Share News

పోలీసు నిఘాలో తిరుపతి

ABN , Publish Date - Nov 22 , 2025 | 12:38 AM

తిరుపతి మీద కూడా పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారు

పోలీసు నిఘాలో తిరుపతి

తిరుపతి(నేరవిభాగం), నవంబరు 21(ఆంధ్రజ్యోతి): భద్రతా బలగాలు దండకారణ్యాన్ని జల్లెడ పడుతుండడంతో మావోయిస్టులు ఏపీలోని నగరాలను అజ్ఞాత ఆవాసాలుగా మార్చుకుంటున్నారనే సమాచారంతో తిరుపతి మీద కూడా పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారు. కార్మికులు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో నిఘా పెంచారు. కానూరు న్యూ ఆటోనగర్‌లో పెద్ద సంఖ్యలో మావోయిస్టులు పట్టుబడిన తర్వాత తిరుపతి ఆటోనగర్‌, తారకరామనగర్‌ వంటి ప్రాంతాల మీద దృష్టి పెట్టారు. అలిపిరిలో చంద్రబాబుపై దాడి సమయంలో నక్సల్స్‌ తిరుపతిలోనే కొంతకాలం పాటు ఉన్నట్టు ఆ తర్వాత వెల్లడైన సంగతి తెలిసిందే. దీంతో దేశం నలుమూలల నుంచి వేలాది మంది రోజూ వచ్చిపోయే తిరుపతిని మావోయిస్టులు సురక్షిత ప్రాంతంగా భావించే అవకాశం ఉండడంతో కొత్త వ్యక్తుల గురించి ఆరా తీస్తున్నారు. యూపీ, బిహార్‌ వంటి ప్రాంతాల నుంచి భవన నిర్మాణ కార్మికులు, కార్పెంటర్లు, రోడ్ల పనివారు పెద్ద సంఖ్యలో తిరుపతిలో ఉంటున్నారు. జీవకోన, మంగళం, తారకరామనగర్‌, ఆటోనగర్‌ ప్రాంతాల్లో పోలీసులు నిరంతర నిఘా ఉంచారు. అనుమానస్పదంగా కనిపిస్తే ప్రశ్నిస్తున్నారు. బాంబు, డాగ్‌ స్క్వాడ్లు కూడా రంగంలోకి దిగినట్టు తెలిసింది. కొత్త వ్యక్తులు తారసపడితే, వారి వివరాలన్నీ సేకరిస్తున్నారు. ఆధార్‌ కార్డు ద్వారా నిర్ధారించుకునే ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిసింది. ఈక్రమంలో ఆధార్‌ కానీ, ఓటరు కార్డు కానీ లేకుండా చాలా మంది ఉన్నట్టు గుర్తించారు. ఎవరైనా అనుమానాస్పద రీతిలో కనిపిస్తే 112 నెంబరుకు ఫోన్‌చేసి సమాచారం ఇవ్వాలని స్థానికులను పోలీసులు కోరుతున్నారు.

Updated Date - Nov 22 , 2025 | 12:39 AM