అటవీ భూములకూ పట్టాలు
ABN , Publish Date - Oct 08 , 2025 | 01:11 AM
కొత్తగా సర్వే నెంబర్లు సృష్టించారు. అటవీశాఖ పరిధిలోని భూములను రెవెన్యూలో ఉన్నట్లు చూపించారు. పక్కరాష్ట్రానికి చెందిన వారికి పట్టాలిచ్చేశారు. ఇలా 250 ఎకరాల భూంఫట్‌కు పాల్పడ్డారు.
సత్యవేడు, అక్టోబరు 7 (ఆంధ్రజ్యోతి): కొత్తగా సర్వే నెంబర్లు సృష్టించారు. అటవీశాఖ పరిధిలోని భూములను రెవెన్యూలో ఉన్నట్లు చూపించారు. పక్కరాష్ట్రానికి చెందిన వారికి పట్టాలిచ్చేశారు. ఇలా 250 ఎకరాల భూంఫట్‌కు పాల్పడ్డారు. రెవెన్యూ ఉద్యోగులా.. మజాకా అనిపించుకున్నారు. సత్యవేడు మండలం వానెల్లూరు పంచాయతీలో సర్వే నెంబర్ 197/1లో సుమారు 252.16 ఎకరాల అటవీ భూములున్నాయి. వీటిని ఆరు భాగాలుగా విభజించి, కొత్తగా సర్వే.. ఖాతా నెంబర్లు తయారు చేసి రెవెన్యూ భూములుగా రికార్డులలోకి ఎక్కించేశారు. 197/1 స్థానంలో 197/1ఏ, 197/1బీ, 197/1సీ, 197/1డీ, 197/1ఈ, 197/1ఎఫ్ అని సర్వే నెంబర్లు తయారు చేసి చెన్నైకు చెందిన ఆరుగురి పేర్లపై రికార్డులను సృష్టించారు. గుట్టుచప్పుడు కాకుండా మ్యుటేషన్‌కు కూడా దరఖాస్తు చేసుకున్నారు. ఇక్కడ అసలు సంగతి బయట పడడంతో విషయం ఉన్నతాధికారులకు చేరింది. ఇక్కడి రెవెన్యూ అధికారుల తీరుతో జిల్లా ఉన్నతాధికారులూ అవాక్కయిపోతున్నారు. ప్రస్తుతం ఆ సర్వే నెంబర్లను రెడ్ మార్క్‌లో పెట్టినట్లు సమాచారం. ఇందులో ఎవరి పాత్ర ఎంత మేరకు ఉందన్న విషయంపై విచారణ చేపడుతున్నట్లు తెలిసింది.
ఏ పేరు మీద ఎంతెంత?
పీ.శ్రీధరన్ (తండ్రిపేరు పద్మనాభన్) పేరు మీద సర్వే నెంబర్ 197/1ఏ లో 50 ఎకరాల 34 సెంట్లు. అమృతవర్షిణి (తండ్రి పేరు రాజ్‌ఖన్నా) పేరుమీద సర్వే నెంబరు 197/1బీ లో 50 ఎకరాల 34 సెంట్లు. నవీన్ రాజ్‌ఖన్నా (తండ్రి పేరు రాజ్‌ఖన్నా) పేరు మీద సర్వే నెంబర్ 197/1సీ లో 50 ఎకరాల 34 సెంట్లు. అనురాధ జయకుమార్ (తండ్రిపేరు విజయన్ రాజశేఖర్) పేరుమీద సర్వే నెంబర్ 197/1డీలో 50 ఎకరాల 34 సెంట్లు. లతజయ్‌కుమార్ (తండ్రిపేరు జయకుమార్) పేరు మీద సర్వే నెంబర్ 197/1ఈ లో 50 ఎకరాల 34 సెంట్లు. ఆశాసురేష్ పేరుమీద సర్వే నెంబర్ 197/1ఎఫ్ లో 46 సెంట్లకు రికార్డులు సృష్టించారు. ఈ భూములను ఏకంగా అమ్ముకునేందు ప్రయత్నాలు సాగిస్తున్నట్లు సమాచారం.
ఎప్పుడు జరిగింది
2024 సార్వత్రిక ఎన్నికల సమయంలో ఈ అటవీ భూములకు నకిలీ పట్టాలను సృష్టించినట్లుగా తెలుస్తోంది. వీటిని ఆన్‌లైన్‌లో నమోదు చేయించేందుకు నాలుగు నెలల కిందట మ్యుటేషన్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. దీనిపై సంబంధిత అధికారి క్షేత్ర స్థాయిలో విచారించగా ఈ వ్యవహారం బయటపడింది. దీంతో అప్రమత్తమయిన ఆ అధికారి జిల్లా అధికారులకు నివేదిక అందించినట్లు సమాచారం.
జరిగిందిలా..
ఈ ఘటనలో గతేడాది బదిలీల్లో భాగంగా ఎన్నికల నిర్వహణ విధుల నిమిత్తం వచ్చిన కీలకాధికారిపై ఆరోపణలు వినిపిస్తున్నాయి. సాధారణంగా ఎన్నికల విధులకు వచ్చిన తహసీల్దార్లకు భూములకు సంబంధించి పట్టాలు జారీ చేయడం, మ్యుటేషన్లు చేయడం తదితరాలపై అధికారాలు ఉండవు. ఆ అధికారి డిజటల్ సైన్‌ను ఫోర్జరీ చేసి ఇంటి దొంగలే ఈ పని చేసి ఉంటారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కార్యాలయంలో దళారీల కనుసన్నల్లో మెలుగుతున్న కొందరు సిబ్బందిపాత్రపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉండగా మండలంలోని పలు రెవెన్యూ గ్రామాల్లో డీకేటీ భూములకు సంబంధించిన రికార్డులు కనిపించడం లేదంటూ సమాచారం. దీనిపై ఇటీవల కార్యాలయంలో ఉన్నతాధికారులు విచారణ జరపడం గమనార్హం.
అక్రమాలపై చర్యలు తీసుకోండి
తమ పంచాయతీలో చోటు చేసుకుంటున్న భూ అక్రమాలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సూళ్లూరుపేట ఆర్డీవో కిరణ్మయికి వానెల్లూరు వాసులు వినతులు సమర్పించారు. తమ గ్రామంలో జరుగుతున్న రెవెన్యూ మాయపై సమగ్ర విచారణ జరిపి సంబంధిత అధికారులపై కఠిన చర్యలు చేపట్టాలని ఆర్డీవోను కలిసి కోరారు.