెట్టింపుగా అందిస్తామన్న మాట నిలబెట్టుకుంటున్నారు. ఇదివరకే అన్నదాతకు సుఖీభవ పథకంలో భాగంగా తొలి విడత నిధులు రైతులకు అందగా, బుధవారం రెండో విడత సాయం అందించనున్నారు. ప్రతి రైతు ఖాతాలో రూ.7 వేలు జమ కానున్నాయి.రాష్ట్రప్రభుత్వ అన్నదాత సుఖీభవ పథకంలో భాగంగా జిల్లాలోని 2,05,753 మంది రైతులకు రూ.5 వేల చొప్పున రూ.102.88 కోట్లు అందించనున్నారు. అలాగే కేంద్ర పథకం పీఎం కిసాన్‌లో భాగంగా 1,67,900 మందికి రూ.2 వేల చొప్పున రూ.33.58 కోట్ల సాయం అందనుంది.తొలి విడతలో భాగంగా ఇంత మొత్తంలోనే ఆగస్టులో రైతులకు సాయాన్ని అందించారు.వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర వాటా (రైతు భరోసా) కింద రూ.7500.. కేంద్ర వాటా (పీఎం కిసాన్) రూ.6 వేలు, కలిపి రైతులకు మొత్తంగా రూ.13,500 సాయం అందేది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రూ.7500గా ఉన్న రాష్ట్ర వాటాను రూ.14 వేలకు చంద్రబాబు పెంచారు. దీనికి రూ.6 వేలు కేంద్ర వాటా అదనం. ఇప్పటికే రాష్ట్ర వాటా రూ.5 వేలు, కేంద్ర వాటా రూ.2 వేలు కలిపి మొత్తంగా రూ.7 వేలను రైతులకు అందించారు. బుధవారం ఇదే పద్ధతిలో రెండో విడత అందిస్తున్నారు. మూడో విడతలో రాష్ట్ర వాటా రూ.4 వేలు, కేంద్ర వాటా రూ.2 వేలు కలిపి రూ.6 వేలు రైతులకు అందనున్నాయి. అంటే ఏడాదికి ఒక్కో రైతుకు రూ.20 వేల సాయం అందుతోంది.
నియోజకవర్గాల్లో అధికారిక కార్యక్రమాలు
సీఎం చంద్రబాబు కడప జిల్లా కమలాపురం నియోజకవర్గంలో నిర్వహిస్తున్న రెండో విడత నిధుల విడుదల కార్యక్రమంలో పాల్గొంటారు. అన్ని నియోజకవర్గాల్లోనూ ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గొని రైతులకు సాయాన్ని అందించాలని ఆయన ఇప్పటికే సూచించారు. చిత్తూరు జిల్లా విషయానికొస్తే బుధవారం అన్ని నియోజకవర్గాల్లోనూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. చిత్తూరు నియోజకవర్గానికి సంబంధించి జడ్పీ మీటింగు హాల్లో, పలమనేరుకు సంబంధించి మున్సిపల్ కార్యాలయంలో, పూతలపట్టుకు సంబంధించి యాదమరి ఎంపీడీవో కార్యాలయంలో,పుంగనూరుకు సంబంధించి ఎంపీడీవో కార్యాలయంలో, కుప్పానికి సంబంధించి మార్కెట్ యార్డులో, నగరికి సంబంధించి పుత్తూరు ఎంపీడీవో కార్యాలయంలో, జీడీనెల్లూరుకు సంబంధించి ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు.