Share News

సచివాలయాలపై మూడంచెల పర్యవేక్షణ

ABN , Publish Date - Sep 08 , 2025 | 01:12 AM

గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చిన గత ప్రభుత్వ పాలకులు వాటిపై పర్యవేక్షణకు ఎలాంటి యంత్రాంగాన్ని ఏర్పాటు చేయలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ వ్యవస్థను ప్రక్షాళన చేసి మెరుగైన సేవలు అందించాలనే లక్ష్యంతో ప్రత్యేక చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా మూడంచెల పర్యవేక్షణ వ్యవస్థ ఏర్పాటుకు ఉత్తర్వులు విడుదల చేసింది.

సచివాలయాలపై మూడంచెల పర్యవేక్షణ
రవికుమార్‌

చిత్తూరు కలెక్టరేట్‌, సెప్టెంబరు 7 (ఆంధ్రజ్యోతి): గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చిన గత ప్రభుత్వ పాలకులు వాటిపై పర్యవేక్షణకు ఎలాంటి యంత్రాంగాన్ని ఏర్పాటు చేయలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ వ్యవస్థను ప్రక్షాళన చేసి మెరుగైన సేవలు అందించాలనే లక్ష్యంతో ప్రత్యేక చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా మూడంచెల పర్యవేక్షణ వ్యవస్థ ఏర్పాటుకు ఉత్తర్వులు విడుదల చేసింది. జిల్లాలో 612 గ్రామ, వార్డు సచివాలయాలు ఉన్నాయి. వార్డు సచివాలయ కార్యదర్శి నుంచి డిజిటల్‌ అసిస్టెంట్‌ వరకు 11 మంది సిబ్బంది చొప్పున 4,497 మంది పనిచేస్తున్నారు. ప్రభుత్వ పథకాలు, ఇతర సేవలు క్షేత్రస్థాయిలో సచివాలయాల నుంచే అందుతున్నాయి. ఇక్కడి ఉద్యోగులంతా ఇంచుమించుగా ఒకే కేడర్‌కు చెందినవారు కావడంతో పర్యవేక్షణ కొరవడుతోంది.

తాజా వ్యవస్థ ఎలా ఉంటుందంటే.

రాష్ట్రస్థాయిలో సెక్రటేరియట్‌, డైరెక్టరేట్‌లో ప్రత్యేక విభాగం ఏర్పాటు చేస్తారు. జిల్లాలో డీఎల్డీవో, జేడీ స్థాయి అధికారిని గ్రామ, వార్డు సచివాలయాల అధికారిగా నియమిస్తారు. సూపరింటెండెంట్‌, సీనియర్‌ అసిస్టెంట్లను డిప్యుటేషన్‌పై నియమించనున్నారు. వీరితోపాటు ఇద్దరు సాంకేతిక సమన్వయకర్తలు, నలుగురు జూనియర్‌ అసిస్టెంట్లు ఉంటారు. మండలస్థాయిలో గ్రామ, వార్డు సచివాలయ మండల అధికారి, ఇద్దరు జూనియర్‌ అసిస్టెంట్లు ఉంటారు. వీరికి మండల పరిషత్‌ కార్యాలయంలో ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయనున్నారు. గ్రేడ్‌-1, 2 పురపాలక సంఘాల్లో మేనేజరు, ఒక సీనియర్‌ అసిస్టెంట్‌, ఇద్దరు జూనియర్‌ అసిస్టెంట్లు ఉంటారు. నగర పంచాయతీల్లో ఒక సీనియర్‌ అసిస్టెంట్‌, ఇద్దరు జూనియర్‌ అసిస్టెంట్లను నియమించనున్నారు.

ఉత్తర్వులు వచ్చాయి

గ్రామ, వార్డు సచివాలయాల పర్యవేక్షణకు మూడంచెల వ్యవస్థ ఏర్పాటుకు గతవారం ఉత్తర్వులు వచ్చాయి. గ్రామ, వార్డు సచివాలయాలు వీటిపరిధిలో పనిచేసేలా ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేసింది.

- రవికుమార్‌, గ్రామ, వార్డు సచివాలయాల జిల్లా సమన్వయకర్త

Updated Date - Sep 08 , 2025 | 01:12 AM