భక్తజనంతో పోటెత్తిన తిరుపతి గంగమ్మ ఆలయం
ABN , Publish Date - May 14 , 2025 | 12:38 AM
అడుగడుగునా దండాలు. వీధి, వీధిన అంబళ్లు. నడివీధుల్లో సందళ్లు. వెరసి ఊరంతా జాతర సంబరం చేసుకుంది. అమ్మలుగన్న అమ్మకు పొంగళ్లు పెట్టుకుని ప్రణమిల్లింది. కోర్కెలు తీర్చే కొంగు బంగారాన్ని కళ్లకద్దుకుని తన్మయత్వమైంది. భక్తి పారవశ్యంతో చిందేసింది.
అడుగడుగునా దండాలు. వీధి, వీధిన అంబళ్లు. నడివీధుల్లో సందళ్లు. వెరసి ఊరంతా జాతర సంబరం చేసుకుంది. అమ్మలుగన్న అమ్మకు పొంగళ్లు పెట్టుకుని ప్రణమిల్లింది. కోర్కెలు తీర్చే కొంగు బంగారాన్ని కళ్లకద్దుకుని తన్మయత్వమైంది. భక్తి పారవశ్యంతో చిందేసింది.
- తిరుపతి, ఆంధ్రజ్యోతి
తిరుపతి గంగజాతరకు చాటింపు అనంతరం వివిధ వేషాలలో మునిగితేలిన తాతయ్యగుంట గంగమ్మను మంగళవారం ఉదయాత్పూర్వం విశిష్ట అభిషేకం చేసి ప్రత్యేకంగా అలంకరించారు. మహాభిషేకంలో అర్చకులు మినహా ఎవరినీ అనుమతించలేదు. సర్వాలంకారశోభితమైన గంగమ్మకు అర్చకులు వజ్రకిరీటధారణ చేశారు. సోమవారం అర్ధరాత్రి నుంచే కొందరు భక్తులు దండాలు, పొర్లు దండాలు పెట్టుకుంటూ, వేషాలతో అమ్మవారిని దర్శించుకున్నారు. ఇలా.. అభిషేకానంతర దర్శనం మొదలుకొని నిర్విరామంగా గంగమ్మ భక్తులకు దర్శనమిచ్చారు. పురుషులు పలురకాల విచిత్ర వేషధారణలతో పాటు, మహిళలు కొందరు వేపాకు చీరలు కట్టుకుని అమ్మవారి ఆలయ ప్రదక్షణలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. గర్భాలయంలోకి ఇతరులు వెళ్లకుండా కమిషనర్ మౌర్య కట్టడి చేయడంతో భక్తులకు అసౌకర్యం లేకుండా క్యూలైన్లు ముందుకు కదలాయి.
ఇక, ఒక్క తాతయ్యగుంట గంగమ్మ ఆలయంలోనే కాకుండా.. టీపీ ఏరియాలో తాళ్లపాక పెదగంగమ్మ, చింతలచేనులో ముత్యాలమ్మ, దాసరిమఠంలో మాతమ్మ, పల్లెవీధిలో వేశాలమ్మ, చింతకాయవీధిలో కరిమాను గంగమ్మతో పాటు నగరంలోని చిన్నచిన్న గంగమ్మ ఆలయాల్లోనూ జాతర సంబరాలు జరిగాయి. దీంతో నగరమంతా జాతర సందడి నెలకొంది. మంగళవారం భక్తులు పలు పౌరాణిక, జానపద వేషాలు ధరించి అమ్మవార్లను దర్శించుకున్నారు. వైసీపీ మాజీ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దంపతులు, ఆర్కే రోజాలు అమ్మవారిని దర్శించుకున్నారు. అదేవిధంగా సీపీఐ నేత నారాయణ కూడా ఆలయానికి వచ్చారు. కాగా, వారం రోజుల గంగజాతరలో మంగళవారం ఒక్కరోజు మాత్రమే అమ్మవారికి అలంకరించే బంగారు ముఖ కవచం, వజ్రకిరీటధారిణిని దర్శించుకున్న భక్తులు తన్మయత్వంలో మునిగిపోయారు.
అమ్మకు పొంగళ్లు.. భక్తులకు అంబళ్లు
మంగళవారం వేకువజామునుంచే మహిళా భక్తులు ఆలయ ప్రాంగణం వద్దకు చేరుకున్నారు. ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన కూరగాయల మార్కెట్లో పొంగళ్లు పొంగించి అమ్మవారి ఆలయం వద్దకు వచ్చి నైవేద్యం సమర్చించారు. ఇంటినుంచి తెచ్చుకున్న అంబళ్లను భక్తులను అందజేశారు.
పారిశుధ్యం భేష్
తాతయ్యగుంట గంగమ్మ ఆలయానికి వేలాది మంది భక్తులు సమర్పించే పొంగళ్ల నైవేద్యాలు, జంతుబలుల వ్యర్థాలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయడంలో నగర పాలకసంస్థ పారిశుధ్య కార్మికులు శ్రమించారు. మూడు షిప్టుల్లో 150 మందికిపైగా కార్మికులు నిర్విరామంగా శ్రమించి భక్తులచేత శభాష్ అనిపించుకున్నారు.
నేడు విశ్వరూప దర్శనం
అమ్మవారి విశ్వరూప దర్శనం కోసం భక్తులు వేచి చూస్తున్నారు. పేరంటాల వేషధారులు పంబల వాయిద్యాలతో చాటు మండపం వద్దకు వెళ్లిన తరువాత బేరిశెట్టి ఇంటికి వెళ్లి అక్కడనుండి మరికొన్ని చోట్లకు వెళ్లి పేరంటాలు పూజలు అందుకుంటారు. అక్కడ నుండి బుధవారం వేకువజామున చిన గంగమ్మ చెంప నరికి ఆతరువాత పెద గంగమ్మ చెంప నరకడంతో జాతర సంబరం ముగుస్తుంది.