Share News

నేడే 101వ రాకెట్‌ ప్రయోగం

ABN , Publish Date - May 18 , 2025 | 01:44 AM

పీఎస్‌ఎల్వీ శిఖరభాగంలో సిద్ధంగా రీశాట్‌-1బీ ఉపగ్రహం

నేడే 101వ రాకెట్‌ ప్రయోగం
ప్రయోగ వేదిక పై పీఎస్‌ఎల్వీ-సీ 61 రాకెట్‌

సూళ్లూరుపేట, మే 17 (ఆంధ్రజ్యోతి): పీఎస్‌ఎల్వీ-సీ 61 ప్రయోగ సన్నాహాలు శ్రీహరికోట రాకెట్‌ కేంద్రంలో పూర్తయ్యాయి. శాస్త్రవేత్తలతో షార్‌ సందడిగా మారింది. షార్‌లోని మొదటి ప్రయోగ వేదిక మీద రాకెట్‌ నింగిలోకి ఎగిరేందుకు సిద్ధంగా ఉంది. అంతకుమునుపు పీఎస్‌ఎల్వీ ఇంటిగ్రేటెడ్‌ బిల్డింగ్‌ ఫెసిలిటీ (పీఐఎఫ్‌)లో రాకెట్‌ నాలుగు దశల అనుసంధాన పనులు పూర్తిచేసి ప్రయోగ వేదిక వద్దకు తరలించి రీశాట్‌-1బీ ఉపగ్రహాన్ని అనుసంధానం చేశారు. శనివారం ఉదయం 7:59 గంటలకు ప్రారంభమైన కౌంట్‌డౌన్‌ ఆదివారం ఉదయం వరకు 22 గంటలపాటు కొనసాగనుంది. కౌంట్‌డౌన్‌ సమయంలోనే రాకెట్‌లోని రెండు, నాలుగు దశల్లో ధ్రవ ఇంధనాన్ని నింపే ప్రక్రీయను శాస్త్రవేత్తలు పూర్తి చేశారు. ఇస్రో చైర్మన్‌ డాక్టర్‌ వి.నారాయణన్‌ శుక్రవారం రాత్రి షార్‌కు చేరుకొని ప్రయోగ ఏర్పాట్లో నిగమ్నమై ఉన్నారు. ప్రయోగ నేపధ్యంలో షార్‌లో భద్రతను కట్టుదిట్టం చేశారు. సముద్ర మర్గాన కూడా జల్లెడపట్టి గాలిస్తున్నారు. పీఎస్‌ఎల్వీ ప్రయోగాల్లో ఇది 63వ ప్రయోగం కాగా షార్‌ నుంచి 101 ప్రయోగం కావడం విశేషం. 18 నిమిషాల్లో నిర్ణీత కక్ష్యలోకి ఉపగ్రహాన్ని రాకెట్‌ చేరవేస్తుంది.

నాలుగు దశల్లో ..

139 టన్నుల ఘన ఇంధనం గల మొదట దశ భూమికి 69 కి.మీ ఎత్తులోకి 111.64 సెకన్లకు పూర్తవుతుంది. 41 టన్నుల ధ్రవ ఇంధనం గల రెండోదశ 264.34 సెకన్లకు 231 కి.మీ ఎత్తులోకి ఉపగ్రహాన్ని తీసుకువెళ్తుంది. మూడో దశలో 7.65 టన్నుల ఘన ఇంధనం ఉంటుంది. 493 సెకన్లకు 443 కి.మీ ఎత్తులోకి శిఖరభాగాన్ని చేరుస్తుంది. 2.5 టన్నుల ధ్రవ ఇంధనం గల నాలుగో దశ 503.40 సెకన్లకు ప్రారంభమై 1012.24 సెకన్లకు 533 కి.మీ ఎత్తులోకి చేరుతుంది. 1059.24 సెకన్లకు 530 కి.మీ ఎత్తులో నిర్ణీత కక్ష్యలోకి రీశాట్‌-1బీ ఉపగ్రహాన్ని చేరవేస్తుంది. ఉపగ్రహం కక్ష్యలోకి చేరిన వెంటనే భూ కేంద్రాలకు సంకేతాలు అందుతాయి.

Updated Date - May 18 , 2025 | 01:44 AM