తిరుపతికి మూడో విడతలో మూడు పదవులు
ABN , Publish Date - May 12 , 2025 | 01:38 AM
రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం విడుదల చేసిన మూడో విడత నామినేటెడ్ పదవుల భర్తీలో తిరుపతికి చెందిన కూటమి నాయకులను మూడు కార్పొరేషన్ పదవులు వరించాయి.
ఏపీజీబీసీ చైర్‌పర్సన్‌గా సుగుణమ్మ
ఏపీహెచ్‌డీసీ ఛైర్మన్‌గా పసుపులేటి హరిప్రసాద్
తుడా ఛైర్మన్‌గా డాలర్ దివాకర్ రెడ్డి
తిరుపతి, మే 11 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం విడుదల చేసిన మూడో విడత నామినేటెడ్ పదవుల భర్తీలో తిరుపతికి చెందిన కూటమి నాయకులను మూడు కార్పొరేషన్ పదవులు వరించాయి. ఏపీ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ (ఏపీజీబీసీ) చైర్‌పర్సన్‌గా సుగుణమ్మ, ఏపీ హస్తకళల అభివృద్ధి కార్పొరేషన్ (ఏపీహెచ్‌డీసీ) ఛైర్మన్ డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్, తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ (తుడా) ఛైర్మన్‌గా డాలర్ దివాకర్ రెడ్డిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఫ మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ 2019 ఎన్నికల్లో రెండోసారి టికెట్ దక్కించుకుని స్వల్ప మెజారిటీతో ఓటమిచెందారు. అప్పటినుంచి నియోజకవర్గ ఇన్‌చార్జిగా వైసీపీ అరాచకాలపై పోరాడుతూ వచ్చారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో పొత్తుల్లో భాగంగా తిరుపతి సీటు జనసేన పార్టీకి పోవడంతో తొలుత నిరుత్సాహపడినా విజయం కోసం శ్రమించారు. కూటమి అధికారంలోకి వచ్చాక ఇంచార్జి హోదాలో ఉంటూ పార్టీ పిలుపునిచ్చిన ప్రతి కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. సభ్యత్వ నమోదులోనూ తిరుపతిని టాప్‌టెన్‌లో ఉంచారు. ఆమె కష్టాన్ని గుర్తించిని పార్టీ అధిష్ఠానం కీలకమైన ఏపీజీబీసీ చైర్‌పర్సన్‌గా అవకాశం ఇచ్చింది.
ఫ జనసేన ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్నారు. టీటీడీ పాలకమండలి సభ్యుడిగా పనిచేశారు. పదేళ్లుగా జనసేన పార్టీ ఉమ్మడి జిల్లా సారఽథ్య బాధ్యతలు నిర్వర్తించారు. గత ఎన్నికల్లో ఎమ్మెల్యే సీటు ఆశించి నిరాశపడినప్పటికీ పార్టీ ఆదేశాల మేరకు పనిచేశారు. జనసేన కోటా నుంచి ఏపీహెచ్‌డీసీ పదవిని దక్కించుకున్నారు. చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలోనూ ఈయన చురుగ్గా పనిచేశారు.
ఫ 2024 ఎన్నికల ముందు చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని విజయం కోసం శ్రమించిన డాలర్ దివాకర్ రెడ్డి తొలి నుంచీ తుడా ఛైర్మన్ పదవికోసం దృష్టి పెట్టారు. ఆదిశగా పావులు కదిపారు. దీనిపై తీవ్ర పోటీ ఉన్నప్పటికీ అన్ని అవాంతరాలను తొలగించుకుని ఎట్టకేలకు తుడా పీఠం దక్కించుకున్నారు.
‘వైసీపీ పాలనలో తుడాను ఒక నియోజకవర్గానికే పరిమితం చేశారు. అలా కాకుండా తుడా పరిధి జిల్లా మొత్తం ఉందని, అవసరమైన చోట తుడా నిధులను వెచ్చించేందుకు ప్రయత్నిస్తాను’ అని డాలర్ దివాకర్ ‘ఆంధ్రజ్యోతి’తో అన్నారు.
కుప్పం నుంచి మరొకరికి..!
ఫ ఏపీఈడబ్ల్యూఐడీసీ చైర్మన్‌గా రాజశేఖర్
కుప్పం: ఆంధ్రప్రదేశ్ విద్య, సంక్షేమ మౌలిక వసతుల అభివృద్ధి కార్పొరేషన్ (ఏపీఈడబ్ల్యూఐడీసీ) చైర్మన్‌గా ఎస్.రాజశేఖర్ నియమితులయ్యారు. పాకాల సమీపం అగ్రహారంలోని రైతు శివయ్య కుమారుడైన ఈయన 20 ఏళ్ల కిందట కుప్పం మండలం కంగుదిలో స్థిరపడ్డారు. ఆర్టీసీ వైస్ చైర్మన్ పీఎస్ మునిరత్నం దగ్గరి బంధువు కూడా. ప్రస్తుతం టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా ఉంటూ అమరావతిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో పనిచేస్తున్నారు. అప్పుడప్పుడూ కుప్పం వచ్చి కుటుంబ వ్యవహారాలు చక్కబెట్టి వెళ్తుంటారు.