Share News

ముగిసిన పులుల గణన

ABN , Publish Date - Dec 09 , 2025 | 12:05 AM

జిల్లాలోని కౌండిన్య అభయారణ్యంలో ఈనెల ఒకటిన మొదలైన పులుల గణన సోమవారం ముగిసింది

 ముగిసిన పులుల గణన
:సిబ్బందితో ఎఫ్‌ఆర్వో థామస్‌

చిత్తూరు సెంట్రల్‌, డిసెంబరు 8(ఆంధ్రజ్యోతి): జిల్లాలోని కౌండిన్య అభయారణ్యంలో ఈనెల ఒకటిన మొదలైన పులుల గణన సోమవారం ముగిసింది. 4.87 లక్షల ఎకరాల విస్తార్ణం కలిగిన అటవీ ప్రాంతంలో చిత్తూరు ఈస్టు, వెస్టు, కార్వేటినగరం, పలమనేరు, పుంగనూరు, కుప్పం రేంజ్‌లు ఉన్నాయి. ఈ రేంజ్‌ల పరిధిలో 24 సెక్షన్లు, 84 బీట్ల సిబ్బంది గణన ప్రక్రియలో పాల్గొన్నారు. నాలుగేళ్లకోసారి ఈ గణన చేపడుతున్నారు. మూడు రోజుల పాటు 15 కిలో మీటర్లు పరిధిలో సిబ్బంది నడుచుకుంటూ వెళ్లి పులులతో పాటు ఏనుగులు, కుందేళ్లు, జింకలు, అడవి పందులు, ముళ్ళ పందులు, నెమళ్లు, దుప్పులు, అడవి దున్నలు, సర్పజాతి జీవాలను లెక్కలు కట్టారు.. జంతువుల పాదముద్రలు, పెంటికలు, అడవుల్లో జంతువులకు మధ్య జరిగిన పోరాటాల సమయంలో కారిన రక్తపు మరకలు, తదితర వాటిని ఆధారంగా చేసుకుని గుర్తించి, ఫోటోలు తీశారు. అవసరమైన మేరకు అటవీ సరిహద్దు గ్రామస్థుల సహకారం తీసుకున్నారు. అటవీ ప్రాంతంలో అమర్చిన సీసీ కెమెరాల ఫుటేజి వివరాలనూ పరిగణనలోకి తీసుకుని లెక్కలు కట్టారు. వన్యప్రాణులు, అటవీ ప్రాంత వృక్ష జాతులను సైతం గుర్తించారు. వాటి స్వభావాలను, ఔషధ తయారీకి పనికి వచ్చే మొక్కలను గుర్తించారు. ఆది, సోమవారాల్లో పూర్తి సాంకేతికను ఉపయోగించి వన్యప్రాణుల జాడలు, సంచరించే ప్రదేశాలు గుర్తించారు. గణన ప్రక్రియ వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నారు.

Updated Date - Dec 09 , 2025 | 12:05 AM