తిరుపతి తీరు మారుతోంది
ABN , Publish Date - Jul 24 , 2025 | 01:48 AM
5లక్షల జనాభా.. రోజూ లక్షమంది యాత్రికుల తాకిడి ఉండే నగరం తిరుపతి. ఐదేళ్లు గందరగోళంగా మారిన నగర వ్యవస్థను గాడిలో పెట్టడం పెద్ద సవాలు. తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్‌గా నారపెడ్డి మౌర్య ఆ సవాలును స్వీకరించారు.
యూడీఎస్, సీవోసీ, ప్రతిరోజూ తాగునీరు లక్ష్యాలు
తిరుపతి నగర కమిషనర్‌గా మౌర్య బాధ్యతలు చేపట్టి నేటితో ఏడాది
తిరుపతి- ఆంధ్రజ్యోతి : 5లక్షల జనాభా.. రోజూ లక్షమంది యాత్రికుల తాకిడి ఉండే నగరం తిరుపతి. ఐదేళ్లు గందరగోళంగా మారిన నగర వ్యవస్థను గాడిలో పెట్టడం పెద్ద సవాలు. తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్‌గా నారపెడ్డి మౌర్య ఆ సవాలును స్వీకరించారు. ఆర్థిక సమస్యలు అధిగమిస్తూ, ప్రజాప్రతినిధులనూ, అధికార యంత్రాంగాన్నీ సమన్వయం చేసుకుంటూ సాగుతున్నారు. నగరపాలక సంస్థ సారథిగా బాధ్యతలు చేపట్టి నేటికి సరిగ్గా ఏడాది అయిన సందర్భంగా కమిషనర్ మౌర్యతో ఆంధ్రజ్యోతి సంభాషణలోని ముఖ్యాంశాలు..
సవాలుగా స్వీకరించిన బాధ్యత.
రాయలసీమలోనే అత్యంత ప్రాధాన్యం ఉన్న వేడుక తిరుపతి గంగ జాతర. ఆ బాధ్యతలను నాకు అప్పగించారు. నాలుగు నెలలముందే వైకుంఠం టోకెన్ల జారీ సమయంలో తొక్కిసలాట ఘోరం కళ్లముందు మెదుల్తూనే ఉంది. అన్ని విభాగాలతో సమన్వయ సమావేశాలు నిర్వహించాను. చాటింపు రోజు నుంచి కంకణం కట్టుకున్నట్టుగా గంగమ్మ ఆలయంలోనే తిష్టవేసి కూర్చున్నా. సీసీ కెమెరాలను పరిశీలిస్తుండేదాన్ని. వీఐపీ పాసులను రద్దుచేశాం. ఉత్సవ కమిటీ సభ్యుల సపరివార సమేత హడావుడిని తగ్గించా. జాతర చివరి రెండు రోజులు గర్భగుడిలోకి అర్చకేతరులను అనుమతించలేదు. ఒకవైపు కార్పొరేషన్, తుడా బాధ్యతలు చూస్తూ, మరో వైపు జాతరలో ఓ భక్తురాలిగా పొంగళ్లు పెట్టి, సారెలు ఇస్తూ భక్తుల అవసరాలను అడిగి తెలుసుకుంటూ జాతరను జయప్రదం చేయడంలో ప్రధాన భూమిక పోషించానన్న సంతృప్తి కలిగింది.
పన్నుల వసూళ్లు.
పన్నుల వసూళ్లలో తిరుపతి నగరపాలక సంస్థ రాష్ట్రంలోనే మూడో స్థానంలో నిలిచింది. 2023-24లో రూ.84కోట్లు మాత్రమే వసూళ్లు కాగా, ఈసారి వంద కోట్ల మార్కు దాటింది. 2024 వరకు ఇందిరా ప్రియదర్శిని కూరగాయల మార్కెట్ టెండరు రూ.2.58కోట్లు మాత్రమే. అదిప్పుడు జీఎస్టీతో కలిపి దాదాపు రూ.5కోట్లకు పెరిగింది.
టీడీఆర్ బాండ్లపై ప్రజల్లో అసంతృప్తి ఉంది.
నేను బాధ్యతలు తీసుకునే ముందు టీడీఆర్ బాండ్ల అవకతవకలపై గందరగోళ పరిస్థితులు ఉండేవి. ఓవైపు విజిలెన్స్ విచారణ జరుగుతోంది. మరో వైపు టీడీఆర్ మేళా ద్వారా పరిశీలన చేసి నిజమైన లబ్ధిదారులకు బాండ్లు అందజేశాం. ఇప్పటివరకు 242 మందికి బాండ్లు ఇచ్చాం.
ఏడాదిలో ఏమేం చేశారు.
రూ.30కోట్లతో 267 అభివృద్ధి పనులను చేపట్టాం. కొత్తరోడ్లు, ప్యాచ్‌వర్కులు, కాలువల్లో పూడికతీత, తాగునీటి పైపులైన్ల మరమ్మతులు వంటి పనులు జరిగాయి. మరో రూ.30కోట్లతో 50 పనులు టెండరు దశలో ఉన్నాయి. చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న కొర్లగుంట సర్కిల్ (ఆరోక్య ఫార్మసీ) డ్రైనేజీ సమస్యను పరిష్కరించాం. ఎమ్మార్ పల్లిలో యాచకులకు పునరావాస కేంద్రం ఏర్పాటుచేశాం.
ఇవి చేయబోతున్నాం!
ఫ కేంద్ర ప్రభుత్వ ప్రజారోగ్య, పర్యావరణ ఇంజనీరింగ్ సంస్థ (చెప్కో) తిరుపతిలో యూడీఎస్ ప్రక్షాళనకు దాదాపు రూ.90కోట్లు వెచ్చించేందుకు ముందుకొచ్చింది. ట్రీట్‌మెంట్ ప్లాంట్ ద్వారా మురుగునీటిని శుద్ధి చేసి వ్యవసాయానికి వినియోగించేలా చర్యలు చేపడుతున్నాం.
మున్సిపల్ కార్పొరేషన్ భవన నిర్మాణ పనులు నేను బాధ్యతలు తీసుకునేప్పటికి పాతిక శాతం కూడా జరగలేదు. 8 నెలల్లోనే 70 శాతం పూర్తిచేశాం. మరో 8 నెలల్లో పూర్తి చేస్తాం.
స్కావెంజర్స్ కాలనీకి రంగులు వేయడమే కాదు. వారి జీవితాలను రంగులమయం చేయాలనివుంది.
తిరుపతిని వెడ్డింగ్ డెస్టినేషన్‌గా మార్చాలని ఇటీవల తిరుపతి పర్యటనలో సీఎం చెప్పారు. ఆ దిశగా ప్రణాళికలు జరగుతున్నాయి. పెళ్లిళ్లు, జాతీయ, అంతర్జాతీయ సదస్సులకు అవసరమైన అన్ని హంగులు మరో రెండేళ్లలో తిరుపతికి రానున్నాయి.
మరో రూ.50కోట్లతో నగరమంతా ప్రతి రోజూ నీరు ఇచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం.
శ్రీనివాసం సమీపంలో ఈట్ స్ట్రీట్ ఏర్పాటు చేయనున్నాం.
లీలామహల్ వద్ద ఉన్న ఫిష్ మార్కెట్‌ను రేణిగుంట రోడ్డులోని ఓ మాస్టర్ ప్లాన్ రోడ్డు వద్దకు మార్చబోతున్నాం.
స్ట్రీట్ వెండింగ్‌పై సర్వే చేసి కార్డులు ఇచ్చి వెండింగ్ జోన్‌లు పెట్టడం వల్ల ఫుట్‌పాత్ ఆక్రమణలు తగ్గించబోతున్నాం.