నేడే పంచమి తీర్థం
ABN , Publish Date - Nov 25 , 2025 | 02:14 AM
తిరుచానూరు పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో చివరి ఘట్టమైన పంచమితీర్థం (చక్రస్నానం) మంగళవారం జరగనుంది. ఉదయం అమ్మవారి ఉత్సవమూర్తిని, చక్రత్తాళ్వార్‌ను ఆలయం నుంచి వేంచేపుగా పంచమితీర్థం మండపానికి తీసుకురానున్నారు. పది గంటలకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. మధ్యాహ్నం 12.10 గంటలకు.. అభిజిత్ కుంభ లగ్నంలో చక్రత్తాళ్వార్‌ను అర్చకులు పుష్కరిణిలో మునక వేయించనున్నారు. ఆ తర్వాత భక్తులు పుష్కరిణి స్నానాలను ఆచరించనున్నారు. లక్ష మందికిపైగా భక్తులు పుష్కర స్నానం చేయనున్నారు.
మధ్యాహ్నం 12.10 గంటలకు చక్రస్నానం
రోజంతా పంచమి ప్రభావం ఉంటుందన్న టీటీడీ
తిరుచానూరుకు భారీగా చేరుకున్న భక్తులు
నేటి రాత్రి ధ్వజావరోహణంతో ముగియనున్న బ్రహ్మోత్సవాలు
తిరుచానూరు, నవంబరు 24(ఆంధ్రజ్యోతి): తిరుచానూరు పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో చివరి ఘట్టమైన పంచమితీర్థం (చక్రస్నానం) మంగళవారం జరగనుంది. ఉదయం అమ్మవారి ఉత్సవమూర్తిని, చక్రత్తాళ్వార్‌ను ఆలయం నుంచి వేంచేపుగా పంచమితీర్థం మండపానికి తీసుకురానున్నారు. పది గంటలకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. మధ్యాహ్నం 12.10 గంటలకు.. అభిజిత్ కుంభ లగ్నంలో చక్రత్తాళ్వార్‌ను అర్చకులు పుష్కరిణిలో మునక వేయించనున్నారు. ఆ తర్వాత భక్తులు పుష్కరిణి స్నానాలను ఆచరించనున్నారు. లక్ష మందికిపైగా భక్తులు పుష్కర స్నానం చేయనున్నారు. తదనుగుణంగా టీటీడీ ఏర్పాట్లు చేపట్టింది. చక్రస్నానం జరిగే ప్రాంతంలో స్టీల్‌తో గ్రిల్స్ అమర్చారు. వీవీఐపీలకు, వీఐపీలకు, మీడియాకు ప్రత్యేక గ్యాలరీలు ఏర్పాటు చేశారు. చక్రస్నానానికి వచ్చే భక్తులకు అల్పాహారం, పాలు, బిస్కెట్లను టీటీడీ అందించనుంది. రోజంతా పంచమి ప్రభావం ఉంటుందని, భక్తులు సంయమనంతో పుష్కర స్నానం ఆచరించాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. మంగళవారం రాత్రి జరిగే ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.
హోల్డింగ్ పాయింట్‌కొస్తేనే పుష్కరిణికి..
తిరుపతి నుంచి వచ్చే వారికి నవజీవన్ ఆస్పత్రి వద్ద. పూడి నుంచి వచ్చేవారికి స్వర్ణముఖినది ఒడ్డున గోశాల వద్ద. మరొకటి జడ్పీ హైస్కూల్ వద్ద హోల్డింగ్ పాయింట్లు ఏర్పాటు చేశారు. ఈ హోల్డింగ్ పాయింట్ల నుంచే పుష్కరిణి స్నానాలకు అనుమతిస్తారు. ప్రతి హోల్డింగ్ పాయింట్ నుంచి వచ్చే క్యూలైన్లను గేట్ నెంబరు 4కు అనుసంధానం చేశారు. అక్కడ్నుంచి పుష్కరిణిలోకి భక్తులను వదులుతారు. కాగా, సోమవారం రాత్రికే భక్తులు భారీ ఎత్తున హోల్డింగ్ పాయింట్లకు చేరుకున్నారు. వీరిని మంగళవారం ఉదయం 10గంటలకుపైగా పుష్కరిణిలోకి అనుమతించనున్నారు.
పార్కింగ్ కేంద్రాలు
పంచమి తీర్థానికి వచ్చే భక్తులకు శిల్పారామం, మార్కెట్‌యార్డు, తనపల్లి రోడ్డు, నారాయణాద్రి ఆస్పతిరోడ్డు, ముండ్లపూడి వద్ద పార్కింగ్‌కేంద్రాలను ఏర్పాటు చేశారు. భక్తులు తమ వాహనాలను అక్కడ ఆపి హోల్డింగ్ పాయింట్లకు చేరుకోవాలి. ఇక సోమవారం రాత్రి 10గంటల నుంచి మంగళవారం సాయంత్రం వరకు తిరుచానూరులోకి వాహనాలను అనుమతించడం లేదు.
పుష్కరిణి చుట్టూ పటిష్ఠ నిఘా
పంచమితీర్థం సందర్భంగా దాదాపు రెండు వేల మందితో పోలీసుశాఖ భారీ బందోబస్తు ఏర్పాటుచేసింది. పుష్కరిణి, ఆలయ పరిసరాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి కమాండ్ కంట్రోల్ రూమ్‌కు అనుసంధానం చేశారు. కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి ఆలయం, పుష్కరణి పరిసరాలను పరిశీలించడానికి ప్రత్యేక సిబ్బందిని నియమించారు. ఎక్కడైనా సమస్య తలెత్తితే వైర్‌లెస్ సెట్ ద్వారా పోలీసులను అప్రమత్తం చేస్తారు.
అశ్వ వాహనంపై కల్కిగా..
చెర్నాకోలు చేతపట్టి.. అశ్వ వాహనంపై కల్కి రూపంలో పద్మావతీదేవి భక్తులను కటాక్షించారు. తిరుచానూరు అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో సోమవారం రాత్రి అమ్మవారు అశ్వవాహనంపై మాడవీధుల్లో ఊరేగారు. దీంతో ఈనెల 17న రాత్రి చిన్నశేషుడితో మొదలైన అమ్మవారి వాహన సేవలు ముగిశాయి. గడిచిన ఎనిమిది రోజుల్లో 16 వాహనాలపై వివిధ రూపాల్లో అమ్మవారు మాడవీధుల్లో ఊరేగారు. ఆయా కార్యక్రమాల్లో జీయర్ స్వాములు, టీటీడీ ఈవో అనిల్‌కుమార్ సింఘాల్, బోర్డు సభ్యులు పనబాక లక్ష్మి, జానకిదేవి, శాంతారాం, నరే్‌షకుమార్, జేఈవో వీరబ్రహ్మం, ఆలయ డిప్యూటీ ఈవో హరీందర్‌నాథ్, ఏఈవో దేవరాజులు, ఏవీఎస్వో రాధాకృష్ణమూర్తి, అర్చకులు శ్రీనివాసాచార్యులు, బాబుస్వామి, మణికంఠస్వామి, సూపరింటెండెంట్లు రమేష్, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ ప్రసాద్, చలపతి, సుబ్బరాయుడు సుభాస్కర్‌నాయుడు తదితరులు పాల్గొన్నారు.
బ్రహ్మోత్సవాల్లో నేడు
మధ్యాహ్నం 12.10 గంటలు: పద్మసరోవరంలో చక్రస్నానం
రాత్రి 9.30 గంటలు: ధ్వజావరోహణం