ఉగాదికి టిడ్కో గృహప్రవేశాలు
ABN , Publish Date - Nov 29 , 2025 | 01:11 AM
ఉగాది నాటికి టిడ్కో గృహాలను లబ్ధిదారులకు అందించేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. శుక్రవారం సీఎం చంద్రబాబు అధ్యక్షతన అమరావతిలో జరిగిన మంత్రి మండలి సమావేశంలో ఈ మేరకు నిర్ణయించారు.
చిత్తూరు, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి): ఉగాది నాటికి టిడ్కో గృహాలను లబ్ధిదారులకు అందించేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. శుక్రవారం సీఎం చంద్రబాబు అధ్యక్షతన అమరావతిలో జరిగిన మంత్రి మండలి సమావేశంలో ఈ మేరకు నిర్ణయించారు. టిడ్కో గృహాలపై తీసుకున్న నిర్ణయంతో చిత్తూరు నగర వాసులు 2832మందికి సొంతింటి కల నెరవేరనుంది. చిత్తూరు నగరం పూనేపల్లె వద్ద 2019 నాటికే అప్పటి టీడీపీ ప్రభుత్వం 2832 టిడ్కో గృహాల నిర్మాణాన్ని పూర్తి చేసింది. ఆ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం నిర్మాణ దశలో ఉన్న 672 గృహాలను రద్దు చేసింది. ఇలా ఉమ్మడి చిత్తూరు జిల్లావ్యాప్తంగా 6288 గృహాలను రద్దు చేసి, డిపాజిట్ చేసినవారికి రూ.37.82 కోట్లను తిరిగి ఇవ్వలేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం పూర్తయిన గృహాలను లబ్ధిదారులకు అప్పగించే ప్రక్రియ చేపట్టింది. టిడ్కో ఇళ్లపై ఏర్పాటు చేసిన సాంకేతిక కమిటీ నివేదిక ప్రభుత్వానికి అందింది. మంత్రుల బృందాన్ని ఏర్పాటుచేసి ఈ నివేదికపై సమగ్రంగా చర్చించి ఏవిధంగా ముందుకెళ్లాలో నిర్ణయం తీసుకోవాలని శుక్రవారం సీఎం చంద్రబాబు సూచించారు.
కేంద్రీయ విద్యాలయకు 8 ఎకరాలు
చిత్తూరు మండలం మంగసముద్రం గ్రామంలో 8.08 ఎకరాల్లోని ప్రభుత్వ భూమిని కేంద్రీయ విద్యాలయకు ఉచితంగా కేటాయించడానికి మంత్రి మండలి ఆమోదం తెలిసింది. ఆ భూమి విలువ సుమారు రూ.2.77 కోట్లుగా అంచనా వేసింది. ఇదిలా ఉండగా, కుప్పంలో నెలకొల్పనున్న కేంద్రీయ విద్యాలయకు ఇప్పటికే భూమిని కేటాయించారు.
పలమనేరు మార్కెట్ కమిటీకి 33 ఎకరాలు
పలమనేరులోని లైవ్‌స్టాక్ రీసెర్చ్ సెంటర్‌కు చెందిన 33 ఎకరాల్ని శ్రీవెంకటేశ్వర వెటర్నరీ యూనివర్శిటీ నుంచి వ్యవసాయ మార్కెట్ కమిటీకి బదిలీ చేసేందుకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఇప్పటికే దీనికి సంబంధించి మార్కెట్ కమిటీ పరిహారం చెల్లించగా, భూమిని అధికారికంగా అప్పగించే ప్రక్రియ చేపట్టనున్నారు. ఈ 33 ఎకరాల్లో ‘పలమనేరు అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ’ ని అన్ని హంగులతో ఏర్పాటు చేయనున్నారు.
దామినీడులో స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఏర్పాటుకు 28 ఎకరాలు
తిరుపతి రూరల్ మండలం దామినీడులో స్పోర్ట్స్ కాంప్లెక్సు ఏర్పాటుకు ప్రభుత్వం 28.37ఎకరాల భూమిని శాప్‌కు కేటాయించేందుకు అంగీకరించింది. దామినీడులో 193-8, 193-9 తదితర సర్వే నంబర్లలోని ఈ భూమిలో ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఏర్పాటు చేయనున్నారు. అందులో భాగంగా జాతీయ ప్రమాణాలతో క్రీడల అభివృద్ధికి మౌలిక సదుపాయాలు కల్పించనున్నారు. కాగా ఈ భూములకు ఎకరా రూ. 2.50 కోట్లు చొప్పున కలెక్టర్ వెంకటేశ్వర్ మార్కెట్ విలువ సిఫారసు చేసినప్పటికీ ప్రభుత్వం పూర్తి ఉచితంగా భూములను క్రీడల కోసం కేటాయించింది.