Share News

తిరుపతి కార్పొరేషన్‌కు ‘సేసా’ అవార్డు

ABN , Publish Date - Dec 20 , 2025 | 02:58 AM

తిరుపతి నగరపాలక సంస్థకు స్టేట్‌ ఎనర్జీ కన్జర్వేషన్‌ అవార్డు (సేసా-2025) వచ్చింది. విద్యుత్‌ వినియోగం తగ్గించడంపై రాష్ట్ర ఇంధన పరిరక్షణ అవార్డు కింద తిరుపతికి గోల్డ్‌ మెడల్‌ ప్రకటించారు.

 తిరుపతి కార్పొరేషన్‌కు ‘సేసా’ అవార్డు

తిరుపతి, డిసెంబరు 19 (ఆంధ్రజ్యోతి): తిరుపతి నగరపాలక సంస్థకు స్టేట్‌ ఎనర్జీ కన్జర్వేషన్‌ అవార్డు (సేసా-2025) వచ్చింది. విద్యుత్‌ వినియోగం తగ్గించడంపై రాష్ట్ర ఇంధన పరిరక్షణ అవార్డు కింద తిరుపతికి గోల్డ్‌ మెడల్‌ ప్రకటించారు. తిరుపతి నగరపాలక సంస్థకు ప్రధానంగా తెలుగు గంగ నీటిని నాలుగు ప్రధాన మార్గాల ద్వారా తరలిస్తున్నారు. ఈ నీటిని కేపీ కెనాల్‌ నుంచి తిరుపతికి తీసుకొచ్చేందుకు విద్యుత్‌ వినియోగం ఎక్కువ అవసరం. దీనిని తగ్గించేందుకు రామాపురం పంప్‌ హౌస్‌ నందు తిరుపతి స్మార్ట్‌ సిటీ నిధులతో 4 మెగా వాట్ల ఫ్లోటింగ్‌ సోలార్‌ ప్లాంట్‌ను ఏర్పాటు చేశారు. ఇక్కడ ఉత్పత్తి అయ్యే సోలార్‌ విద్యుత్‌ వినియోగం వల్ల పంప్‌ హౌస్‌ల బిల్లులు గణనీయంగా తగ్గాయి. నగరంలోనూ పలు చోట్ల సోలార్‌ ఏర్పాటు చేయడం వల్ల బిల్లులు తగ్గాయి. వీధి దీపాలకు సంబంధించి సీసీఎంస్‌ బాక్స్‌లను మరమ్మతులు చేసి ఉపయోగం లోకి తెచ్చి ఒకే సమయంలో ఆన్‌-ఆ్‌ఫ చేస్తున్నారు. ఇలాంటి ప్రత్యామ్నాయ చర్యల వల్ల విద్యుత్‌ బిల్లులు తగ్గాయి. 2023-24తో పోలిస్తే 2024-25కి 542143 కిలోవాట్ల విద్యుత్తు ఆదా చేయడంతో అవార్డు లభించింది. దీనిపై అధికారులు, సిబ్బందికి కమిషనరు మౌర్య అభినందనలు తెలిపారు. శనివారం విజయవాడలో జరిగే కార్యక్రమంలో బంగారు పథకాన్ని ప్రదానం చేయనున్నారు. విద్యుత్‌ పొదుపుపై అనేక సంస్కరణల ఫలితమే సేసా అవార్డు రావడమని మౌర్య ‘ఆంధ్రజ్యోతి’కి చెప్పారు.

Updated Date - Dec 20 , 2025 | 02:58 AM