Share News

కొవిడ్‌ను కట్టడి చేసేలా..!

ABN , Publish Date - Jun 05 , 2025 | 01:06 AM

జిల్లాలో తొలి కొవిడ్‌ కేసు నమోదుతో వైద్యాధికారులు అప్రమత్తమయ్యారు. కొవిడ్‌ వ్యాప్తి చెందినా ఎదుర్కొనేలా చర్యలు చేపట్టారు. ఇప్పుడు కొత్తగా ఎన్‌బీ.1.8.1, ఎల్‌ఎఫ్‌.7 వేరియంట్లలో కొవిడ్‌ వ్యాపిస్తున్నట్లు వైద్యాధికారులు గుర్తించారు. ఇప్పటికే రాష్ట్రంలో నాలుగు కేసులు రాగా.. అందులో జిల్లాలో పది నెలల చిన్నారి ఉన్నారు.

కొవిడ్‌ను కట్టడి చేసేలా..!
రుయాస్పత్రిలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ఐసీయూ పడకలు

జిల్లాలో తొలి కేసు నమోదుతో అప్రమత్తమైన వైద్యాధికారులు

రుయా, స్విమ్స్‌లో పరీక్షా కేంద్రాలు, ఐసీయూ పడకలు సిద్ధం

తిరుపతి(వైద్యం), జూన్‌ 4(ఆంధ్రజ్యోతి): జిల్లాలో తొలి కొవిడ్‌ కేసు నమోదుతో వైద్యాధికారులు అప్రమత్తమయ్యారు. కొవిడ్‌ వ్యాప్తి చెందినా ఎదుర్కొనేలా చర్యలు చేపట్టారు. ఇప్పుడు కొత్తగా ఎన్‌బీ.1.8.1, ఎల్‌ఎఫ్‌.7 వేరియంట్లలో కొవిడ్‌ వ్యాపిస్తున్నట్లు వైద్యాధికారులు గుర్తించారు. ఇప్పటికే రాష్ట్రంలో నాలుగు కేసులు రాగా.. అందులో జిల్లాలో పది నెలల చిన్నారి ఉన్నారు. ఈ నేపథ్యంలో అధికారులు అప్రమత్తమై కొవిడ్‌ కట్టడి దిశగా సన్నద్ధమవుతున్నారు. ఇందులో భాగంగా స్విమ్స్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కొవిడ్‌ వార్డులో ఆరు వెంటిలేటర్‌ పడకలతోపాటు మరో పది ఆక్సిజన్‌ పడకలను సిద్ధం చేశారు. 22 టన్నుల సామర్థ్యం కలిగిన ఆక్సిజన్‌ ప్లాంటు స్విమ్స్‌లో ఉండటం వల్ల భవిష్యత్తులో ఆక్సిజన్‌కు ఎటువంటి ఇబ్బంది రాదని వైద్యాధికారులు చెప్పారు. ఆర్టీపీసీఆర్‌, రాపిడ్‌ కిట్లు కూడా సమృద్ధిగా అందుబాటులో ఉన్నాయన్నారు. ఇక, రుయాస్పత్రిలోని ప్రత్యేక కొవిడ్‌ వార్డులో 40 ఐసీయూ పడకలను అధికారులు సిద్ధం చేశారు. మూడు ఆక్సిజన్‌ ప్లాంట్లు అందుబాటులో ఉన్నట్లు అధికారులు తెలిపారు. ప్రసూతి ఆస్పత్రిలోనూ గర్భిణుల కోసం ప్రత్యేక కొవిడ్‌ వార్డును సిద్ధం చేయడంతో పాటు సిబ్బందినీ నియమించారు. అలాగే 3కేఎల్‌, 6కేఎల్‌ సామర్థ్యం కలిగిన రెండు ఆక్సిజన్‌ ప్లాంట్లు అందుబాటులో ఉన్నాయి. కొవిడ్‌ ఏ దశలో వచ్చినా సమర్థంగా ఎదుర్కొనేలా సిద్ధమైనట్లు అధికారులు చెబుతున్నారు.

పీహెచ్‌సీల్లోనూ రాపిడ్‌ పరీక్షలు

స్విమ్స్‌, రుయాస్పత్రిలో కొవిడ్‌ పరీక్ష కేంద్రాలున్నా అవసరాన్ని బట్టి పీహెచ్‌సీల్లో కూడా రాపిడ్‌ పరీక్షలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశాం. ప్రజలూ కొవిడ్‌ నిబంధనలు పాటించేలా అవగాహన కల్పించాలని చెప్పాం. ఏ వేరియంట్‌లో కొవిడ్‌ వచ్చినా ఎదుర్కొనేందుకు అవసరమైన మందులు, వైద్యులు, వైద్య సిబ్బంది అందుబాటులో ఉన్నారు. ప్రతీ ఒక్కరూ అప్రమత్తంగా ఉంటే మొదట్లోనే కొవిడ్‌ను పూర్తిగా కట్టడి చేసే అవకాశం ఉంటుంది.

- డాక్టర్‌ బాలకృష్ణ నాయక్‌, డీఎంహెచ్‌వో

చిన్నారుల పట్ల జాగ్రత్త

చిన్నపిల్లల విషయంలో తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా ఉండాలి. చిన్నారుల్లో చిన్నపాటి దగ్గు, జలుబు, జ్వరం వంటి లక్షణాలు కనిపించినా వెంటనే వైద్యులను సంప్రదించి వైద్య సలహాలు తీసుకోవాలి. సొంతంగా మందులు వాడటం మంచిది కాదు. నెలలు నిండని చిన్నారుల విషయంలో మరీ జాగ్రత్తలు పాటించాలి. వీరిని వీలైనంత వరకు బయటకు తీసుకురాకపోవడం ఉత్తమం. చిన్నారుల తల్లిదండ్రులూ బయట తిరిగేసమయంలో కొవిడ్‌ నిబంధనలు పాటించడం మంచిది.

- డాక్టర్‌ మనోహర్‌, చిన్నపిల్లల విభాగాధిపతి, రుయాస్పత్రి

గర్భిణులు అప్రమత్తంగా ఉండాలి

రద్దీ ప్రాంతాల్లో తిరగకపోవడం గర్భిణులకు మంచిది. అలాగే ఒంట్లో నలతగా ఉన్నా, జ్వరం, ఎక్కువ రోజులు జలుబు వంటివి ఉన్నా వైద్య పరీక్షలు చేయించుకోవాలి. పోషక విలువలున్న ఆహారం తీసుకోవాలి. రక్తహీనతతో బాధపడే గర్భిణులు ఎంతో అప్రమత్తంగా ఉండాలి. ప్రధానంగా కొవిడ్‌ నిబంధనలు పాటించాలి.

- డాక్టర్‌ పార్థసారధిరెడ్డి, సూపరింటెండెంట్‌, ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రి

కొవిడ్‌ బారిన పడిన చిన్నారిని తీసుకెళ్లిన తల్లిదండ్రులు

రుయా చిన్నపిల్లల విభాగంలో కొవిడ్‌ బారిన పడి చికిత్స పొందుతున్న పది నెలల చిన్నారిని తల్లిదండ్రులు సిబ్బందికి తెలియకుండా బుధవారం తీసుకెళ్లి పోయారు. ఏర్పేడు మండలం పాపానాయుడుపేట ప్రాంతానికి చెందిన ఈ చిన్నారికి సోమవారం స్విమ్స్‌లో నిర్వహించిన ఆర్టీపీసీఆర్‌ పరీక్షలో కొవిడ్‌ పాజిటివ్‌ వచ్చింది. దీంతో మంగళవారం నుంచి ఆ చిన్నారిని రుయా చిన్నపిల్లల విభాగంలో ప్రత్యేక వార్డులో ఉంచి చికిత్స అందిస్తుండగా, తల్లిదండ్రులు తీసుకెళ్లిపోయారు. ఈ విషయం తెలిసి బుధవారం వైద్యులు, వైద్య సిబ్బంది ఆస్పత్రి పరిసరాల్లో వెతికినా వారి జాడ తెలియరాలేదు. చిన్నారి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని, ఎటువంటి భయం అవసరం లేదని చిన్నపిల్లల విభాగం వైద్యులు పేర్కొన్నారు.

Updated Date - Jun 05 , 2025 | 01:06 AM